Home జాతీయ వార్తలు పార్టీపై మీ కొడుకులను రుద్దుతారా?

పార్టీపై మీ కొడుకులను రుద్దుతారా?

 

 సొంత ప్రయోజనాల కోసం వాళ్ల పేరిట బెదిరింపులా?
 నేను ఒక్కడినే మోడీపై పోరాడుతుంటే మీరేం చేశారు?
 రాజీనామా చేస్తా.. గాంధీయేతర ఫ్యామిలీ నుంచి కొత్త నాయకుడిని పెడదాం
 సిడబ్లుసి కీలక భేటీలో ముగ్గురు సీనియర్లపై రాహుల్ ఆగ్రహావేశాలు
 బాసటగా నిలిచిన ప్రియాంక, నేతలపై రెండు సార్లు అసహనం
 బయటికి పొక్కిన అసక్తికరమైన అంశాలు

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత శనివారంనాడు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఆదివారంనాడు కొన్ని బయటికి పొక్కాయి. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షించేందుకు సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ కీలక భేటీలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానంగా ముగ్గురు సీనియర్ నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కమల్‌నాథ్(ఈయన సిడబ్లుసి భేటీకి హాజరు కాలేదు), అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముగ్గురు నేతలు తమతమ కొడుకులను పార్టీపై బలవంతంగా రుద్దారని రాహుల్ పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి వారి కుమారులను ముందుకు తెచ్చారని అన్నారు. ఈ సమయంలో గుణ మాజీ ఎంపి జ్యోతిరాదిత్య సింధియా కలుగజేసుకుని రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాలను మరింత విస్తరిద్దామని ప్రతిపాదించగా రాహుల్ ఆయన మాటలను పక్కనబెడుతూ ‘చిదంబరం తన కుమారుడు కార్తీకి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని బెదిరించారు. ఇక కమల్‌నాథేమో సిఎంగా ఉండి నా కొడుకుకి టికెట్ ఇప్పించుకోలేని నేను ఈ పదవిలో ఉండి నిష్ఠూరమాడుతారు. రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ అయితే తన కుమారుడిని జోధ్‌పూర్ నుంచి గెలిపించుకోవడానికి ఆ ఒక్క నియోజకవర్గంలో ఏడు సార్లు పర్యటిస్తారు.. ప్రచారం చేస్తారు. అలా అయితే మిగతా నియోజకవర్గాల సంగతేంటీ?’ అని రాహుల్ ఒకింత ఆగ్రహం ప్రదర్శించారు. రాఫెల్, అవినీతి అంశాలపై తాను గొంతు చించుకుంటుంటే మీలో ఎంతమంది దీనికి మద్దతుగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీశారో చేతులెత్తండి అని అడిగారు. దీనికి పలువురు నేతలు చేతులు పైకి ఎత్తి మాట్లాడబోతుండగా రాహుల్ వారి వైపు చూసి మీరు మాట్లాడిందేం లేదు అని తోసిపుచ్చారు. ఇక వివిధ రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాల మధ్య విబేధాలపై కూడా రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను కూడా ఇక ఎంతమాత్రం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఇష్టపడడం లేదని, గాంధీయేతర కుటుంబం నుంచి కొత్త అధ్యక్షుడిని నియామకం చేద్దామని కూడా రాహుల్ ప్రతిపాదించారు. ఈ సమయంలో ప్రియాంక కలుగజేసుకున్నారని, ఓటమికి ఈ గదిలో కూర్చున్న నాయకులందరు (సిడబ్లుసి) బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారని సమావేశానికి హాజరైన ఓ నేత పేర్కొన్నారు.
రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలంతా కోరినప్పుడు కూడా ప్రియాంక మరోసారి కలుగజేసుకుని ‘నా సోదరుడు ఒక్కడు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మీరంతా ఎక్కడున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరైనా ప్రజల్లోకి గట్టిగా వెళ్లగలిగారా?. రాఫెల్ కుంభకోణం, చౌకీదార్ చోర్ హై, పేదల కోసం తీసుకొస్తున్నామని చెప్పిన ‘న్యాయ్’ పథకం ఇలాంటి వాటిపై ఒక్కడే మాట్లాడితేం ఏం లాభం. సమష్టిగా వీటిని జనంలోకి తీసుకెళ్లలేదేం’ అని ఆవేశంగా అందరినీ ప్రశ్నించారట. ఇలా రెండు సార్లు ప్రియాంక తన ఆవేశాన్ని సమావేశంలో ప్రదర్శించారని ఓ నాయకుడు వెల్లడించారు. అదే సమయంలో రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని ప్రియాంక సమర్థించలేదని, అతడే నాయకుడిగా కొనసాగాలని సూచించారని ఆయన పేర్కొన్నారు.

Rahul Gandhi serious on Congress Leaders