Thursday, March 28, 2024

గంజాయి వయా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

Rachakonda police marijuana seized in Hyderabad

ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు తరలింపు
అడ్డాగా చేసుకుంటున్న స్మగ్లర్లు
భారీ ఎత్తున తరలిస్తున్న నిందితులు
ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ గంజాయితో నిండిపోవడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు అడ్డాగా మారుతోంది. అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు గంజాయిని తరలించేందుకు నగరాన్ని వేదికగా చేసుకుంటున్నారు. పోలీసులు తరచూ చేస్తున్న దాడుల్లో ఈ విషయం బయటపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, ఒడిసా రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చిన గంజాయిని స్మగ్లర్లు ఇక్కడి నుంచి రవాణా చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా ముంబాయిలో గంజాయికి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వందల కిలోలను రవాణా చేస్తున్నారు. ఇటీవల రాచకొండ పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో ఓ వ్యక్తి పది రోజుల్లో గతంలో 100కిలోలు ముంబాయికి రవాణా చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు రెండు కార్లలో తరలిస్తున్న 417 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో వందలాది కిలోల గంజాయిని పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోకి స్మగ్లర్లు ఎలా గంజాయిని తీసుకుని వస్తున్నది తెలుసుకుని పోలీసులు నిఘా పెట్టారు. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమకు సమాచారం ఇచ్చేందుకు ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకుని ఎప్పటి కప్పుడు గంజాయి స్మగ్లర్ల విషయాలు తెలుసుకుంటున్నారు. స్మగ్లర్లు కూరగాయల కింద పెట్టి రవాణా చేస్తున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. గతంలో తక్కువ మొత్తంలో స్మగ్లింగ్ చేసేవారు, గత కొంత కాలం నుంచి గంజాయికి మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో దానిని క్యాష్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున గంజాయిని రవాణా చేస్తున్నారు.

కొత్తగా మహిళలు….

గంజాయి స్మగ్లర్లు కొత్తగా గంజాయి రవాణాలకు మహిళలను ఎంచుకున్నారు. వారిపై పోలీసుల నిఘా తక్కువగా ఉండడమే కాకుండా ఎవరూ అంతగా పట్టించుకోరనే అంచనాతో వారికి ఎక్కువ డబ్బులను ఎరగా చూపి వారితో రవాణా చేయిస్తున్నారు. ఈ కేసులు ఇద్దరు మహిళలు డబ్బులకు ఆశపడి అరకు నుంచి రెండు కార్లలో భారీ ఎత్తున గంజాయిని తీసుకుని వచ్చారు. దానిని మహారాష్ట్రకు తరలించేందుకు ఓఆర్‌ఆర్ వద్ద వేరే కారులోకి మార్చుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తమకు డబ్బులు ఆశ చూపడంతో గంజాయి రవాణాలకు అంగీకరించామని మహిళలు తెలిపారు.

సులభంగా డబ్బులు…

నిందితులు ఎపిలోని అరకు ప్రాంతం, ఒడిసా రాష్ట్రం నుంచి స్మగ్లర్లు వందల కిలోల గంజాయిని కిలోకు రూ.1,500 నుంచి రూ.3,000లకు కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. వాటిని ముంబాయిలో కిలోకు రూ.20,000ల నుంచి రూ.30,000లకు విక్రయిస్తున్నారు. గంజాయికి డిమాండ్ ఎక్కువగా ఉండడతో స్మగ్లర్లు రవాణా చేస్తున్నారు. నిందితులను పోలీసులు గతంలో పట్టుకుని జైలుకు తరలించినా కూడా మారడంలేదు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి రవాణా చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు భారీ ఎత్తున గంజాయితో పట్టుబడుతున్నా కూడా ఎక్కడగా తగ్గడంలేదు. గంజాయి విక్రయాలతో లక్షలాది రూపాయలు వస్తుండడంతో దానిని విడవడంలేదు. పెద్ద ఎత్తున కర్ణాటక, మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News