మన తెలంగాణ / తిమ్మాపూర్ ః మునుపెన్నడు లేని విధంగా మండలంలోని రాజీవ్ రహాదారి పై రక్తపు టేర్లు పారుతున్నాయి. ఏ మాత్రం రోడ్డు నియమాలు పాటించని వాహనదారుల మూలంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కేవలం మండల వ్యాప్తంగా రెండు నెలల వ్యవధిలో 8 మందిపై గా రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. వారానికొకరి చొప్పున ఇటివల కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచూ జరుగుతుండటం, ఒక్క రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో మృత్యువాత పడటం, మరి కొంత మంది గాయాల పాలవడం ఆందోళన కలిగిస్తుంది. వారానికొకరి చొప్పున బలవుతుండటం మండల వాసులను కలవరపెడుతుంది. గత నెలలో హైద్రాబాద్ నుండి రామగుండం వైపు వెలుతున్న కారు అదుపు తప్పి, పెట్రోల్ బంక్ పక్కన నిలిచి ఉన్న లారీని ఢీ కొట్టడంతో అందులో ఉన్న నలుగురు స్పాటులోనే ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల క్రిందట నుస్తులాపూర్ పశువుల ఆసుపత్రి వద్ద అదుపు తప్పిన టాటా ఏసి వాహనం డివైడర్ ను ఢీ కొట్టడంతో గన్నేరువరం మండలానికి చెందిన డ్రైవర్ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా ,చికిత్స పొందుతూ ఆసుపత్రి లో మృతి చెందాడు. ఇటివల అదే నుస్తులాపూర్ స్టేజీ వద్ద వేగంగా వచ్చిన డీసిఎం వ్యాన్ ముందు ఉన్న బైక్‌ను తప్పించబోయి డివైడర్ ను స్థంబానికి ఢీ కొట్టాడు. దీంతో పుట్ పాత్ పై బస్సు కోసం వేచి చూస్తున్న వ్యక్తి పైకి వ్యాన్ దూసుకెళ్లడంతో సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం కిష్టం పేట గ్రామానికి చెందిన ఆకుల నర్సింహులు అనే వ్యక్తి కి రెండు కాళ్లు విరిగి నుజ్జు నుజ్జు అయ్యాయి. అతన్ని అతి కష్టం మీద క్రేన్ సహాయంతో పోలీసులు బయటికి తీసి108 లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అతడు ప్రాణాల నుండి బయట పడ్డాడు . అదే విధంగా కొత్తపల్లి స్టేజీ వద్ద నిలిపి ఉన్న లారీ ని మరో లారీ ఢీ కొట్టడంతో డ్రైవర్ చక్రాల కింద నగిలి నుజ్జునుజ్జయ్యాడు. అలుగునూర్ లో బైక్ పై కరీంనగర్ వైపు వెలుతుండగా వెనుక నుండి డిసిఎం ఢీ కొనడంతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంద్రనగర్ సమీపంలో గత నెలలో హుస్నాబాద్ వైపు వెలుతున్న ఆర్‌టిసి బస్సు ను ఎదురుగా వస్తున్న టిప్పర్ డివైడర్ నుండి ఢీ కొట్టింది, దీంతో అందులో ఉన్న ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
నిబందనలు గాలికి…
తరచూ జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే మెజార్టీ వాహనదారులు రోడ్డు నిబందనలు పాటించడం లేదని స్పష్టమౌతున్నది. ప్రయాణ సమయంలో కనీస బాద్యతలను, రక్షణ ను గాలికొదిలేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక చాలా మంది ద్విచక్ర వాహనదారులు మితి మీరిన వేగంతో విచక్షణ లేకుండా రోడ్ల పైకి వస్తున్నారు. అటు ఆటోల్లో మితి మీరిన వేగంతో పాటు, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లటంతో ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ లు లేకపోవడం, హెల్మెట్ ఊసే ఎత్తకపోవడం, పట్టుపడితే జరిమానా చెల్లించడం సర్వసాదారణంగా కనిపిస్తుంది. యువకులు, విద్యార్థులైతే 150 నుంచి ఆపై సిసి ఉన్న బైక్ లపై మితి మీరిన వేగంతో రోడ్ల పై రద్దీ ఉన్నా సర్కస్ ఫీట్లు కొట్టడం పరిపాటిగా మారింది. అద్దాల్లా మెరుస్తున్న రహాదారులపై కారు, లారీ, వ్యాను, బస్సు తేడా లేకుండా రయ్యిన దూసుకుపోతున్నాయి. మెజార్టీ ప్రమాదాలు మద్యం తాగి, అజాగ్రత్తగా నడపడం వల్లే జరుగుతున్నాయన్నది స్పష్టం అవుతున్నది. పీకల దాకా మద్యం తాగి వాహనాలను నడుపుతుండటంతో రోడ్డు పై వెళ్లే పాదచారులు సైతం బలవుతున్నారు.
ఫలితమివ్వని సదస్సులు..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కళాశాలు , ఇతర చోట్ల పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా పెద్దగా ఫలితమివ్వడం లేదు. మండల వ్యాప్తంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో, ప్రధాన కూడల్లలో , స్టేజీ ల వద్ద పోలీసులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేసినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా సంభంధిత అధికారులు వేగంగా వెలుతున్న వాహనదారులకు కళ్లెం వేసి, ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.