Wednesday, April 24, 2024

35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు ఉంటారు. మిగతా సిబ్బంది మొత్తం ప్రైవేటు సంస్థలకు చెందినవారు ఉంటారు. రైళ్ల రాకపోకలు, సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వేశాఖే పర్యవేక్షిస్తుంది. రైల్వే పట్టాలపై తమ రైళ్లను నడుపుకునేందుకు ప్రైవేటు సంస్థలు నిర్ధారిత మొత్తాన్ని రైల్వేలకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేటు సంస్థలతో ఏర్పాటు చేసుకునే ఒప్పందంలో భాగంగా ఆయా సంస్థలకు చెందిన రైళ్ల నిర్వహణకు 35 ఏళ్ల వరకు అనుమతులు లభిస్తాయని తెలుస్తోంది.
కచ్చితమైన సమయపాలన
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ విమానాలు నడిపే ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సంస్థల తరహాలోనే ఈ ప్రైవేటు రైళ్లు నడవనున్నాయి. ఈ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ప్రయాణ సదుపాయాలను అందజేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు కచ్చితమైన సమయపాలన పాటించనున్నారు. ప్రస్తుతం రైళ్లలో ఐఆర్‌సిటిసి క్యాటరింగ్ నిర్వహిస్తుండగా, ప్రైవేట్ రైళ్లలో ఆ సంస్థలే ఈ సదుపాయాన్ని కల్పించనున్నాయి.
సికింద్రాబాద్ క్లస్టర్‌లో నడిచే ప్రైవేటు రైళ్ల వివరాలు
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ క్లస్టర్‌లో నడిచే ప్రైవేటు రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, ముంబై, హౌరా మార్గాలు, విశాఖ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలు ఉన్నాయి. వీటితో పాటు ముంబై, ఔరంగాబాద్ మార్గం కూడా సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలోకి వచ్చింది. ఇక ప్రైవేటు రంగం తయారుచేసే ఆధునిక రైళ్లు ఎక్కువగా ‘మేక్ ఇన్ ఇండియా’లో ఉంటాయి.
క్లస్టర్ 9 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ మార్గంలోని రూట్లు వాటి వివరాలు..
సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం ద్వారా విశాఖకు 13 గంటల 45 నిమిషాల్లో రైలు (19:45 నుంచి 09:30 వరకు)
శ్రీకాకుళం వయా విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు 14 గంటల్లో రైలు (15:00 నుంచి 05:00 వరకు)
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 12 గంటల 15 నిమిషాల్లో రైలు (06:00 నుంచి 18:15 వరకు)
తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు 12 గంటల 15 నిమిషాల్లో రైలు (08:40 నుంచి 20:55 వరకు)
గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు 4 గంటల 45 నిమిషాల్లో రైలు (23:30 నుంచి 04:15)
సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు 4 గంటల 45 నిమిషాల్లో రైలు (23:30 నుంచి 04:15)
గుంటూరు నుంచి కర్నూలుకు 8 గంటల్లో రైలు (06:00 నుంచి 14:00 వరకు)
7 గంటల 40 నిమిషాల్లో కర్నూలు నుంచి గుంటూరుకు రైలు (14:50 నుంచి 22:30 వరకు)
తిరుపతి వయా సికింద్రాబాద్ నుంచి వారణాసికి 33 గంటల 45 నిమిషాల్లో రైలు (22:00 నుంచి 07:45)
వారణాసి నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి 33 గంటల 15 నిమిషాల్లో రైలు (09:45 నుంచి 21:00 వరకు)
సికింద్రాబాద్ నుంచి ముంబైకి 11 గంటల 20 నిమిషాల్లో (22:25 నుంచి 09:45 వరకు) రైలు
ముంబై నుంచి సికింద్రాబాద్ వరకు 11 గంటల 45 నిమిషాల్లో రైలు (23:35 నుంచి 11:20 వరకు)
ముంబై నుంచి ఔరంగాబాద్‌కు 6 గంటల్లో రైలు (15:45 నుంచి 21:45 వరకు)
ఔరంగాబాద్ నుంచి ముంబైకి 6 గంటల 10 నిమిషాల్లో రైలు (06:15 నుంచి 12:25)
విశాఖపట్నం నుంచి విజయవాడకు 6 గంటల 05 నిమిషాల్లో రైలు (08:40 నుంచి 14:45 వరకు)
విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు 6 గంటల 05 నిమిషాల్లో రైలు (16:00 నుంచి 22:05)
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రేణుగుంట మీదుగా 16 గంటల 45 నిమిషాల్లో రైలు (19:45 నుంచి 12:30 వరకు)
బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు 17 గంటల 55 నిమిషాల్లో రైలు (18:00 నుంచి 11:55 వరకు)
హౌరా నుంచి సికింద్రాబాద్‌కు 25 గంటల 20 నిమిషాల్లో (18:40 నుంచి 20:00 వరకు) రైలు
సికింద్రాబాద్ నుంచి హౌరాకు 25 గంటల 30 నిమిషాల్లో (05:00 నుంచి 06:30 వరకు) రైలు
త్వరలో సాంకేతిక టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి
వీటిలో ముంబై, ఔరంగాబాద్, విశాఖ, విజయవాడ రైళ్లతో పాటు మిగతావి సికింద్రాబాద్ కేంద్రంగానే రాకపోకలు సాగించనున్నాయి. త్వరలో సాంకేతిక టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక టెండర్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
ప్రైవేటు రైళ్లకు అనుమతినివ్వడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారని, భవిష్యత్‌లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవని దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వేలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని, ప్రయాణికులకు ప్రస్తుతం అతి తక్కువ చార్జీల్లో రైల్వే ప్రయాణం లభిస్తుండగా, ప్రైవేటు రైళ్ల వల్ల చార్జీలు భారీగా పెరుగుతాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Railway department permission to private trains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News