Home రాష్ట్ర వార్తలు రైల్వే కార్మికుల మెడపై కత్తి

రైల్వే కార్మికుల మెడపై కత్తి

rail

డిఎఆర్14(2) నిబంధనతో పరేషాన్ భవిష్యత్‌పై కార్మికుల ఆందోళన

మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే శాఖలో తప్పులు ఎవరు చేసినా కార్మికులు, ఉద్యోగులు శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. ఒక వైపు పని వత్తిడితో కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రమాదాలు జరిగినప్పుడల్లా రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న అమానుషమైన నిబంధనలు, జారీ చేస్తున్న సర్కులర్లు ఉద్యోగులు, కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాంటి రైలు ప్రమాదాలు జరిగినా అందుకు క్షేత్రస్థాయి కార్మికులు బలిపశువులుగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. ఉత్తర రైల్వే జోన్ పరిధిలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యులను చేస్తూ 12 మంది ట్రాక్ మరమ్మతు కార్మికులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించడమే అందుకు నిదర్శనం. రైలు ప్రమాదాల పట్ల ప్రయాణికులు, ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు రైల్వే ఉన్నతాధికారులు నిబంధనల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని రైల్వే వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉత్తర రైల్వే జోన్ పరిధిలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగి 22 మంది మృత్యువాతపడగా సుమారు 200 మంది గాయపడిన ఘటనలో రైల్వే శాఖ కార్మికులపై క్రమశిక్షణ చర్యల చట్టం (డిఎఆర్) లోని 14/2 నిబంధనను ప్రయోగించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ఆ ప్రాంతంలో విధులను నిర్వర్తించే కార్మికులకు ఎలాంటి చార్జిషీట్లు ఇవ్వకుండా, వారి నుంచి ఎలాంటి వివరణనూ తీసుకోకుండా, విచారణ అసలే చేపట్టకుండా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘డిఎఆర్ 14/2 నిబంధన’ ఆయుధాన్ని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రన్నింగ్, ఆపరేటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, టిఆర్‌బి, ఎస్ అండ్ టి, టిటిఎం, ఇంజనీరింగ్, లోకోషెడ్, కమర్షియల్, మినిస్టీరియల్ వర్క్ షాపులు, తదితర విభాగాల్లో కూడా ప్రయోగిస్తే తమ పరిస్థితి ఏమిటని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ట్రాక్ మెన్లు రైలు పట్టాల మరమ్మత్తులు తమ అధికారుల ఆదేశం మేరకే చేస్తారు. సేఫ్టీ రూల్స్ పాటించని అధికారుల నిర్లక్ష్యానికి ట్రాక్ మెన్లను బలి చేస్తున్నారన్నారు. చట్టాలన్నింటినీ గాలికి వదిలి ఒక్క కలం పోటుతో కార్మికులను ఇంటికి పంపించడం దుర్మార్గం” అని రైల్వే కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీజిల్, ఎలక్ట్రిక్ షెడ్లకు వచ్చే అదనపు లోకోల నిర్వహణకు, కోచింగ్ యార్డులో కోచ్‌ల నిర్వహణకు, కొత్త స్టేషన్లు రైళ్లు, కొత్త రైల్వే లైన్లు, నూతనంగా విద్యుదీకరింపబడిన లైన్ల నిర్వహణకు అవసరమయ్యే 2 లక్షల అదనపు ఉద్యోగాలను సాధించకపోగా సేఫ్టీ విభాగంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు భర్తీ కాలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రైల్వే బోర్డు నియామకాలు జరగాలంటే దానికి తగినంత మందిని సరెండర్ చేసే వ్యవస్థను అమలు చేస్తున్నది. ఫలితంగా ప్రతి జోన్‌లో జనరల్ మేనేజర్ కొత్త ఉద్యోగాలు కల్పించాలంటే దానికి తగిన సరెండర్ ఉద్యోగాలు లేవని సాకు చెబుతున్నారు. ఉద్యోగుల విధి నిర్వహణ (HOER) నిబంధనలను ఇప్పటివరకు మార్చలేదు. ఉద్యోగులకు పనిభారం పెరిగి రోజుకు 12 గంటల నుండి 14 గంటల వరకు పనిచేస్తున్నారు. వారాంతపు సెలవులు కూడా అందరికీ ఇవ్వడం లేదు. ఉద్యోగుల సంఖ్యను పెంచాలని పేర్కొన్న హైపవర్ కమిటీ నివేదికను గాలికి వదిలేశారు. ఇన్ని సమస్యలతో పనిచేస్తున్నప్పటికీ అనేక లోపాల వల్ల జరుగుతున్న ప్రమాదాలకు మానవ తప్పిదం పేరుతో కార్మికులను బలి చేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ చర్యల చట్టంలోని అమానుషమైన 14/2 నిబంధనను తొలగించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి రైల్వే భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. “క్రమశిక్షణకు, సక్రమ విధినిర్వహణకు అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో, ఎవరైనా ఉద్యోగులు తప్పు చేశారనడానికి ప్రాధమిక ఆధారముంటే వారిపై విచారించి చర్యలు తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా నిర్థాక్షిణ్యంగా, ఏకపక్షంగా తీసుకునే చర్యలు పూర్తిగా సహజ న్యాయానికి విరుద్ధం. అమానుష నిబంధనలను అమలు చేస్తే సహించేది లేదు” అని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.