ఔరంగాబాద్(మహారాష్ట్ర):ఆర్థిక సంక్షోభం, రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్య వంటి వాస్తవ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, అధికార బిజెపి ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై విరుచుకుపడుతూ దేశంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభంపై ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆర్టికల్ 370, మిషన్ చంద్రయాన్ వంటి విషయాలను ప్రస్తావిస్తున్నారని ఆయన అన్నారు. యువజనులు ఉద్యోగాల కోసం అడుగుతుంటే వారిని చంద్రుడివైపు చూడమంటున్నారని, లేదా ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రం మోడీ, షా పెదవి విప్పడం లేదని ఆయన ఆరోపించారు. చంద్రుడిపైకి రాకెట్‌ను పంపినంతమాత్రాన దేశ యువజనుల కడుపు నిండదని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్య రైతులను పట్టించుకోకుండా కేవలం కొందరు బడా పారిశ్రామికవేత్తలకు రూ. 5.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.