Saturday, April 20, 2024

లోక్‌సభ సభ్యత్వ అనర్హత గొప్ప అవకాశం ఇచ్చింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

స్టాన్‌ఫోర్డ్: తాను రాజకీయాలలో ప్రవేశించినపుడు తాను లోక్‌సభ నుంచి అనర్హుడినవుతానని ఊహించలేదని, అయితే దాని వల్ల ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం తనకు లభించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

కాలిఫోర్నియాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బుధవారం రాత్రి భారతీయ విద్యార్థులు, ప్రొఫెసర్లను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై 2019లో దాఖలైన క్రిమినల్ డిఫమేషన్ కేసులోసూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన దరిమిలా వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు.

అమెరికాలోని మూడు నగరాల పర్యటన నిమిత్తం మంగళవారం అమెరికా చేరుకున్న రాహుల్ బుధవారం రాత్రి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో తాను రాజకీయాలలోకి ప్రవేశించానని, ఇలాంటి పరిస్థితి తనకు ఎదురవుతుందని తాను అప్పట్లో ఊహించలేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆలోచిస్తే ఇది తనకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానని, ఇంత కన్నా మంచి అవకాశం తనకు లభించదని ఆయన అన్నారు. రాజకీయాలు ఇలాగే ఉంటాయని భావించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆరు నెలల క్రితమే ఈ నాటకం మొదలయిందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. భారతదేశంలో తమతోపాటు యావత్ ప్రతిపక్ష పార్టీలన్నీ పోరాడుతున్నాయని ఆయన చెప్పారు. అధికార పార్టీకి భారీ స్థాయిలో ఆర్థిక ప్రాబల్యం, వ్యవస్థలన్నీ హస్తగతం అయిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామిక హక్కుల కోసం తమ దేశంలో తామంతా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ఈ తరుణంలోనే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని ఆయన తెలిపారు.

తమ పోరాటం తమందరి పోరాటమని రాహుల్ స్పష్టం చేశారు. భారతదేశానికి చెందిన కొందరు యువజనులు ఇక్కడ ఉన్నారని, వారితో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలని తాను కోరుకుంటున్నానని, ఆయన చెప్పారు. వారితో మాట్లాడాలన్నఅభిలషిస్తున్నానని, అది తన హక్కు అని ఆయన అన్నారు. తాను తరచు చేసే విదేశీ పర్యటనల పరమార్థం ఇదేనని, అయితే తాను ఎవరి నుంచి మద్దతు కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు వచ్చి ఆ పని ఎందుకు చేయడం లేదో తనకు అర్థం కావడం లేదని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కార్యక్రమ సంధానకర్త జోక్యం చేసుకుంటూ భారత ప్రధాని మోడీ ఎప్పుడైనా స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులు, ప్రొఫెసర్లతో మాట్లాడవచ్చని ప్రకటించారు.

రాహుల్ ఉపన్యాసం వినేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో ఆడిటోరియం చేరుకున్నారు. దీంతో ఆడిటోరియం విదార్థులు, విద్యావేత్తలతో క్రిక్కిరిసిపోయింది. కార్యక్రమం ప్రారంభం కావడానికి రెండు గంటల ముందే ఆడిటోరియం వెలుపల విద్యార్థులు బారులుతీరి నిలబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News