Thursday, April 18, 2024

అమెరికా పోలీసుల దాష్టీకం

- Advertisement -
- Advertisement -

Racial Murder in America

 

ఆగని కరోనా విజృంభణతోపాటు అమెరికాలోని జాత్యహంకార రాజ్యహత్య నిత్య సంచలన వార్తల్లో చోటు చేసుకుంది. అగ్ర రాజ్యంలో జాతి వివక్ష ఈనాటిది కాదు. కరోనా సైతం ఈ వివక్షను సొంతం చేసుకుంది. అమెరికా వ్యాప్తంగా కోవిడ్ 19 బాధితులు, మృతుల్లో నల్ల జాతీయులే ఎక్కువట. కరోనా సోకి అమెరికాలో మరణించిన లక్షకుపై సంఖ్యలో మూడొంతలు నల్ల జాతీయులేనని ‘ది గార్డియన్’ పత్రిక పేర్కొంది. దీనికి తోడు మే, 25న అమెరికాలోని మినియా పొలిస్ రాష్ట్రంలో పోలీసు చేతిలో చనిపోయిన జార్జి పెర్రీ ఫ్లాయిడ్ సంఘటనతో దేశ వ్యాప్తం నిరసనల, ఆందోళనల పరమైంది. 150 నగరాల్లో కర్ఫూ, 6 రాష్ట్రాల్లోని 13 నగరాల్లో ఎమర్జెన్సీ, 67,000 నేషనల్ గార్డు మోహరింపులు కూడా దేశాన్ని శాంతి బాట పట్టించడం లేదు. పైగా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుగు ప్రకటనలు మరింత రెచ్చ గొడుతున్నాయి. నిరసనకారులను వెంటపడి అరెస్టు చేయండి. వారికి పదేళ్లు జైలు శిక్ష వేయాలి. రాష్ట్రాలు నిరాకరిస్తే సైన్యాన్ని దింపుతాను అనే ట్రంప్ మాటలు పరిస్థితుల్ని చక్కదిద్దే రీతిలో కాకుండా గొడవల్ని పెంచే పద్ధతిలో ఉన్నాయి.

అమెరికాలోని నార్త్ కరోలినాలో పుట్టిన, 46 ఏళ్ల జార్జి ఫ్లాయిడ్ చిన్న తనం నుండి ఫుట్‌బాల్ ఆటగాడు, స్కూలు, కాలేజీ స్థాయిలో రాష్ట్ర జట్టును చాంపియన్ స్థాయికి తీసికెళ్లాడు. బతుకు తెరువు కోసం 2014లో మినియా పొలిస్‌కి వచ్చి ఓ రెస్టారెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కరోనా దెబ్బకు ఉన్న ఉద్యోగం ఊడింది.

మే 25న రాత్రి ఎనిమిది గంటలకు ఫ్లాయిడ్ సిగరెట్ పెట్టె కొనడానికి నకిలీ నోటు ఇచ్చాడని దుకాణదారు, ఫ్లాయిడ్ కారు దగ్గరికి వచ్చి సిగరెటు పెట్టె వెనక్కి అడిగాడు. ఆ వాదనలో స్టోర్ యజమాని పోలీసులకు ఫోను చేశాడు. పోలీసులు రావడంతోనే కారులో స్టీరింగ్ ముందు కూచొని వున్న ఫ్లాయిడ్ బయటికి లాగి, నకిలీ నోటు వాడినందుకుగాని అరెస్టు చేస్తున్నామని చేతులకు బేడీలు వేశారు. ఆయన్ని దుకాణం వైపు తీసుకెళుతుండగా నడవలేక జారిపడ్డాడు. పడిన వాడిని అలాగే తన మోకాలుతో మెడపై అదిమి పట్టి డెరిక్ బెవిన్ అనే పోలీసు అధికారి ప్రాణం తీశాడు. ఇది పోలీసు హత్య. డెరిక్ చెవిన్‌పై థర్డ్ డిగ్రీ హత్య కింద 29న కేసు నమోదయింది. నల్లజాతీయులపై శ్వేత పోలీసు అధికారులు తలపెడుతున్న మారణకాండ, హింసాత్మక చర్యలకు ఓపిక నశించిన ఆఫ్రో అమెరికన్లు నిరసన జ్వాలల్ని రగిలించి తమ కోపాన్ని వెలకక్కుతున్నారు.

అమెరికా, ఫెడరల్ వ్యవస్థ. అక్కడ రాష్ట్రాలకు అధికారాలు ఎక్కువ. చట్టాలు కూడా వేటికవిగానే ఉంటాయి. ఈ క్రమంలో మినియా పొలిస్ పోలీసు మాన్యువల్ (నియమావళి) ప్రకారం అనుమానితుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తే మెడపై ఒత్తిడి తెచ్చి ఆయన్ని అపస్మారక స్థితికి పంపవచ్చు. అధికారికంగా పోలీసులు ఈ చర్యకు పాల్పడవచ్చు. అయితే పోలీసులు ఈ ప్రాణాంతక తంత్రాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇంటి గొడవల సందర్భంగా కేవలం 14 ఏళ్ల బాలుడిపై ఈ ప్రయోగం జరిగింది. 17 ఏళ్ల వయసు దొంగను దొరకబట్టి అలాగే చంపేసిన సంఘటన ఒకటుంది.

పోలీసు నియమావళి ప్రకారం తీవ్రంగా ఎదురు దాడి చేస్తున్న వారిని, ఇతరులను చంపేందుకు సిద్ధపడి పట్టువీడని వారిని, పరిస్థితి అదుపు తప్పి మరే దారి లేనప్పుడు దీనిని ప్రయోగించి నిందితుడిని అపస్మారక స్థితిలోకి పంపాలి. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ విధానాన్ని చాలా రాష్ట్రాలు తమ పోలీసు మాన్యువల్ నుంచి తొలగించాయి. వాడకం మాత్రం అమలులో ఉంది. 28 జులై 2016లో మినో పొలిస్ తయారు చేసిన నియమావళిలో ఇది లేకున్నా 16 ఏప్రిల్ 2012 తేదీ పేరిట ఈ దుశ్చర్యను తిరిగి జోడించారు. ఈ తేదీపై ఎలాంటి స్పష్టత లేదు.

తప్పించుకుపోయే నిందితుడికి బేడీలు వేసే అవకాశం లేనప్పుడు దొరకబుచ్చుకొని మెడపై భుజం లేదా మోకాలు ఒత్తిడితో ఆయన స్పృహ తప్పేలా చేయడం అమెరికా పోలీసులకు ఇచ్చే శిక్షణలో ఉంది. దానిలో భాగంగా పోలీసు సిబ్బంది ఈ అ విద్యను నేర్చుకుంటారు. ఈ ఒత్తిడిలో బాధితుడు ఊపిరాడక, మెడపై నొప్పితో విలవిలలాడితే తప్పించుకునేందుకు పెనుగులాడుతున్నాడని పోలీసు భావించే, భ్రమించే అవకాశం ఉన్నందున చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని తొలగించాయి. మినియా పొలిస్‌లో కూడా దీనిని తొలగించాలని గత ఎనిమిదేళ్లుగా పౌర సమాజం కోరుతున్నా పరిశీలిస్తున్నామంటూ దాట వేయడం జరుగుతోంది.

జార్జి ఫ్లాయిడ్‌పై ఈ ఘాతుకం పూర్తిగా హత్యా ప్రయత్నమే. డెరిక్ చౌవిన్ అనే పోలీసు అధికారి బేడీలు వేసి ఉన్న ఫ్లాయిడ్‌ను ఎనిమిది నిమిషాల పాటు ఒత్తి పట్టాడని, చనిపోయాక మూడు నిమిషాలు కూడా అలాగే మెడపై కూచున్నాడని సమీప విడియో క్లిప్పింగ్స్ సాక్షం చెబుతున్నాయి. అమ్మా, అయ్యో… నాకు ఊపిరి ఆడడం లేదు నేను చచ్చిపోతున్నా అని ఫ్లాయిడ్ మొత్తుకున్నా ఆ కర్కష అధికారి కరుణించలేదు.

పోలీస్ గన్ పాయింట్‌పై ఎలాంటి వాదన, ప్రతిఘటన లేకుండా లొంగిపోయి చేతులెత్తి బేడీలు వేయించుకున్న ఫ్లాయిడ్ కిందపడి పోవడమే అదునుగా అధికారి తన శ్వేత జాత్యహంకారంతో బుసకొట్టి మోకాలి కోరలతో కాటు వేయడం పూర్తిగా పట్టపగటి హత్య. ఒక రోజు నిశ్శబ్దంగా గడిచినా 27న చెలరేగిన అల్లర్లను వెరసి మే 29న ఆ తెల్ల పోలీసు దొర చౌవిన్‌పై థర్డ్ డిగ్రీ హత్య కింద కేసు నమోదు అయింది. ఆయనకు సహకరించిన, చూస్తూ ప్రోత్సహించిన మిగితా ముగ్గురు పోలీసులపై శాఖాపర చర్యలు మొదలయ్యాయి కాని ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఫ్లాయిడ్ శవ పంచానామాలో ఆయన ఒత్తిడి సందర్భంగా వచ్చిన గుండె పోటుతో మరణించాడని రికార్డు అయింది. అయితే కుటుంబ సభ్యులు తిరిగి చేయించిన శవ పరీక్షలో మెడపై ఒత్తిడి వల్ల శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయి, ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ అందక తుది శ్వాస విడిచినట్లు తేలింది.

17 జులై 2014 నాడు న్యూయార్క్‌లో ఎరిక్ గార్నర్ అన్న ఆఫ్రో అమెరికన్ మెడ ఒత్తిడితో మరణించడంతో చెలరేగిన నిరసనల వల్ల న్యూయార్క్ పోలీసు మాన్యువల్ నుండి దీనిని తొలగించారు. మెడపై కాకుండా ఇతర కింది శరీర భాగాలపై ఒత్తిడి తెచ్చి అదుపులోకి తీసుకోవాలని 1982లో లాస్ ఏంజిల్స్ పోలీసు సవరించింది. 2015 నుండి మినియా పొలిస్ రాష్ట్రంలో 237 మంది అనుమానితులపై ఈ ప్రాణాంతక దాష్టీక క్రియ ప్రయోగించబడింది. ఇప్పుడు అమెరికాలో చెలరేగుతున్న హింసాత్మకమైన నిరసన కాండను వ్యతిరేకిస్తూ దానిని శాంతియుత పద్ధతిలోకి కొనసాగించాలని ఫ్లాయిడ్ సోదరుడు టెర్రెన్స్ ఫ్లాయిడ్ ప్రజలను కోరుతున్నాడు. జార్జి శాంతికాముకుడని, మా కుటుంబం శాంతి సామరస్యాలకు అలవాలమని టెర్రెన్స్ ప్రసార సాధనాల ముందు ప్రకటించాడు. ప్రజల ఆక్షాంక్షల మేరకు చట్ట సవరణలు, వాటి సత్వర, సరియైన అమలు ద్వారా ప్రభుత్వమే ఈ నిరసన జ్వాలల్ని చల్లార్చవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News