Home మెదక్ ఆరంభమైన బీమా నమోదు ప్రక్రియ

ఆరంభమైన బీమా నమోదు ప్రక్రియ

Raith Bheema insurance registration process

రైతుబంధు పథకం విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ సర్కారు మరో పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తోంది. రైతుబంధు పథకంలో ప్రతి సంవత్సరం రూ.8 వేలు పంట పెట్టుబడి కింద చెల్లిస్తుండగా, ఇప్పుడు రైతులకు జీవిత బీమా చేసేందుకు ముందుకు వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సౌజన్యంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఒక్కో రైతుకు రూ.5లక్షల వరకు ఉచిత జీవిత బీమా వర్తింపజేయనున్నారు. ఇందుకవసరమైన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనుంది. జిల్లాలో దాదాపు లక్షా 80 వేలమంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. శుక్రవారం నుంచి రైతుల నమోదు ప్రక్రియ మెదక్ జిల్లాలో ఆరంభమైంది. ఈ నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం..
మన తెలంగాణ/పెద్దశంకరంపేట : అన్నదాతల సంక్షేమానికి మరో నూతన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆరంభించింది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోన్న ప్రభుత్వం అన్నదాతల ముంగిట మరో కొత్త పథకానికి తెరతీసింది. రైతులకు రైతుబంధు పథకంలో ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సాయాన్ని అందించిన సర్కారు తాజాగా అన్నదాతలకు బీమా చేయిస్తున్నట్లు పేర్కొన్న సంగతి విదితమే. బీమా పరిధిలోకి వచ్చే రైతులు అనుకోని పరిస్థితులలో మరణిస్తే వారి కుటుంబం రోడ్డుపాలు కాకుండా ఉండేందుకు రూ.5లక్షల పరిహారం అందించేలా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంది ఈ పథకం ప్రారంభించనున్నారు. అందులో భాగంగా రైతుల నమోదు ప్రక్రియను శుక్రవారం నుంచి మెదక్ జిల్లాలో ఆరంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా వ్యవసాయ క్లస్టర్ పరిధిలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2.18 లక్షల ఖాతాలు (రైతులు) ఉన్నట్లు భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం అధికారులు తేల్చారు. ఇందులో 1.87 లక్షల మందికి సంబంధించిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జిల్లాకు చేరాయి. వాటిలో ఇప్పటి వరకు దాదాపు 1.66 లక్షల పాసుపుస్తకాలను సంబంధిత రైతులకు పంపిణీ చేశారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. వీటి ఆధారంగానే బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే 60ఏళ్లు దాటితే బీమా వర్తించదనే నిబంధనతో వేలాది మంది రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. ఈ విషయమై సడలింపు ఇవ్వాలనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
సహాజ మరణానికీ బీమా : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రైతు సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి విత్తనాలు, ఎరువుల కోసం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్నారు. దీంతో అన్నదాతకు పెట్టుబడి వ్యయం బాధలు తప్పుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత చెక్కుల పంపిణీ గత వారంతో పూర్తయ్యింది. చాలా మంది చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్లి నగదుగా మార్చుకున్నారు. దాంతో పాటే ప్రాజెక్టులు, చెరువుల కింద సాగయ్యే నీటి తీరువా బకాయిలను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులోనూ నిర్వహణ బాధ్యత సర్కారుదేనని సిఎం కెసిఆర్ గత నెలలో మెదక్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు రూ.18 కోట్ల రూపాయల బకాయిలు మాఫీ అయ్యాయి. తాజాగా రైతు బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టడంతో ఆన్నదాతలకు మరింత అసరా ఇచ్చినట్లయ్యింది. మాములుగా ప్రమాదాలకు గురైనపుడే బీమా కంపెనీలు బీమా డబ్బులు చెల్లిస్తుంటాయి.

కానీ ఈ పథకంలో ప్రమాదాలకు గురైనపుడు కాకుండా మాములుగా సహజమరణం పొందినా పథకం వర్తించేలా రూపకల్పన చేశారు. ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఇంటి యజమాని అయిన రైతు విధి వశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులు అందనున్నాయి. ఈ మేరకు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారందరికీ ఆగస్టు 15 నుంచి బీమా పత్రాలు అందజేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి మండల వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు గ్రామాలలో పర్యటించి ఎల్‌ఐసి జారీ చేసిన బీమా పత్రాలను పూరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నామిని పేరును పేర్కొంటున్నారు. కౌలు రైతు పేరిట ఎలాంటి భూ యాజమాన్య పత్రాలు ఉండవు గనుక బీమా రాదన్నది బీమా కంపెనీల వాదన. ఇప్పటికే పంట రుణాలు ఇవ్వడంలోనూ ఇటీవల ప్రారంభించిన రైతుబంధు పథకంలోనూ కౌలు రైతులకు ఎటువంటి ఆర్థిక మేలు చేకూరలేదు. జిల్లాలో సుమారు 50 వేల మంది వరకు కౌలు రైతులున్నారు. కానీ అధికారులు కేవలం 5 వేల లోపు మాత్రమే రుణ అర్హత కార్డులు జారీ చేశారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సాగు చేస్తున్న తమకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోవడంతో వారు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సర్కారు తమను కూడా కనికరిస్తుందనే ఆశలో వాళ్ళున్నారు.