Home తాజా వార్తలు ఎదురులేని నాదల్

ఎదురులేని నాదల్

ప్రమాదంలో ఫెదరర్ రికార్డు
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తనదైన ముద్ర వేశాడు. కొన్నేళ్ల క్రితం వరుస గాయాలతో నాదల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీనికి తోడు ఆండ్రీ ముర్రే (బ్రిటన్), నొవాక్ జకోవిచ్ (సెర్బియా)లు ప్రపంచ టెన్నిస్‌లో సరికొత్త స్టార్లుగా వెలుగులోకి వచ్చారు. మరోవైపు నాదల్ చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ కూడా అడపాదడపా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తనకు ఎదురులేదని నిరూపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాదల్‌కు పూర్వ వైభవం చాలా కష్టమని చాలా మంది భావించారు. మరోవైపు నాదల్ కూడా ఒక దశలో కెరీర్‌కు వీడ్కోలు పలకాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఒకవైపు గాయాలు, మరోవైపు కుటుంబ కలహాలతో నాదల్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దీంతో ఇక నాదల్ శకం ముగిసిందనే ప్రచారం కూడా జోరందుకుంది. 2015, 2016 సంవత్సరాల్లో నాదల్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కూడా గెలవలేదు. తనకు తిరగులేని రికార్డు ఉన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా టైటిల్ నెగ్గలేక పోయాడు. ఇలాంటి దయనీయ స్థితిలో పడ్డ నాదల్ మళ్లీ కోలుకుని పూర్వ వైభవం సాధిస్తాడనే ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కానీ, పట్టుదల, అంకితభావానికి మరో పేరుగా చెప్పుకునే నాదల్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. గాయాలను జయిస్తూ మళ్లీ ట్రాక్‌పై పడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేశాడు. గాయాలకు ఎదురొడ్డుతూ ముందుకు దూసుకెళ్లాడు. చిరకాల ప్రత్యర్థులు జకోవిచ్, ఫెదరర్, ముర్రేల జోరును తట్టుకుంటూ లక్షం దిశగా అడుగులు వేశాడు. 2017లో మళ్లీ పుంజుకున్నాడు. ఈసారి తనకు ఎంతో అచ్చివచ్చే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది యుఎస్ ఓపెన్ టైటిల్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జకోవిచ్ గాయం వల్ల టెన్నిస్‌కు దూరం కావడం కూడా నాదల్‌కు కలిసి వచ్చింది. ముర్రే కూడా గాయాల బారీన పడడంతో ప్రపంచ టెన్నిస్‌లో మళ్లీ నాదల్, ఫెదరర్ జోరు కొనసాగింది. ఇద్దరే ప్రతి టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుతూ వచ్చారు. 2018లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు తాజాగా యుఎస్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. దీంతో ప్రపంచ టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం నాదల్ 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. కొంతకాలంగా ఫెదరర్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాదల్ వరుస టైటిల్స్‌తో దూసుకు పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది ఏ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన నాదల్ కూడా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తాడు. ఇక రెండు టైటిల్స్ సాధిస్తే మాత్రం పురుషుల టెన్నిస్‌లో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుడుతాడు. నాదల్ జోరును పరిగణలోకి తీసుకుంటే అత్యధిక టైటిల్స్ రికార్డును అందుకోవడం కష్టం కాదనిపిస్తోంది. గాయాలు అడ్డుపడకుంటే నాదల్ ప్రపంచ టెన్నిస్ రారాజుగా అవతరించడం ఖాయం.
జకోవిచ్‌తోనే పోటీ
అయితే నాదల్‌కు సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌తో తీవ్ర పోటీ నెలకొంది. ఫెదరర్ పూర్వ వైభవం సాధించడం కష్టంగా మారిన ప్రస్తుతం పరిస్థితుల్లో నాదల్‌కు ఒక్క జకోవిచ్‌తోనే ప్రమాదం పొంచి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో జకోవిచ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఈ ఏడాది ఏకంగా రెండు టైటిల్స్ సాధించి తనకు ఎదురులేదని నిరూపించాడు. గాయం వల్ల అమెరికా ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఒకవేళ జకోవిచ్ ఫైనల్ వరకు వచ్చి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేదేమో. ఇక, ప్రస్తుతం జకోవిచ్ 16 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జకోవిచ్ ఏమాత్రం తక్కువ అంచన వేయలేం. కెరీర్ ముగింపు దశకు చేరుకున్నా పట్టువీడకుండా పోరాడి మళ్లీ ప్రపంచ టెన్నిస్‌ను శాసిస్తున్నాడు. వరుస టైటిల్స్‌తో నాదల్, జకోవిచ్‌ల రికార్డులకు చేరువయ్యాడు. ఇలాంటి జోరునే కొనసాగిస్తే జకోవిచ్ కూడా అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా అవతరించిన ఆశ్చర్యం లేదు. కానీ, పోరాటానికి మరో పేరుగా చెప్పుకునే నాదల్, ఫెదరర్‌లను దాటి ముందుకు వెళ్లడం జకోవిచ్‌కు అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. అంతేగాక నాదల్‌కే ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కొత్త సీజన్ ప్రపంచ టెన్నిస్‌కు చాలా కీలకంగా మారింది. ఇందులో ఎవరూ ఆధిపత్యం చెలాయిస్తారో వేచి చూడక తప్పదు.

Rafael Nadal wins 19th title in World Tennis