ఢిల్లీ: రఫేల్ ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. రఫేల్పై తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టును కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ స్పందించారు. ఈ పిటిషన్లను విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, ఇది కాస్త కష్టమైన పని అని, అయినప్పటికీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.