Home తాజా వార్తలు కురవని మేఘం….ఆగమాగం

కురవని మేఘం….ఆగమాగం

rain

చినుకు రాలక మాడిపోయిన పంటలు, రాష్ట్రమంతటా కరువు ఛాయలు

జిల్లాల వారీగా వర్షపాతం (మి.మీ.లలో)

                   సాధారణం                   నమోదైన వర్షపాతం

వరంగల్        జూన్-137,జులై-194     401, 53
మెదక్          121.4, 218.9            129, 58.3
ఖమ్మం        127, 309                   440.5, 112
రంగారెడ్డి      జులై 183                     47.9
నల్లగొండ      జూన్ -170                  జూన్ – 58
మహబూబ్‌నగర్  604.6                   132
నిజామాబాద్ 17754.6                     8131.8
కరీంనగర్  346.9                           288.3

మన తెలంగాణ / న్యూస్ నెట్‌వర్క్

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం తో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. జులైలో దాదాపు అన్ని జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో కురిసిన వర్షాలకు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కాగా, భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నా యి. వివిధ జలాశయాలు, చెరువులు కుంటలు బోసి పోతున్నాయి. ఖరీఫ్‌పై గంపెడాశలు పెట్టుకున్న రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లుగా సాగర్ ఆయ కట్టుకు సాగునీటిని విడుదల చేయలేమని కృష్ణా బోర్డు చేతులు ఎత్తివేయడంతో అక్కడ 50 శాతానికి పైగా భూములు బీళ్లుగా మారే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో సాధారణం కన్నా 54.2 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 6 వరకు 17754.6 మి. మీ. సాధారణ వర్షపాతం రికార్డు కావాల్సి ఉండగా, 8131.8 మి.మీ. మాత్రమే నమోదైంది. 28 మండ లాల్లో 50 శాతానికిపైగా వర్షపాతం తగ్గగా, మిగి లిన 8 మండలాల్లో 25 శాతం తగ్గి కరువు పరిస్థితు లు కొనసాగుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల (మొదటిపేజీ తరువాయి)
హెక్టార్లలో పంటసాగుచేసే అవకాశం ఉందని మొదటగా అధికారులు భావించారు. కానీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2.79 లక్షల హెక్టార్లకు మాత్రమే పరిమితమయ్యారు. 60 పంటలు ఎండి పోయినట్లు అంచనా వేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా 17 శాతం తక్కువగా నమో దైంది. ఈ నెల 6వ వరకు 346.9 మి. మీ. వర్షపాతం కురియాల్సి ఉండగా, 288.3 మీ. మీ మాత్రమే పడింది. మొత్తం 57 మండలాలకు గానూ 24 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 27 మండలాల్లో తక్కువగానూ, నాలుగింటిలో ఎక్కువగానూ, మరో రెండింటిలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 5,14,662 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా, 3,30,965 హెక్టార్లలో మాత్రమే జరిగింది. గతేడాది ఇదే సమయానికి 4,86,264 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈసారి 1,55,289 హెక్టార్లలో సాగు తగ్గింది.
వరంగల్ జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 137 మి. మీ. కాగా, 401 మి. మీ వర్షపాతం నమోదైంది. జులైలో మాత్రం పరిస్థితి తారు మారైంది. సాధారణ వర్షపాతం 194 మి. మీ. కాగా, కేవలం 53 మి. మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాది జూన్‌లో 54 మి.మీ., జులైలో 100 మి. మీ. వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు వి స్తీర్ణం 5,05,290 హెక్టార్ల కాగా, 3,09,324 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. పంటలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. రైతులు డ్రమ్ములతో మొక్కలు నీళ్లు పోస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాలు పూర్తిగా బోసిపోతున్నాయి. సాగునీటి కాలువల్లో నీరు లేక వేసిన నారుమళ్ళు ఎండుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఇదే సమయానికి జలాశయాల్లోకి నీరుచేరి వరినాట్లు వేయగా, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద సుమారు 60వేల హెక్టార్లలో వరి పంట సాగుచేస్తున్నారు. వ్యవసాయ బావుల కింద మాత్రమే 490 హెక్టార్లలో వరి వేశారు.
రంగారెడ్డి జిల్లాలో జులై సాధారణ వర్షపాతం 183 మి. మీ కాగా, 47.9 మి. మీ మాత్రమే నమోదైంది. గతేడాది జులైలో 102.3 మి. మీ వర్షపాతం నమోదు కాగా, 2013లో 202.6, 2012లో 62.6, 2011లో 190.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గత పదేళ్ళతో పోల్చితే ఈసారి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగా పంటలు వేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 1,90,463 హెక్టార్లు కాగా, 1,19,463 హెక్టార్లలో పంటలు వేశారు.
మెదక్ జిల్లాలో జూన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురియగా, జులైలో తక్కువగా పడ్డాయి. జూన్ సాధారణ వర్షపాతం 121.4 మి. మీ. కాగా, ఈ ఏడాది 129 మి. మీ. వర్షపాతం నమోదైంది. గతేడాది 44.4 మి. మీ మాత్రమే కురిసింది. జులై సాధారణ వర్షపాతం 218.9 మి.మీ. కాగా, కేవలం 58.3 మి.మీ వర్షపాతం నమోదైంది. గతేడాది జులైలో 108 మి.మీ. వర్షం కురిసింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 86,286 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా, కేవలం 7,520 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. మరో 4,250 హెక్టార్లలో నారు మళ్లు ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 170 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా, కేవలం 58 మి. మీ మాత్రమే నమోదైంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5,25,435 హెక్టార్లు కాగా, గతనెల మాసాంతం వరకు 3,63,976 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగు కావడం గమనార్హం. గతేడాది ఇదే సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 4,83,500 హెక్టార్లు కాగా, అంతకు మించి 5,21,256 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇది ఇలా ఉండగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు ఈ ఖరీఫ్ సీజన్‌లో నీటిని విడుదల చేయలేమని కృష్ణాబోర్డు నిర్ణయం తీసుకోవడంతో దాని పరిధిలోని 3.76 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు అంధకారంగా మారింది. అయకట్టు కింద వరిపంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,87,963 హెక్టార్లు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 27,221 మెక్టార్లలోనే పంటల సాగుచేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే -78.1 శాతం తక్కువగా నమోదైంది. సాధారణ వర్షపాతం 604.6 మి.మీ. కాగా, 132 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాది 569.6 మీ.మీ వర్షపాతంగా నమోదైంది. జిల్లాలో 64 మండలాలకు గానూ 57 మండలాల్లో రికార్డు స్థాయిలో సాధారణం కంటే తక్కుగా వర్షపాతం నమోదైంది.
ఈ ఖరీఫ్‌లో సాధారణ పంట సాగు విస్తీర్ణం 7,59,617 హెక్టార్లు కాగా, 5,31,873 హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో జూన్ సాధారణ వర్షపాతం 127 మి.మీ. కాగా, 440.5 మి.మీ. కురిసింది. జులైలో 309 కాగా, 112 మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. గతేడాది జూన్‌లో 31.2, జులైలో 225 మి.మీ. వర్షపాతంగా ఉంది. ఈ ఏడాది 1,05,500 హెక్టార్లలో పంట సాగవుతోంది.