Home తాజా వార్తలు విజేత నాదల్…

విజేత నాదల్…

Rafael Nadal

రఫెల్ ఖాతాలో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్
ఫైనల్లో పోరాడి ఓడిన మెద్వెదేవ్

న్యూయార్క్ : ఊహించినట్టు ప్రతిష్టాత్మకమైన అమెరికా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సొంతం చేసుకున్నా డు. దాదాపు ఐదు గంటల పాటు నువ్వానేనా అన్నట్టు సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రష్యా యువ కెరటం, ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌ను మట్టికరిపించాడు. ఇదే క్రమంలో తన ఖాతాలో 19వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జత చేసుకున్నాడు. అంతేగాక ఆల్‌టైమ్ గ్రేట్ టైటిల్స్ విజేత రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) రికార్డుకు మరింత చేరువయ్యాడు. ఫెదరర్ 20 సింగిల్స్ టైటిల్స్‌తో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, నాద ల్ అతని రికార్డును సమం చేసేందుకు ఒక టైటిల్ దూరంలోనే నిలిచాడు. కాగా, మెద్వెదేవ్‌తో జరిగిన తుది సమరంలో నాదల్ చెమటోడ్చి నెగ్గాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 76, 63, 57, 46, 64తో మెద్వెదేవ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా రష్యా స్టార్ డానిల్ చివరి వరకు అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు.
హోరాహోరీ..
తుది సమరం ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ అసాధారణ ఆటతో నాదల్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి సెట్‌లో నాదల్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇటు నాదల్, అటు మెద్వెదేవ్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో పోరు హోరాహోరీగా కొనసాగింది. ఒక దశలో నాదల్ కాస్త పైచేయి సాధించినట్టు కనిపించాడు. కానీ, మెద్వెదేవ్ అసాధారణ పోరాట పటిమను కనబరుస్తూ నాదల్‌కు చెమటలు పట్టించాడు. మెద్వెదేవ్ జోరును ప్రదర్శించడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో నాదల్ ఆధిప త్యం చెలాయించి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, రెండో సెట్‌లో మాత్రం నాదల్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. తన కు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక షాట్లతో మెద్వెదేవ్‌పై విరుచుకు పడ్డాడు. నాదల్ జోరుకు మెద్వెదేవ్ చతికిల పడ్డాడు. నిలకడైన ఆటను కనబరిచిన నాదల్ అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు.
డానిల్ పోరాటం..
తొలి రెండు సెట్లు నాదల్ సాధించడంతో ఇక అతని గెలుపు లాంఛనమే అని అందరూ భావించారు. అయితే రష్యా స్టార్ మెద్వెదేవ్ మాత్రం పోరాటాన్ని వీడలేదు. అసాధారణ ఆటతో మళ్లీ రేసులోకి వచ్చాడు. నాదల్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ పైచేయి సాధించాడు. మెద్వెదేవ్ అనూహ్యంగా పుంజుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. నాదల్ ఒక దశలో సెట్‌లో పైచేయి సాధించినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు పట్టువీడకుండా పోరాడిన మెద్వెదేవ్ సెట్‌ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లాడు. ఇందులో నిలకడగా ఆడి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇదే జోరును నాలుగో సెట్‌లో కూడా కొనసాగించాడు. ఈసారి నాదల్‌పై మరింత ఆధిపత్యం చెలాయించాడు. చూడచక్కని షాట్లతో స్పెయిన్ బుల్‌ను హడలెత్తించాడు. డానిల్ చెలరేగి ఆడడంతో నాదల్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మెద్వెదేవ్ కీలక ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మరోవైపు నాదల్ కూడా సెట్‌ను గెలుచుకునేందుకు తీవ్రంగా పోరాడాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు అద్భుతంగా ఆడిన మెద్వెదేవ్ వరుసగా రెండో సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో టైటిల్ పోరు ఆసక్తికరంగా మారింది.

ఊహించినట్టే ఫలితాన్ని తేల్చే ఐదో సెట్ కూడా నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ఈసారి కూడా సర్వం ఒడ్డి పోరాడారు. ఎవరి సర్వీస్‌ను వారు కాపాడుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో హోరాహోరీ తప్పలేదు. డానిల్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో నాదల్‌కు చుక్కెదురు తప్పదా అని అతని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఎంతో అనుభవజ్ఞుడైన నాదల్ కీలక సమయంలో పుంజుకున్నాడు. ప్రత్యర్థి బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యాడు. చూడచక్కని షాట్లతో విరుచుకుపడిన నాదల్ మళ్లీ స్పష్టమైన ఆధిక్యాన్ని అందుకున్నాడు. చివరి వరకు దీన్ని కాపాడుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి విజేతగా నిలిచాడు. మరోవైపు చివరి వరకు తీవ్రంగా పోరాడినా మెద్వెదేవ్ రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. కాగా, విజేతగా నిలిచిన నాదల్ 27 కోట్ల 59 లక్షల భారీ నగదు బహుమతి లభించింది. మరోవైపు రన్నరప్ మెద్వెదేవ్ 13 కోట్ల 62 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు.
అరుదైన రికార్డు
కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించిన స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన రెండో ఆటగాడిగా నాదల్ ఉన్నాడు. మరోవైపు 30 ఏళ్లు దాటిన తర్వాత ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడి నాదల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఫెదరర్, జకోవిచ్, రోడ్ లెవన్, రోజ్‌వాల్ పేరిట ఉన్న రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించారు. తాజాగా నాదల్ 33 ఏళ్ల వయసులో ఐదు టైటిల్స్ గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, నాదల్ కెరీల్‌లో మొత్తం 27 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడాడు. ఇందులో 19 సార్లు చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు నాదల్‌కు ఇది నాలుగో యుఎస్ ఓపెన్ టైటిల్. గతంలో 2010, 2013, 2017లలో నాదల్ యుఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. తాజాగా ఈసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.

Rafael Nadal Wins 19th Grand Slam Title in US Open 2019