Home జాతీయ వార్తలు నిరుపేద కుటుంబాలకు రూ.72 వేలు

నిరుపేద కుటుంబాలకు రూ.72 వేలు

Rahul-Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేసితీరుతామని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని 20 శాతం మంది నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నేరుగా వారి ఖాతాల్లోకి చేరేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలపై, ప్రత్యేకించి ఎన్నికల ప్రణాళిక ఖరారుపై కచర్చించేందుకు సోమవారం ఇక్కడ పార్టీలో కీలకమైన వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశం జరిగింది. ఇందులో రాహుల్‌తో పాటు పార్టీ ప్రముఖ నేతలు అంతా పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆ తరువాత రాహుల్ విలేకరులతో మాట్లాడారు. పేదరిక నిర్మూలన దిశలో దేశంలో ఇదే అత్యంత విస్తృత స్థాయి అపూర్వ, క్షేత్రస్థాయి కార్యక్రమం ఇదే అవుతుందని రాహుల్ స్పష్టం చేశారు. పేదలలో అత్యంత నిరుపేదల కుటుంబాలను ఎంచుకుని ఈ ఆదాయ భరోసాను కల్పిస్తామని రాహుల్ వెల్లడించారు. ఒక గొప్ప మార్పు కోసం ఇదే మంచి సమయం, కాంగ్రెస్ పార్టీ పేదలకు ప్రకటించే కనీస ఆదాయ భరోసా పథకంతో దేశవ్యాప్తంగా ఐదుకోట్ల కుటుంబాలకు మొత్తం మీద పాతిక కోట్ల మందికి నేరుగా ప్రయోజనం దక్కుతుందని రాహుల్ వివరించారు. పేదలకు తమ పార్టీ అందించే కనీస ఆదాయ భరోసా ఖచ్చితంగా అమలు అవుతుందని వెల్లడించారు. పేదరికంపై ఇది తుదిపోరు కావల్సిందేనన్నారు.

దేశంలో పేదరికాన్ని నిర్మూలించి తీరుతామని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. ప్రతి ఏటా పేదల ఖాతాలకు రూ 72000 చేరడం వల్ల వారి కుటుంబాలు సరైన రీతిలో గడవడానికి, వారు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలేర్పడుతుందని రాహుల్ చెప్పారు. పేదలకు న్యాయం దక్కేలా చేస్తామని తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. పేదరికంపై తుదిపోరును కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఈ రోజును చారిత్రక దినంగానే భావించాల్సి ఉంటుందన్నారు. పేదలకు భరోసా పథకం గురించి సిడబ్లుసి భేటీలో ముందుగా విస్తృత సమీక్ష జరిగింది. ఎఐసిసి ప్రధాన కార్యాయలంలో ఈ భేటీ నిర్వహించారు. ఈ పథకాన్ని ఏదో ఎన్నికల వాగ్దానంలోని అంశంగా ప్రకటించడం లేదని, దీని అమలులో ఉండే ఆర్థిక సాధకబాధకాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుని తరువాతనే రూపకల్పనకు దిగినట్లు తెలిపారు. పేరొందిన ఆర్థికవేత్తలు, ద్రవ్య నిపుణులతో అన్ని అంశాలను బేరీజు వేసుకుని తరువాతనే దీనికి ఒక సమగ్రరూపం ఇచ్చినట్లు తెలిపారు. పేదలను సరైన రీతిలో ఆదుకునే చిత్తశుద్థి ఏదీ ప్రధాని మోడీకి లేదని, ఆయన ఎప్పుడూ సంపన్నులకే సొమ్ము పంచిపెడుతూ వస్తుంటారని, పేదలకు కాదని విమర్శించారు.

గత ఐదేళ్లలో పేదలు చాలా బాధలకు గురి అయ్యారని, వీరికి న్యాయం కల్పించి వారిని తగు విధంగా ఆదుకోవడం తమ పార్టీ బాధ్యత అని రాహుల్ తేల్చిచెప్పారు. నరేంద్ర మోడీ సంపన్న సంతృప్త భారత్‌ను సృష్టిస్తున్నారని, అయితే తాము పేదలకు ఆసరా కల్పించే దేశం కోసం ముందుకు వెళ్లుతామని, ఇక మోడీ విభజన రేఖలతో రెండు భారత్‌లను సృష్టిస్తూ వస్తున్నారని, అయితే కాంగ్రెస్ దీనికి అనుమతించదని, ఒకే భారత్ ఉంటుందని, విభజన రేఖలతో కూడిన ద్వంద్వ భారత్‌కు అవకాశం లేనే లేదని స్పష్టం చేశారు.

Rahul Gandhi Has Promised rs72000 per Year for the Poor