Tuesday, April 23, 2024

పంజాబ్‌లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Rail roko agitation started in Punjab

అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు
3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు

చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు తమ మూడు రోజుల ”రైలు రోకో” నిరసనను గురువారం ప్రారంభించారు. కాగా..నిరసనకారులతో ఘర్షణ పరిస్థితులను నివారించే ఉద్దేశంతో రైల్వేలు అనేక రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేశాయి. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 26 వరకు 14 జతల ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు.

మూడు రోజుల పాటు రద్దయిన రైళ్లలో గోల్డెన్ టెంపుల్ మెయిల్ (అమృత్‌సర్-ముంబయి సెంట్రల్), జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్(హరిద్వార్-అమృత్‌సర్), న్యూఢిల్లీ-జమ్మూ తావి, కరమ్‌భూమి(అమృత్‌సర్-న్యూఢిల్లీ జల్‌పాయ్‌గురి), సచ్‌ఖండ్ ఎక్స్‌పె్రఎస్(నాందేడ్-అమృత్‌సర్), షహీద్ ఎక్స్‌ప్రెస్(అమృత్‌సర్-జయ్‌నగర్) ఉన్నాయని అధికారులు తెలిపారు. సరకు రవాణా, పార్సిల్ సర్వీసులకు చెందిన రైళ్లను కూడా రీషెడ్యూల్ చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా రెగ్యులర్ పాసింజర్ రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైలు రోకో ఆందోళనకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపునివ్వగా వివిధ రైతు సంఘాలు దానికి మద్దతు ప్రకటించాయి. గురువారం ఉదయం రైలు రోకో ఆందోళనలో భాగంగా భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) కార్యకర్తలు బర్నాలా, సంగ్రూర్ వద్ద రైలు పట్టాలపై బైఠాయించారు. అమృత్‌సరలోని దేవీదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్‌లోని బస్తీ టంకావాలా గ్రామాల సమీపంలో రైలు పట్టాలపై కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యకర్తలు బైఠాయించారు.

ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులతోసహా వివిధ వర్గాల నుంచి తమకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు చెప్పారు. రైతుల ఆందోళనలో పాల్గొనవద్దని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చినట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు. వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులను సంఘ బహిష్కరణ చేయడంతోపాటు బిజెపి నాయకులను ఘెరావ్ చేయాలని తాము ప్రతిజ్ఙ చేసినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 25న పంజాబ్ రాష్ట్ర బంద్‌కు దాదాపు 31 రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

వ్యసాయ బిల్లులతో తమ పంటలకు కనీస మద్దతు ధర లభించదని, బడా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై తాము జీవించవలసి వస్తుందని పంజాబ్‌లోని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా..రైతుల రైలు రోకో ఆందోళన ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల లోడింగ్‌పై తీవ్ర ప్రభావం చూపగలదని రైల్వే ప్రతినిధి ఒకరు న్యూఢిల్లీలో తెలిపారు. పంజాబ్ నుంచి ప్రతి రోజు భారత ఆహార సంస్థ 35 రేక్స్(రేక్ అంటే ఒక గూడ్సు రైలు) ఆహారధాన్యాలను లోడింగ్ చేస్తుందని అధికారులు తెలిపారు. అంతేగాకుండా ఎరువులు, సిమెంట్, ఆటో, కంటెయినర్లలో మిక్స్‌డ్ గూడ్సుతో కూడిన 9-10 రేక్స్ రోజూ పంజాబ్ నుంచి వెళతాయని కూడా వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News