Home తాజా వార్తలు నత్త నడకన ఆర్‌యుబి నిర్మాణ పనులు

నత్త నడకన ఆర్‌యుబి నిర్మాణ పనులు

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుంది?
ఏళ్ళు గడుస్తున్నా కొనసాగుతున్న పనులు
అధికారుల మధ్య సమన్వయ లోపం

 

మన తెలంగాణ/మల్కాజిగిరి: రైల్వే చక్రబంధంలో ఇరుక్కున్న మల్కాజిగిరి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చేస్తున్న కృషి అధికారుల మధ్య సమన్వయలోపంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ళలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్ళు కావస్తున్నా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలు మారినా ఆనంద్‌బాగ్‌లో జరుగుతున్న ఆర్‌యుబి నిర్మాణ పనులు మాత్రం సకాలంలో పూర్తి కావడం లేదు. ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పనుల వలన స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. పనులు ప్రారంభించిన సమయంలో సుమారు రెండేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు, నాయకులు ఐదేళ్ళుగడుస్తున్నా పూర్తికాని పరిస్థితి. ఇప్పటికి కూడా ఎప్పటి వరకు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఆర్‌యుబీ పనులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావ్ తను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఆనంద్ బాగ్‌లో జరుగుతున్న రైల్వే అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా ఆర్ అండ్ బి, జల మండలి అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు సకాలంలో పూర్తవ్వడంలేదు. స్థానికులు పలువురు తమ స్థలం విషయంలో కోర్టును ఆశ్రయించినా వారి సమస్యలను పరిష్కారించుందుకు ఎమ్మెల్యే స్వయంగా వారితో మాట్లాడి సమస్యలను పరిష్కారించేందుకు పాటుపడుతున్నారు. వివిధ విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆర్‌యుబి పనులను పర్యవేక్షిస్తున్నారు. సదరు కాంట్రాక్టరుకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెళ్ళువెత్తుతున్నాయి. పనుల్లో జరుతున్న జాప్యం వల్ల అధికారుల పని తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లోగా ఆర్‌యుబి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావ్ చేస్తున్న కృషి ఫలించేలా లేదు.