*పెదవి విరుస్తున్న ప్రతిపక్షాలు
మనతెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : గత బడ్జెట్ సందర్భంగా ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు నిర్మిస్తామన్న రైల్వే లైన్ విషయాన్ని బడ్జెట్‌లో మంత్రి ఈసారి ప్రస్తావించక పోవడం పట్ల జిల్లాలో నిరసన వ్యక్తం అవుతోంది. ఈ రైల్వే లైనును మంజూరు చేస్తూ 2700 కోట్ల రూపాయలను ప్రకటించింది. అయితే ఈ నిధుల నుంచి 1350 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్న మెలిక పెట్టింది. కేంద్రం ఇస్తానన్న 1350 కోట్లలో ఒక్క పైసాని కూడా విదిల్చలేదు. దీంతో ప్రాథమిక సర్వే చేపట్టలేకపోయారు. ఈ రైల్వే లైనుకు సంబంధించి ఈసారి బడ్జెట్‌లో ఏదైనా పురోగతి కనిపిస్తుందని జిల్లా ప్రజలు కన్న కలలు కల్లలయ్యాయి. కేంద్ర బడ్జెట్ బడుగు వర్గాలనే కాకుండా ఉద్యోగ వర్గాలను తీవ్రంగా నిరాశ పర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య జనానికి ఊరటనివ్వకుండా ఈ బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నదని ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన అటవీ శాఖ మంత్రి జోగురామన్న కేంద్ర బడ్జెట్‌ను దుయ్యబట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని, ముఖ్యంగా జిల్లాకు ఎలాంటి కొత్త పథకాలు, అభివృద్థి పనులు మంజూరు కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే లైన్ విషయంలో సైతం జిల్లా ప్రజలకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకే నిధులు మంజూరు పేరిట ఆర్థిక మంత్రి అరచేతిలో వైకుంఠాన్ని చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ రంగాన్ని పట్టించుకోకుండా ఆర్థిక స్థితిగతులనే ప్రామాణికంగా చేసుకొని ఎకనమికల్ బడ్జెట్‌ను రూపొందించారన్న వాదనలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుష్కలమైన వనరులన్నప్పటికీ బడ్జెట్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడక పోవడం అసంతృప్తికి కారణమవుతుంది. ఉద్యోగ వర్గాలకు ఆదాయ పన్ను మినహాయింపు విషయంలో స్లాబు రేటును మార్పు చేయకుండా యధాతథంగా కొనసాగిస్తామని చెప్పడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు నిరాశకు గురయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలోనూ ఆర్థిక మంత్రి చొరవ తీసుకోకపోవడం విచారకరమంటున్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో, మూత పడిన పరిశ్రమలను తెరిపించే దిశగా కాని ఎలాంటి కార్యాచరణ బడ్జెట్‌లో కనిపించక పోవడం కేంద్ర సర్కార్ నిర్లక్ష్యానికి వ్యక్తం చేస్తుందటున్నారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలన్ని బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తూ కేవలం కేంద్రం అరచేతిలో వైకుంఠం చూపేందుకు అంకెల గారడీని సృష్టించిందని దుయ్యబడుతున్నాయి.