Home తాజా వార్తలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

Rain

జోగులాంబ గద్వాల్‌లో 100 మి.మీటర్ల వర్షపాతం
రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అత్యధికంగా జోగులాంబ గద్వాల్‌లో 100 మిల్లీమీటర్ల వర్షం కురవగా నారాయణపేటలో 83 మి.మీల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాత్రి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
నేడు రాత్రి అనేకచోట్ల వర్షాలు
రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తూర్పు పశ్చిమలో 15 డిగ్రీల ఎన్ వెంబడి 1.5 కి.మీల నుంచి 5.8 కి.మీల మధ్య ఈ ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి అనేకచోట్ల, శుక్రవారం చాలాచోట్ల, శనివారం కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల (ఉండవెల్లి) 100 మి.మీలు హైదరాబాద్ 50 మి.మీలు, నిర్మల్ (లక్ష్మన్‌చందా) 55, ఆదిలాబాద్ 45, సూర్యాపేట 32 మి.మీలు, ములుగు (వాజేడు) 45 మి.మీటర్లు, కుమరం భీం ఆసిఫాబాద్ (కేరమేరీ) 58.8, మంచిర్యాల 47, వనపర్తి (రేవెల్లి) 57.5 మి.మీటర్లు, నాగర్‌కర్నూల్ (కోడూర్) 71మి.మీ, ఖమ్మం (వైరా) 51 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం 45 మి.మీ, మహబూబాబాద్ (గన్నవరం), 45, పెద్దపల్లి 52, ఆదిలాబాద్ (తాళ్లమడుగు) 45.3, సంగారెడ్డి (కంగటి) 52.3 మి.మీలు, కామారెడ్డి (గాంధారి) 52.8 మి.మీలు, జగిత్యాల (రాయికల్) 32.5, మెదక్ (మెదక్) 32.5, యాదాద్రి భువనగిరి 38.3, వికారాబాద్ (ధారూర్) 43.3, వరంగల్ రూరల్ (శ్యాంపేట) 45 మి.మీలు, రంగారెడ్డి (శేరిలింగంపల్లి) 72.8, నిజామాబాద్ (నందిపేట) 55 మి.మీలు,

నల్లగొండ (నార్కట్‌పల్లి) 73.3, జయశంకర్ భూపాలపల్లి (మొగులపల్లి) 55.8, రాజన్న సిరిసిల్ల (ఎల్కంతకుంట) 45.3, మేడ్చల్ మల్కాజిగిరి (బాలానగర్) 35, నిజామాబాద్ (కమ్మరపల్లి) 45.8,సిద్ధిపేట (జగదేవ్‌పూర్) 39.3, కరీంనగర్ (మానకొండూర్) 49, మహబూబ్‌నగర్ 46, పెద్దపల్లి 56 మి.మీటర్లుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు గురువారం రాత్రి అనేక చోట్ల, శుక్రవారం చాలాచోట్ల, శనివారం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు గురువారం రాత్రి అనేక చోట్ల, శుక్రవారం చాలాచోట్ల, శనివారం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Rainfall across the State