Home ఎడిటోరియల్ రాహుల్ పలాయనవాదం

రాహుల్ పలాయనవాదం

Rahul Gandhi concedes defeat

 

రాహుల్ గాంధీ ని అర్థం చేసుకోవటం మొదటి నుంచీ కష్టంగానే ఉంటూ వస్తున్నది. తనకు రాజకీయాల పట్ల ఆసక్తిలేదని మొదట అనేవారు. ఆ మాటను అపుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తన తండ్రి రాజీవ్ గాంధీ కూడా అదే విధంగా అని ఎక్కువ కాలం గడవకుండానే రాజకీయాలలోకి వచ్చివేసినందున, రాహుల్ కూడా ఆ పని చేయగలరని భావించారు. నెహ్రూ కుటుంబంలో మొదటి మూడు తరాలవారైన మోతీలాల్, జవహర్‌లాల్, ఇందిరలు దేశ స్వాతంత్య్రం కన్న ముందు తరాల వారు. చిన్నప్పటి నుంచే రాజకీయాలలో మునిగి తేలినవారు. ఆ ముగ్గురికి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పోరాడటం తప్ప, పలాయన వాదమన్నది తెలియదు. ఇందుకు భిన్నంగా రాజీవ్ గాంధీ రాజకీయాల ఊయలలో ఊగివచ్చిన వాడు కాకపోవటమేగాక, తన చదువులు, ఉద్యోగం, సోనియాతో సాహచర్యం ప్రభావంతో ఆ రంగంపట్ల ప్రేమ అభినివేశం అంటూ కలగలేదు. అయినప్పటికీ ఇందిర ప్రోత్సాహం, చివరకు ఆమె హత్య వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు ఆయనను ఒక్క ఉదుటున పూర్తిస్థాయి రాజకీయాలలోకి నెట్టాయి. ఈ నేపథ్యం ఎట్లున్నా ఒకసారి ఆరంగంలోకి ప్రవేశించిన తర్వాత కష్టసుఖాలు ఏవైనా ఆయన వెను దిరిగి చూడలేదు. పలాయనవాది కాలేదు.

రాహుల్ గాంధీది ఈ నలుగురికన్న చాలా భిన్నమైన స్థితి. రాజకీయాల పట్ల మొదట తన తండ్రివలెనే విముఖత చూపారు. తర్వాత, క్రియాశీలంగా ఈ రంగంలోకి ప్రవేశించిన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఆయన వైఖరి రంగుల రాట్నంవలె తిరుగుతూ వస్తున్నది. కొన్నాళ్లు ఆసక్తి, కొన్నాళ్లు నిరాసక్తి. ఆ విధంగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల దరిమిలా నిరాసక్తయోగం మొదలైనట్లు కన్పిస్తున్నది. పార్టీ అధ్యక్ష పదవిని వదిలివేయగలనన్నారు తప్ప అసలు రాజకీయాల నుంచే నిష్క్రమించగలనని ప్రకటించ లేదుగనుక దీనిని సన్యాస యోగమని అయితే అనలేము. కాని అది సాంకేతిక నిర్వచనం. రాజకీయాలలో, అది కూడా నెహ్రూ కుటుంబం వంటి నేపథ్యం గల నాయకుడు, పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి, ఎన్నికల పరాజయం వంటి సందర్భంలో ఇటువంటి వైఖరి తీసుకోవటమంటే అది రాజకీయ నిర్వచనం ప్రకారం కేవలం నిరాసక్త యోగం కాదు. సన్యాస యోగానికి సమానమవుతుంది. అసలు సిసలైన పలాయన వాదమవుతుంది.

నెహ్రూ కుటుంబంలో జయాపజయాలను అందరూ చవిచూశారు. వాటినన్నింటిని ఇక్కడ ఏకరవుపెట్టలేము గాని, ఉదాహరణకు మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్‌ను చూద్దాము. ఆయన హయాంలో 1952 నాటి మొదటి ఎన్నికలను వదలివేస్తే, 1957లో రెండవ ఎన్నికలు వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారం కోల్పోయింది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి మరొక నాలుగు ప్రధాన రాష్ట్రాలలో ఓట్లు, సీట్లు తగ్గాయి. అది అసాధారణ స్థితి. కాని నెహ్రూ తను ప్రధాని పదవిగాని, పార్టీ అధ్యక్ష స్థానాన్ని గాని వదలుకోగలనని అనలేదు. అందుకు కారణం పదవీ కాంక్ష అనలేము. ఒక మేధావిగా, అనుభవజ్ఞునిగా, రాజకీయ వాదిగా ఆయన ఆ ఓటమికి కారణాలు ఏమిటని, ఆస్థితి నుంచి బయటపడటం ఎట్లాగని ఆలోచించారు. ఎన్నికల అనంతరం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తన ఆలోచనలను వివరించి పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు.

వర్కింగ్ కమిటీలో ఆయన అన్నదేమిటి? పేద బడుగులతో సహా ప్రతి ఒక్క పౌరునికి ఇపుడు ఓటు హక్కు ఉందని, వారి చైతన్యాలు పెరుగుతున్నాయని, ఆ పేద బడుగుల సమస్యలను పరిష్కరించనట్లయితే వారు తమ ఓటు హక్కును చైతన్యంతో ఉపయోగించి కాంగ్రెస్‌ను పక్కకు ఊడ్చివేసి ముందుకు పోగలరని అన్నారు. అది ఆ ఓటమిని గొప్పగా విశ్లేషించి నిర్మోహమాటంగా చెప్పటం. దానిని బట్టి ముందుకు ఎట్లా వెళ్లాలో దిశానిర్దేశం చేయటం. నాయకుడైన వాడు చేయవలసినపని అది. అంతే తప్ప పలాయన వాదం కాదు. ఈ విషయంలో ఇందిరా గాంధీ పోరాటాల గురించి అయితే చెప్పనక్కర లేదు. ఆ వంశస్థురాలు గాక కేవలం కుటుంబీకురాలు అయినా సోనియా గాంధీ కూడా అవే లక్షణాలను ప్రదర్శించారు. ఈ మొత్తం వంశానికి, కుటుంబానికి రాహుల్ గాంధీ మినహాయింపు అన్నది ఇపుడు స్పష్టంగా కన్పిస్తున్న విషయం.

ఇటువంటి నిరాసక్తతలు, ఊగిసలాటలమధ్య గత పదిహేను సంవత్సరాలుగా ఆయన ఏయే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారనే దానిపై చాలా చెప్పుకోవచ్చు. కాని అక్కరలేదు. ప్రస్తుతానికి వస్తే, రాహుల్ ప్రకటనలో రాజకీయ ఆలోచన ఏమీ కన్పించదు. బలహీనత, దిక్కుతోచని తనం తప్ప. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపై కూలంకషమైన సమీక్షలు ఏవీ ఇంకా జరగనే లేదు. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయా, అయితే ఏ విధంగా అనే సమాలోచనలను కూడా చేయలేదు. ఆ మేరకు పార్టీ మొత్తం దృఢ చిత్తంతో కొంత కాలం పాటు కృషి చేయటమన్నదీ లేదు. రాజకీయం అతి సుదీర్ఘమైనది, ఒడిదుడుకులతో సాగుతూనే ఉండేదన్నది ఎవరికైనా ఉండే సహజమైన అవగాహన. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీల ఎన్నికల చరిత్రతో, వాటి ఉత్థాన పతనాలతో కనీస పరిచయం ఉన్నా రాహుల్ గాంధీకి ఇవన్నీ తెలియగల విషయాలే.

అటువంటి స్థితిలో పార్టీ అధ్యక్షునిగా ఆయన ఈ ఓటమికి కుంగిపోయి అస్త్ర సన్యాసం చేయటం తగనిపని. కాంగ్రెస్‌కు స్వంత ఆధిక్యత రాగలదన్న అంచనాలు మొదటి నుంచి లేవు. ప్రతిపక్షాల కూటమి ఇంతగా దెబ్బతినగల దనుకోలేదుగాని, అదే సమయంలో వారు కూడా ఘనమైన విజయాలు సాధించగలరన్న ఆశలు ఒక్క యు.పిలో తప్ప మరెక్కడా లేవు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలిసి అయినా అధికారానికి రాగలవా అన్నది బొమ్మా బొరుసు వ్యవహారంగా ఉండిందే తప్ప నిశ్చితంగా చెప్పగల పరిస్థితి ఎప్పడూ లేదు. మరొక వైపు ఎన్నికల క్రమం ఆరంభమై మధ్యకు వచ్చే సరికి నరేంద్ర మోడీ హవా మొదలవుతున్నట్లు కన్పించసాగింది. అందుకు కారణాలు అనేకం. అవి మంచివా చెడ్డవా అనేది వేరే చర్చ. కాని అవేవీ కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్షం చేతిలోనూ ఉన్నవి కావు. ఆ కారణాలను ఎదుర్కొనేందుకు వీలైనంత ప్రయత్నించటమే వీరు చేయగల పని. ప్రయత్నం ఒకోసారి నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు. మోడీ గాలిని కాంగ్రెసే కాదు, ఏ ప్రతిపక్షమూ తట్టుకొనలేకపోయింది. అటువంటపుడు రాహుల్ పలాయన వాదానికి ఏ అర్థమూ కన్పించదు.

రాహుల్ గ్రహించవలసినవి, చేయవలసినవి కొన్నున్నాయి. కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో సరికాదన్నది నిజమేగాని, కాంగ్రెస్ పార్టీని ఇంతకాలం నిలబెడుతూ వచ్చింది కుటుంబమేనన్నది ఒక చేదు నిజం. ఒకవేళ ఆయన ఉపసంహరించుకుని ప్రియాంక కూడా ముందుకు రాని పక్షంలో పార్టీ క్రమంగా విచ్ఛిన్నంకావటం ఖాయం. ఇది మొదటిది కాగా, మోడీ లేక బిజెపి బలిమి శాశ్వతం కాదు. గత 70 సంవత్సరాలలో ఇతర పార్టీల వలెనే జనసంఘ్, బిజెపిలు కూడా అనేక మార్లు జయాపజయాలకు లోనయ్యాయి. మోడీతో పోల్చితే రాహుల్ వయసు చిన్నది కూడా. కనుక భవిష్యత్తులో బిజెపి తిరిగి ఓడదని, మోడీ ప్రాబల్యం తగ్గదని చెప్పలేము.

పైగా మోడీ విజయానికి కలిసి వచ్చిన అంశాలలో కృత్రిమమైనవి, ఆకారణం చేత తాత్కాలికం అనదగ్గవి కొన్నున్నాయి. ఇది రెండవది. ఈ రెండింటి కన్న ముఖ్యమైనది ఒకటున్నది. అది కాంగ్రెస్ పార్టీలో గల రకరకాల లోపాలను తొలగించుకోవటం. అవి తొలిగిన కొద్దీ కాంగ్రెస్ వంటి పార్టీకి తిరిగి సముచిత స్థానం లభించటం అసాధ్యం కాదు. రాహుల్ గాంధీ నాయకత్వాన గత 15 సంవత్సరాలలో అటువంటి కృషి జరగకపోవటం అన్నిటికీ మించిన సమస్య. ఇప్పటికైనా ఆ దిశలో ఆలోచించటం అవసరం తప్ప, పలాయన వాదాన్ని ఆశ్రయించటం కాదు.

Rahul Gandhi concedes defeat in Amethi