Home జాతీయ వార్తలు మోడీ నియంతృత్వ విధానాలతో అంధకారంలోకి భారత్

మోడీ నియంతృత్వ విధానాలతో అంధకారంలోకి భారత్

raghuram--rajan

ముంబై: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, పూర్తి స్థాయి మెజారిటీ దేశాన్ని అస్థిర, అంధకార మార్గంలోకి నెడుతున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటినీ బలహీనపరుస్తోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 9న అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఓపి జిందాల్ స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు నిలకడగా లేదని అన్నారు. ప్రజాకర్షక విధానాలకు సంబంధించి దేశం లాటిన్ అమెరికా బాటలో వెళుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దేశం ఆర్థికంగా కుంటుపడడానికి అనాలోచిత పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ట జిఎస్‌టి వంటివి కారణాలని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీపైనే ప్రభుత్వం కేంద్రీకృతం కావడంతో ఆయన తొలి ఐదేళ్ల పాలనలో దేశం ఆర్థికంగా ప్రగతిని సాధించలేకపోయిందని రాజన్ అన్నారు. దేశం ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వద్ద సరైన దూరదృష్టి కాని, సుస్థిరమైన ఆలోచనా విధానం కాని లేవని ఆయన చెప్పారు. మంత్రులకు ఎటువంటి అధికారాలు లేవని, అధికారులు ఎవరూ తమకు తాముగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా లేరని, సంస్కరణలపై వారికి సంకల్ప బలం అసలే లేదని రాజన్ తెలిపారు. అధికార యంత్రాంగంలో సమర్థత క్షీణించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంను జైలుకు పంపడంపై ధ్వజమెత్తుతూ సరైన సాక్షాలు లేకుండానే సీనియర్ అధికారులను సైతం కస్టడీలోకి తీసుకుంటున్నారని, ఎటువంటి విచారణ లేకుండా నెలరోజులకు పైగా చిదంబరం జైలులో మగ్గడం ఆందోళన కలిగిస్తోందని రాజన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య పోలిక తీసుకువస్తూ వ్యవస్థలు బలహీనపడిన కారణంగానే ప్రభుత్వాలు నియంతృత్వంలోకి వెళుతుంటాయని రాజన్ అభిప్రాయపడ్డారు. 1971 తర్వాత ఇందిరా గాంధీ విషయంలో కాని, 2019 తర్వాత మోడీ ప్రభుత్వం విషయంలో కాని ఇది వాస్తవమని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాపై అద్భుతమైన పట్టుసాధించడం వల్లే మోడీ గెలుపు సాధ్యమైందని రాజన్ వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా మోడీని గౌరవిస్తోందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రజలు భారతదేశ నాయకులను వారు తెచ్చిపెట్టుకున్న వ్యక్తిత్వాన్ని బట్టి కాక అత్యంత శక్తివంతమైన 130 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగానే గౌరవిస్తున్నారని రఘరామ రాజన్ వ్యాఖ్యానించారు.

Raghurama Rajan attacks PM Modi, former RBI head accused the Modi government of weakening institutions.