Home జాతీయ వార్తలు రాహుల్ గాంధీకి హైకోర్టు సమన్లు

రాహుల్ గాంధీకి హైకోర్టు సమన్లు

Rahul-Gandhi

అహ్మదాబాద్ : నేరస్త పరువు నష్టం కేసు విచారణకు సంబంధించి, ఆగస్టు 9 న కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి, గుజరాత్ కోర్టు తాజాగా మంగళవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక హత్యకేసులో నిందితుడు అని రాహుల్ ఆరోపించారని స్థానిక బిజెపి కార్పొరేటర్ క్రిష్ణవర్ధన్ బ్రహ్మభట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ డిఎస్ దభి గతంలో మే 1 న ఈ కేసుపై సమన్లు లోక్‌సభ స్పీకర్ ద్వారా పంపించారు. రాహుల్ ఆనాడు పార్లమెంటు సభ్యుడుగా ఉండడంతో ఆ సమన్లు తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ నేరుగా ఢిల్లీ లోని రాహుల్ నివాసానికి సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 23న జబల్‌పూర్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పిటిషన్ దారుడు కేసులో ఆరోపించారు. సొహ్రాబుదీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్‌షా నిర్దోషి అని సిబిఐ కోర్టు 2015 లో విడుదల చేసిందని అలాంటప్పుడు రాహుల్ ఆయనను హత్యకేసులో నిందితునిగా పేర్కొనడం నేరస్థ పరువునష్టం కేసు కిందకు వస్తుందని పిటిషన్‌దారుడు పేర్కొన్నారు. అంతకు ముందు మరో కోర్టు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సర్జేవాలాకు సమస్లు జారీ చేసింది. అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు, చైర్మన్ ఈ పరువునష్టం కేసు దాఖలు చేశారు. అమిత్‌షా ఆ బ్యాంకు డైరక్టరుగా ఉండేవారు. ఈ కేసులో విచారణకు జులై 12న రాహుల్ హాజరు కావలసి ఉంది. పరువు నష్టం కేసులకు సంబంధించి గత వారం ముంబై, పాట్నా కోర్టులకు రాహుల్ హాజరైన సంగతి తెలిసిందే.

Rahul Gandhi issued summonses by Gujarat courts