Home తాజా వార్తలు ర్యాగింగ్ భూతం

ర్యాగింగ్ భూతం

Ragging_manatelanganaజాడలేని యాంటీ ర్యాగింగ్ కమిటీలు

ప్రతి విద్యార్థి ప్రతిజ్ఞ చేయాల్సిందే…
కళాశాలలో చేరే ప్రతి విద్యార్థి ర్యాగింగ్ నిరోధానికి ప్రతిజ్ఞ చేయాలి. లిఖిత పూర్వకంగా ఒక నోట్‌ను కళాశాల నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది. నోట్ ఇవ్వని విద్యార్థికి కళాశాలలో చేర్చుకోరు.
95 శాతం కళాశాల్లోకమిటీల్లేవ్

సుప్రీంకోర్టుఆదేశాలు బేఖాతర్‌చేసినయాజమాన్యాలు, పోలీసులు
ర్యాగింగ్ గుప్పిట్లో జూనియర్లుఘటనలు పునరావృతం కాకముందే మేల్కోండి
ర్యాగింగ్‌ను నిరోధించాలంటే…
తల్లిదండ్రుల బాధ్యత…
ఈ పరిస్థితికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిందే. కళాశాలలో ఏ విద్యార్థితోనైనా గొడవలు, మనస్పర్ధలు, వైషమ్యాలు ఉన్నాయా..? అనే విషయమై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకునే ధైర్యం పిల్లల్లో కల్పించాలి. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్‌లను కలిసి పరిష్కరించుకోవాలి. అలాంటివి తల్లిదండ్రుల వైపు నుంచి కనిపించడంలేదు.
కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్‌కు సంబంధించిన పోస్టర్లతో పాటు కరపత్రాలు, ర్యాగింగ్ చట్టం పత్రాలు నోటీసు బోర్టులో పెట్టాలి.
అలా పెట్టని కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం సుప్రీంకోర్టు పోలీసులకు కల్పించింది.
ఇలాంటి కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను అరెస్టు చేయవచ్చు.
ర్యాగింగ్‌కు పాల్పడితే విధించే శిక్షలను ప్రతి విద్యార్థికీ కళాశాల యాజమాన్యం వివరించాలి.
ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు ముందుగా కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.
ఇలాంటి ఫిర్యాదుపై కళాశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ర్యాగింగ్ విషయాన్ని దాచిపెట్టినా, సహకరించినా యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అలాంటి కళాశాలలపై కేసు నమోదు చేస్తారు.
అసలు ర్యాగింగ్ అంటే…
బలవంతంగా విద్యార్థితో పనులు చేయించడం
అశ్లీల చిత్రాలు చూపడం, అసభ్య ప్రశ్నలు వేయడం
బట్టలు ఉతికించడం
కాళ్లు మొక్కించుకోవడం
నోట్స్ రాసిపెట్టమని బలవంతం చేయడం
అసభ్యంగా ప్రవర్తించమని చెప్పడం
వేధింపులకు గురిచేయడం
ప్రాణం పోవడానికి, ఆత్మహత్యకు ప్రేరేపించడం
ఇతరత్రా వేధింపులు
Ragging_manatelangana1మన తెలంగాణ/సిటీబ్యూరో: ఎందుకు టీజ్ చేస్తున్నావని అడిగిన పాపానికి జూనియర్ విద్యార్థి హర్షవర్ధన్‌ను అదే కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న సతీష్ క్లాస్ రూమ్‌లోనే కొట్టి చంపాడు. ఈ ఘటన గత ఏడాది కోఠిలోని ప్రగతి మహా విద్యాలయంలో జరిగింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ సంఘటన నుంచి విద్యాసంస్థలు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదనే చెప్పాలి. ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను కళాశాల యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి. సుప్రీం సూచించినట్లు ‘యాంటీ ర్యాగింగ్ కమిటీలు’, ‘యాంటీ ర్యాగింగ్ స్కాడ్’ ఏర్పాటు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. ఈ ఏడు విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి పోలీసులు, కళాశాల యాజమాన్యాలు ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే హర్షవర్ధన్‌లాంటి అమాయక విద్యార్థులు బలికాక తప్పదు. నగరం, శివార్లలో వేల సంఖ్యలో స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతిఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో వేలాది మంది ఇందులో కొత్తగా చేరుతున్నారు. వీరంతా టీనేజ్‌లో ఉన్నవారే. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థి సీనియర్ల చేతిలో ర్యాగింగ్‌కు గురికావడం తప్పదు. కొంతమంది ధైర్యం చేసి ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేస్తుంటే, మరికొందరు మనకెందుకు ఈ తలనొప్పని సీనియర్లు చెప్పినట్లు నడుచుకుంటూ తమ బాధను తమలోనే మింగుకుంటూ బాధపడుతున్నారు. మరికొన్ని ర్యాగింగ్ ఉదంతాలు కళాశాల యాజమాన్యం దృష్టికి వచ్చినా పెద్దగా స్పందించకపోవడం, ఫిర్యాదుదారులను పోలీసుస్టేషన్ వరకు పంపకుండా ఆపడంలాంటివి జరుగుతున్నాయి. కళాశాలలో ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడే పోలీసులు స్పందిస్తున్నారే తప్ప ర్యాగింగ్ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఇటు కళాశాల యాజమాన్యాలు, అటు పోలీసులు పాటించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. నగరం, శివార్లలోని పలు విద్యాలయాల్లో సర్వే చేయగా 95 శాతం విద్యాసంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కాయని చెప్పక తప్పదు. అంటే కేవలం ఐదు శాతం విద్యాసంస్థలు ర్యాగింగ్ నిరోధంపై స్పందించడాన్ని చూస్తుంటే మెజార్టీ కళాశాలలు స్పందించడం లేదనేది అర్ధం అవుతుంది.
వీరికి ఫీజులే ముఖ్యం…
Ragging_manatelangana5ఫీజుల వసూలుపై కళాశాలలకు ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రవర్తన, సమస్యల విషయంలో కనిపించడంలేదు. అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరవు తున్నాయి. కమిటీలను ఏర్పాటు చేయని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను అరెస్టు చేసే అధికారం పోలీసులకు సుప్రీం కోర్టు ఇచ్చింది. ఇదంతా కాగితాలకే పరిమితం. ఫలితంగా తరచూ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలల్లో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉన్నట్లు తెలుస్తున్నది. కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. విద్యార్థుల మధ్య వైషమ్యాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యవస్థ, యంత్రాంగం లేకపోవడం, వారి సమస్యలను అధ్యాపకులు పట్టించుకోకపోవడం వల్ల వాతావరణం దెబ్బతింటోంది. మరోవైపు ఇలాంటి సమస్యలకు కారణమవుతున్న ర్యాగింగ్ నిరోధంపైనా దృష్టి పెట్టడం లేదు. ర్యాగింగ్‌లో చనిపోతే…జీవిత కాలం శిక్ష (పదేళ్ల జైలు, రూ.50 వేల ఫైన్) మొదటి మూడు నేరాలకు పాల్పడిన విద్యార్థిని కళాశాల

నుంచి సస్పెండ్ చేస్తారు. చివరి నేరానికి పాల్పడితే ఏకంగా డిస్మిస్ చేస్తారు. అంటే ఇతర ఏ కళాశాలలోనూ ఆ విద్యార్థిని చేర్చుకోరు.
గతంలో చోటుచేసుకున్న ఘటనలు…
జూన్ 2013లో మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సినీ నటుడు నిఖిల్ సోదరుడు రోహిత్ సిద్ధార్థపై సీనియర్ విద్యార్థులు హరికృష్ణ, లక్ష్మణ్, లక్ష్మికాంగ్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు క్యాంటిన్‌లో దాడి చేశారు.
ఫిబ్రవరి 10, 2013నాడు దుండిగల్‌లోని ఓ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ కుమార్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన హేమంత్, సురేష్‌ల ర్యాగింగ్ భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.
2012లో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న శంకర్‌పల్లికి చెందిన అజయ్‌గౌడ్‌పై సీనియర్లు దాడి చేశారు.
మార్చి 22, 2013నాడు పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సంతోష్, అబ్దుల్‌లను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతోపాటు తీవ్రంగా గాయపరిచారు.
ర్యాగింగ్ నిరోధక కమిటీ…
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి కళాశాలలోనూ ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాల్సిందే. ఈ కమిటీలో స్వచ్ఛంద సంస్థ, పోలీసు శాఖ, కళాశాల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మానసిక నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వీరిని సమన్వయపరిచి కమిటీ ఏర్పాటు చేసే బాధ్యత కళాశాలపైనే ఉంటుంది.
యాంటీ ర్యాగింగ్ స్కాడ్…
యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. విద్యార్థుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. తరగతి, హాస్టల్ గదులు, లైబ్రరీ, క్యాంటీన్, బస్సులు, బస్‌స్టాప్‌లలో నిఘా పెడుతుంది. ర్యాగింగ్‌కు అవకాశాలు ఉన్న ప్రతి చోటా ఈ స్కాడ్ పరిశీలిస్తుంది. యాంటీ ర్యాగింగ్ కమిటీల తీరుతెన్నులను అధ్యయనం చేస్తుంది.
చర్యలేవీ…
ర్యాగింగ్‌కు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తామని నవంబర్ 18, 2011 నాడు అప్పటి నగర పోలీసు కమిషనర్ ఏకె ఖాన్ మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ హెచ్చరికలు కాగితాల వరకే పరిమితమయ్యాయని చెప్పక తప్పదు. నాలుగేళ్లలో ర్యాగింగ్ ఉదంతాలు అక్కడక్కడ బయట పడుతున్నా ఇంతవరకు ర్యాగింగ్‌కు పాల్పడిన ఏ విద్యార్థిపై రౌడీషీట్ తెరచిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా పోలీసులు ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు హెచ్చరికలు చేయక తప్పదు. సేఫ్ సిటీ, స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామనుకుంటున్న పోలీసు బాస్‌లు ర్యాగింగ్‌పై కూడా దృష్టి సారించాలని జూనియర్లు కోరుకుంటున్నారు.