Friday, April 19, 2024

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత యువకులపై కొందరు వ్యక్తులు దాడికి దిగి కొట్టడం, వారి బట్టలూడదీసి, వారిలొ ఒకరి శరీరంలో స్క్రూడ్రైవర్ దింపడం వంటి దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన వెంటనే రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులను చితకబాదిన వారే ఈ దృశ్యాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టారని వెల్లడైంది. ఇది అత్యంత బాధాకర ఘటన, దీనికి రాజస్థాన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.రాజస్థాన్‌లోని నాగౌర్‌లో దళిత సోదరులపై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కాంగ్రెస్‌కు చెందిన ఎస్‌సి బృందం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై బిజెపి నేతలు వరుసగా తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేదని విమర్శించారు. కాంగ్రెస్ దళిత నేతలు ఏమి చేస్తున్నారని నిలదీయడంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.


రూ 50వేల చోరీ పేరిట దారుణం
ఈ ఘటన కర్నూ గ్రామంలో జరిగింది. 26 ఏండ్లు, 18 ఏండ్ల వయస్కులైన సోదరులు రూ 50వేలు దొంగిలిస్తుండగా కర్నూ గ్రామంలో పట్టుకున్నట్లు చెపుతున్నారు. వీరిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దాడికి దిగిన వారిలో ఒక వ్యక్తి స్క్రూడ్రైవర్‌ను పెట్రోల్‌లో ముంచి ఒక యువకుడికి గుచ్చాడని వీడియోతో వెల్లడైంది. బాధితులు బాధ తట్టుకోలేక అరిచి, తమను వదిలిపెట్టాలని వేడుకున్నా దుండగులు కనికరించలేదు. దాడికి దిగిన వారిని స్థానికులైన భావ్ సింగ్, ఐదీన్ సింగ్, లక్ష్మణ్ సింగ్, జాసూ సింగ్, సవాయ్ సింగ్, హర్మాసింగ్‌గా గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. దాడిపై ఇప్పటికీ తమకు బాధితుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా పోలీసు అధికారి వికాస్ పాథక్ తెలిపారు. అయితే వీడియో గురించి తమకు తెలియగానే తాము దర్యాప్తు చేపట్టినట్లు, దోషులను గుర్తించినట్లు చెప్పారు. దాడికి దిగిన వారిపై దళితులపై దాడుల నివారణ నిబంధనల పరిధిలో కేసు నమోదు చేశారు.

Rahul Gandhi fire on beating of Dalit in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News