Thursday, April 25, 2024

ఢిల్లీలో రైల్వే జాబ్స్ పేరిట తమిళ తంబీలకు టోపీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాల పేరిట తమిళనాడుకు చెందిన 28 మంది యువ నిరుద్యోగులను కోట్లాది రూపాయలు ముంచెసిందో మోసగాళ్ల ముఠా. రైల్వే ఉద్యోగంలో ట్రెయినింగ్ పేరుతో నెలరోజుల పాటు ఈ బాధితులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని వివిధ ప్టాట్‌ఫారాలపైన నిల్చుని వచ్చి పోయే రైళ్ల వివరాలను నమోదు చేస్తూ గడిపేశారు. ఆ తర్వాత తెలిసింది వీరికి తాము మోసపోయామని. మీకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్(టిటిఇ), ట్రాఫిక్ అసిస్టెంట్స్, క్లర్కులు వంటి హోదాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు వసూలు చేసింది ఆ ముఠా. ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగంలో నమోదైన ఫిర్యాదు ప్రకారం..మొత్తం 28 మంది నిరుద్యోగుల నుంచి రూ. 2.67 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఆ ముఠా.

ఈ ఏడాది జూన్, జులై మధ్య నెలరోజుల పాటు ట్రయినింగ్ ఇవ్వడంతోపాటు వారికి ఫోర్జరీ నియామక పత్రాలు కూడా ఇచ్చారని బాధితుల పక్షాన ఎం సుబ్బుసామి అనే 70 ఏళ్ల వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సైనికోద్యోగి అయిన సుబ్బుసామి ఈ మోసగాళ్ల ముఠాకు, నిరుద్యోగులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించి తాను కూడా ఈ ముఠా వలలో చిక్కుకున్నారు. ఒక్కో అభ్యర్థి రూ. 2 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు సుబ్బుసామికి డబ్బు చెల్లించగా ఈ డబ్బును ఆయన తనను తాను ఢిల్లీలోని ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యుటీ డైరెక్టర్‌గా చెప్పుకున్న వికాస్ రాణా అనే వ్యక్తికి చెల్లించారు. బాధితులు అందరూ ఇంజనీరింగ్, సాంకేతిక విద్యలో పట్టభద్రులు కావడం విశేషం. తమిళనాడులోని విరుధునగర్‌కు చెందిన సుబ్బుసామి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఎదురుచూడకుండా తన ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో సాయపడేవారు.

ఆయనకు ఢిల్లీలోని ఒక ఎంపి నివాసంలో కోయంబ్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయని, డబ్బులు ముట్టచెబితే తాను రైల్వేలో ఉదోగాలు ఇప్పించగలనని అతను నమ్మబలికాడు. దీంతో తమ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిరుద్యోగులతో సుబ్బుసామి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వీరికి రైల్వేలో ట్రెయినింగ్ జరుగుతోందని తెలిసి మరో 25మంది అక్కడకు చేరుకున్నారు. మొందుగా వీరికి కన్నాట్ ప్లేస్‌లోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో మెడికల్ ఎగ్జామినేషన్ జరిపించారు. ఆ తర్వాత శంకర్ మార్కెట్‌లోని ఉత్తర రైల్వేకు చెందిన జూనియర్ ఇంజనీర్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపారు. శిక్షణ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులు,శిక్షణ పూర్తి సర్టిఫికెట్ల, నియామక ఉత్తర్వులు వంటి డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీవని తమకు ఆలస్యంగా తెలిసిందని సుబ్బుసామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఎన్నడూ రైల్వే భవనంలోకి తీసుకెళ్లలేదని, తన వద్ద నుంచి డబ్బు భవనం వెలుపలే తీసుకున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులకు శిక్షణ పేరుతో ఢిల్లీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల పైన నిలబెట్టి వచ్చి పోయే రైళ్ల వివరాలు నమోదు చేయాలని చెప్పారని, తాము కూడా ఇదంతా నిజమేనని నమ్మామని బాధితులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News