Home జాతీయ వార్తలు భ్రమలో కాలం గడిపి ఓడారు

భ్రమలో కాలం గడిపి ఓడారు

rahul-gandhiరాహుల్‌కు సాథీ కాని అమేథీ

అమేథీ : దేశవ్యాప్తంగా అమేథీ అంటే రాహుల్ ..రాహుల్ అంటే అమేథీ అనుకుంటూ వచ్చారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి రాయ్‌బరేలీ కంచుకోట అయితే అమేథీ హమేషా సాథీగా మారింది. అయితే ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ తిరిగి అమేథీ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, పార్టీపరంగా సరైన అనుసంధాన వ్యవస్థ లేకపోవడం, ప్రత్యేకించి గ్రామీణ ప్రజానీకంతో రాహుల్, కాంగ్రెస్ పెద్దలు దూరం కావడంతో , సగటు ఓటరుకు పార్టీకి మధ్య తీవ్రస్థాయి అంతరాలు ఏర్పడ్డట్లు స్పష్టం అయింది. ఉత్తరప్రదేశ్ ఆది నుంచి కాంగ్రెస్ పట్ల ఆదరణభావంతోనే ఉంది. 1980 నుంచి అమేథీ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయంగా, అభిమాన తత్వంతో నిలిచింది.

అయితే యుపిలో గత కొంతకాలంగా కాంగ్రెస్ ఆధిక్యత తగ్గుతూ వస్తోంది. బిజెపి రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో చొచ్చుకుపోగా, ఎస్‌పి, బిఎస్‌పిలు, పట్టణ, నగర ప్రాంతాల్లో బలోపేతం అయ్యాయి. దేశంలో అతి పురాతన కాంగ్రెస్ పార్టీ అమేథీ నుంచి అత్యంత సునాయాసంగా, అత్యధిక మెజార్టీ సంఖ్యతో గెలుస్తూ వచ్చింది. అయితే ఈ సారి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇక్కడి నుంచి బరిలోకి దిగి సిట్టింగ్ ఎంపి అయిన రాహుల్‌ను 55,120 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఇరానీ ఇక్కడి నుంచే రాహుల్‌తో తలపడ్డారు. అప్పటి ఎన్నికలలో రాహుల్ అజేయుడిగా నిలిచి ఆమెను 1,07,903 ఓట్ల తేడాతో ఓడించారు. యుపి రాజధాని లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమేథీలో గెలుపు కష్టం కాదని, సులభం అని రాహుల్ భావించడం, ఆయన ధోరణిని యుపి కాంగ్రెస్ నేతలు బలపర్చడం కోలుకోలేని నష్టాన్ని కల్గించాయి.

ఓడినా పట్టు వీడని విక్రమార్కురాలు

గతంలో ఇక్కడ ఓడిన స్మృతీ ఇరానీ ఈ దుమ్మూధూళి పట్టి ఉండే నియోజకవర్గంలో బిజెపిని పటిష్టం చేసుకుంటూ రావడం, ఎంపిగా ఉన్న వారు ఇక్కడి వారికి ఏమి చేయలేకపొయ్యారని చెప్పడంలో విజయం సాధించడంతో ఇక్కడ ఫలితం తారుమారు అవుతుందని కొన్ని ఎన్నికల విశ్లేషణ సంస్థలు ముందుగానే పసికట్టాయి. మూడుసార్లు అమేథీ ఎంపి అయిన రాహుల్ తరచూ తన నియోజకవర్గానికి వస్తూ ఉండేవారు. అయితే ఆయన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం కానీ, అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడటం కానీ జరగలేదని వెల్లడైంది. అమేథీ తనదే తనకు ఏమీ ఎదురుదెబ్బ ఉండదని రాహుల్ భావిస్తూ వచ్చినా, ఎన్నికలకు అతి కొద్ది రోజుల ముందు వాస్తవికతను గ్రహించినట్లు, అందుకే కేరళలోని వాయనాడ్‌ను సురక్షిత స్థానంగా ఎంచుకున్నట్లు వెల్లడైంది.

ఇక్కడి రైతులు , వ్యాపారులు, యువజనులు అమేథీ పట్ల రాహుల్ అనాసక్తిపై నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారని, ఇది రాహుల్ వ్యతిరేక ప్రచారానికి కలిసి వచ్చిందని విశ్లేషిస్తున్నారు. రాహుల్ ఢిల్లీ నుంచి అమేథీకి వచ్చేవారు. ఆయన ఫుర్సత్‌గంజ్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి అమేథీ టౌన్‌కు వచ్చేవారని, అక్కడ కొద్ది సేపు ఉండి తిరిగి వెళ్లే వారని, ఈ విధంగా పట్టణ కేంద్రానికే ఆయన పరిమితం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల వారి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినట్లుగా లేదని ఇక్కడి మండీ ప్రాంతంలోని చిరు వ్యాపారి నీల్ సింగ్ చెప్పారు. కేవలం నేతల వద్దకు వెళ్లి, కొందరు కార్యకర్తలతో బాతాఖానీలకు దిగి వెళ్లడంతో ఆయన నేరుగా ప్రజలను కలుసుకునేందుకు వీల్లేకుండా పోయిందని , దీనితో ఓట్లను దూరం చేసుకున్నారని చెప్పారు.

మరో విచిత్రం ఏమిటంటే రాహుల్ తనను తాను ప్రజలతో కలిసి ఉన్నట్లుగా ఒక భ్రమలో ఉండేవారని, తాను అందరినీ కలుస్తున్నానని, అంతా తనకు సమస్యలు విన్పించుకుంటూ ఉన్నారని ఒక విధమైన మిథ్యలో ఉండేవారని సెలోన్ బస్టాండు వద్ద ఛాయ్ బంకు నడిపించుకుంటూ బతికే రాజూ సోలంకీ విమర్శించారు. మొత్తానికి ఆయన సలహాదారులు , ప్రత్యేకించి అంతా బాగుందని చెపుతూ వచ్చిన పిసిసి వర్గాలు ఆయన విజయావకాశాలను దెబ్బతీశారని తెలిపారు. రాహుల్ ఉత్సాహంగానే రోడ్‌షోలు జరిపేవారు. రాదార్ల వెంబడి నిలిచి మాట్లాడే వారు.

అయితే ఇందుకు విరుద్ధంగా ఇరానీ గ్రామాలకు , ఇళ్లకు వెళ్లారని , గ్రామీణ ప్రజలలతో ముచ్చట్లు, వారి కష్టాలు నష్టాలు తెలుసుకోవడం వంటివి చేశారని వివరించారు. బాగుపడాలంటే బిజెపికి ఓటేయాలని, లేకపోతే పరిస్థితి మారదని తేల్చిచెప్పడంలో విజయం సాధించారు. మౌలిక సౌకర్యాలు లేవని, అవి రావాలంటే వ్యవస్థ మారాలని స్మృతీ చెప్పడం, ఆమె కేంద్ర మంత్రిగా కూడా ఉండటం బిజెపికి అనుకూలించింది.

ప్రియాంక వచ్చినా ఏమున్నదీ?

ప్రచారానికి సారధ్యం వహిస్తూ ప్రియాంక ఆలస్యంగా వచ్చినా, కొంత తేడా వచ్చినా, ఓట్ల ఫలితం కనబడలేదని, కేవలం నవ్వ డం, గాలిలో చేతులు కదుపుతూ కదలడం, వాహనాలలో తిరుగుతూ కిందికి దిగకపోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని స్థానికులు ప్రశ్నించారు. యువతరానికి, కొత్త ఓటర్లకు కాంగ్రెస్ ఈ ప్రాంతానికి ఏమీ చేసిందనేది తెలియదని, బిజెపి నేతలు తాము ఇక ముందు ఈప్రాంతానికి ఏదో చేస్తామని చెప్పడం, దీనిని వారు విశ్వసించడంతో కాంగ్రెస్ పెద్ద నేత గెలుపులో తేడా వచ్చిపడిందని ఇక్కడి యువజన కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Rahul Gandhi concedes defeat in Amethi