Home తాజా వార్తలు రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు

Rains across telangana for next three days

 

జలదిగ్భందంలో నిర్మల్ పట్టణం, భైంసా
పలు జిల్లాలో పొంగిపోర్లుతున్న వాగులు, చెరువులు
హైదరాబాద్‌లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రంగంలోకి డిఆర్‌ఎఫ్ బృందాలు
కడ్తాల్ జాతీయ రహదారి 44పై భారీగా నిలిచిపోయిన వరదనీరు
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్
మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 273.3 మిల్లీమీటర్ల వర్షపాతం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. విరామం లేకుండా కురుస్తున్న వానలకు గ్రామాలు, పట్టణాలు జలమయమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ పట్టణంతో భైంసా ఇప్పటికే జలదిగ్భందంలో చిక్కుకోగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు అధికారులు అక్కడ పర్యటించి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపించింది. ఇక్కడ కురుస్తున్న వర్షాలకు కడ్తాల్ జాతీయ రహదారి 44 రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో హైదరాబాద్ టు నాగపూర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను, మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. రాబోయే మూడు రోజులపాటు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

అందుబాటులో కంట్రోల్‌రూం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మూడు రోజులుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా అధికారుల ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రధాన కూడళ్ల వద్ద డిఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. జిహెచ్‌ఎంసీ సిబ్బంది నాళాలపై ఉన్న చెత్తను తీసివేస్తున్నారు. భారీ వర్షపాతం నమోదైతే వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. భారీగా పోటెత్తుతున్న వరదతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

బలపడిన అల్పపీడనం
గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి సగటున 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌గర్, వికారాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురువనున్నట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా….
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 273.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో 200, నిర్మల్‌లో 172.8, నిజామాబాద్‌లో 157.8, వరంగల్ రూరల్‌లో 137, మేడ్చల్ మల్కాజిగిరిలో 40, రంగారెడ్డిలో 38, హైదరాబాద్‌లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాష్ట్రంలోని 20కి పైగా ప్రాంతాల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు వర్షాల ముప్పు
దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండి గురువారం పేర్కొంది. తెలంగాణతో పాటు దక్షిణ చత్తీస్‌ఘడ్, విదర్భ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది మరో రెండు మూడు రోజుల్లో వాయవ్య దిశగా వెళ్తుందని వాతావరణశాఖ పేర్కొంది. గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు ఏకధాటిగా వర్షాలు కురవనున్నాయని, పశ్చిమ తీరం మొత్తం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐంఎడీ తన ట్విట్టర్‌లో పేర్కొంది. కొంకన్‌తో పాటు గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లోనూ నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rains across telangana for next three days