Home వార్తలు నాటికీ, నేటికీ మేటిసినిమా హరిశ్చంద్ర

నాటికీ, నేటికీ మేటిసినిమా హరిశ్చంద్ర

Satya-harichandraభారతదేశంలో నిర్మించిన తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’. మూకీ సినిమా ఇది. దాదాసాహెబ్ ఫాల్కే అష్టకష్టాలు పడి అన్నీతానై భార్య సరస్వతి అండదండలతో ఈ సినిమాను రూపొందించారు. కథ, కథనం, కాస్టూమ్స్, దర్శకత్వం, ఎడిటింగ్… ఇలా అన్ని శాఖలను తానే నిర్వహించారు. కారణం అప్పటికి ఆయన ఒక్కడే విదేశాల్లో చిత్ర నిర్మాణంలో తర్ఫీదు పొంది ఉండడం. అప్పట్లో స్త్రీలు నటించడానికి ఆసక్తి చూపనందున తన దగ్గర వంటవాడిగా ఉన్న సలుంకే తో చంద్రముఖి, డి.డి.దాబ్కేతో హరిశ్చంద్ర, బాలచంద్రతో లోహితాస్యుడు పాత్రలను చేయించి 1913 ఏప్రిల్ 21న బొంబాయిలోని ఒలింపియా థియేటర్‌లో ప్రివ్యూగా ప్రదర్శింపచేసి సినిమా అనే అద్భుతానికి మన దేశంలో తెరతీశారు. 1913 మే 3న దక్షిణ బొంబాయి గిర్‌గావ్ ప్రాంతంలోని కారొనేషన్ థియేటర్‌లో ఈ సినిమా విడుదల చేసినప్పుడు జనం తాకిడిని తట్టుకోవడానికి పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. 44 మూకీ చిత్రాలను 1913 నుండి 1931 వరకు, ‘గంగాతరణ్’ అనే టాకీ చిత్రాన్ని 1937లో తీసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ పిల్మ్ ఇండస్ట్రీ అనే కీర్తిని ఆయన ఆర్జించారు. దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు దూందిరాజ్ గోవింద్ ఫాల్కే. తొలి దశలో మూకీ చిత్రాలైనా, టాకీ చిత్రాలైనా పౌరాణిక కథలు, పౌరాణిక నాటకాల ఆధారంగానే తీశారు. క్రమంగా జానపద, చారిత్రక, సాంఘిక కథలతో చిత్రాలను రూపొందించసాగారు.
సత్యహరిశ్చంద్ర నాలుగు మూకీ చిత్రాలుగా, మనదేశంలోని వివిధ భాషల్లో 20సార్లు టాకీ చిత్రంగా నిర్మితమైంది. ఒక్క తెలుగులోనే తొలిసారి ‘హరిశ్చంద్ర’ పేరుతో 1935 నవంబర్ 16న, రెండోసారి 1956 మే 31న, ‘సత్య హరిశ్చంద్ర’ టైటిల్‌తో 1965 ఏప్రిల్ 22న, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ పేరుతో 1991 ఏప్రిల్ 19న నాలుగుసార్లు నిర్మితమైంది. పలు అవార్డులు పొందిన దర్శకనిర్మాత యు.విశ్వేశ్వరరావు కూడా ‘హరిశ్చంద్రుడు’ టైటిల్‌తో ఒక సినిమా తీశారు కానీ దీని కథ వేరు. అయితే మొదటి రెండు చిత్రాలే తెలుగులో ఘన విజయం సాధించాయి. అందుకు కారణం హరిశ్చంద్ర నాటకంతో మమేకమైన ప్రేక్షకులను అలరించిన అందులోని పద్యాలు, సంభాషణలే.
హరిశ్చంద్ర నాటకాలన్ని చాలామంది రాశారు. అయితే బహుళ ప్రదర్శన పొందినది, వేలాది మంది ప్రేక్షకులను మెప్పించింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన ‘సత్యహరిశ్చంద్రీయం’ నాటకమే. ఈ నాటకంలోని పద్యాలు, సంభాషణలు చాలా మందికి కంఠతా వచ్చేవి. మొదటి రెండు సినిమాల విజయానికి బలిజేపల్లి రాసిన పద్యాలు, సంభాషణలే కీలకమయ్యాయి. కందుకూరి వీరేశలింగం మొట్టమొదటిసారి తెలుగులో ‘సత్యహరిశ్చంద్ర’ పేరుతో 1889లో రచించారు. నాదెళ్ల పురుషోత్తమ కవి 1890లో ‘హరిశ్చంద్ర’, కస్తూరి నరసింహం 1905లో ‘నవ హరిశ్చంద్ర’, కందాళై శ్రీనివాస్, పోకల వెంకట నరసింహారావు కలిసి 1907లో ‘హరిశ్చంద్ర’, కలా చలం శ్రీనివాసరావు 1908లో ‘సత్య హరిశ్చంద్రీయము’, శెట్టి లక్ష్మీ నరసింహం ‘శ్రీ చిత్రం హరిశ్చంద్రీయము’, ఎస్.భవానందం పిళ్లే ‘హరిశ్చంద్ర’ నాటకాన్ని 1913 వెలువరించారు. కోలాచలం శ్రీనివాసరావు కూడా ఈ నాటకాన్ని రచించారు.
సత్యం, ధర్మం కోసం రాజ్యాన్ని వదులుకొని, విశ్వామిత్రునికిచ్చిన మాట ప్రకారం భార్య చంద్రమతిని అమ్మి, ఆ ధనం చెల్లించి, తనని తాను అమ్ముకొని విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రకుడికి భత్యం చెల్లించి, కొడుకు లోహతాస్యుని అంత్యక్రియలకు అనుమతిం చనని కాటి సుంకమిస్తేగానీ, యజమాని ఉత్తర్వులకు భార్యని కూడా నరకడానికి సిద్ధపడిన హరిశ్చంద్రుని కథలోని ఉదాత్తత, సౌశీల్యం, బాధ్యత ఇన్ని నాటకాలను, ఇన్ని సినిమాలను తీసేలా చేసింది.

ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’…
ఫాల్కే తీసింది మూకీ చిత్రం, తొలి భారతీయ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’. దీనికి భాషతో నిమిత్తం లేదు కదా. సంస్కృత పండితుల ఇంట త్రయంబకేశ్వరంలో జన్మించి సంస్కృతం అభ్యసించి బరోడాలో వివిధ కళలు నేర్చుకుని, ఫొటో స్టూడియో, ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పిన ఫాల్కేకి లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా భారతదేశంలో సినిమా రూపొందించాలనే ఆలోచన పుట్టేలా చేసింది. లండన్‌వెళ్లి వాల్టన్ స్టూడియోలో చిత్ర నిర్మాణంలో శిక్షణ పొంది, విలియమ్సన్ కెమెరా, ఇతర పరికరాలు కొనేలా చేసింది. తిరిగి వచ్చి బీమా పట్టాపై రుణం తీసుకొని చిత్ర నిర్మాణం ప్రారంభించారు. పగలు షూటింగ్, రాత్రిళ్లు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసేవారు. ప్రొజెక్టర్‌లో పెట్టే ఫిల్మ్‌కి అప్పట్లో హోల్స్‌లేని ఫిలిం వచ్చినందున తనే కష్టపడి ప్రతి ఫ్రేమ్‌కి దీర్ఘచతురస్రంగా చిన్న చిన్న హోల్స్ ఏర్పరుస్తూ, భార్య సరస్వతికి కూడా ఆ పనిలో శిక్షణ ఇచ్చారు. అలా అనేక ఒడిదుడుకులకు ఓర్చి సినిమాను మనకు చేరువయ్యేలా చేశారు. తొలి చిత్రమే కాదు ఆయన తీసిన అనేక చిత్రాలు ప్రేక్షక ఆదరణపొందాయి. విడుదలై 102 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

అద్దంకి ‘హరిశ్చంద్ర’…
నాటకాలలో హరిశ్చంద్రునిగా నటించకుండా తొలిసారి సినిమాలలో హరిశ్చంద్రగా టైటిల్ పాత్ర పోషించి చక్కని అభినయంతో, పద్యాల ఆలాపనతో, నవరస భావాలతో ఉచ్ఛారణ ద్వారా అద్దంకి శ్రీరామమూర్తి ఆకట్టుకున్నారు. స్టార్ కంబైన్స్ పతాకాన టిఎస్ రామన్ దర్శకత్వంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచనతో ఈ చిత్రాన్ని రూపొందించారు. పి.పుల్లయ్య ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్స్, పద్యాలు ఓకె చేయడం వంటి అంశాలు కూడా చేపట్టారు. మూడు నెలల పైబడి షూటింగ్ జరుపుకొని మాటలు, పద్యాలు చక్కగా వినబడే పద్దతిలో 1935 నవంబర్ 16న విడదలై ఘన విజయం సాధించింది. పసుపులేటి కన్నాంబ చంద్రమతిగా, బందరు నాయుడు విశ్వామిత్రుడిగా, పులిపాటి వెంకటేశ్వర్లు నక్షత్రకుడిగా, కుటుంబ శాస్త్రి కాలకౌశికుడిగా, కాశీ చెంచు వీరబాహుడిగా, మాస్టర్ భీమారావు లోహితాస్యుడిగా నటించారు. అడవికి సంబంధించిన సన్నివేశాలు కారడవిలోనే చిత్రీకరించినట్టు విడుదలకు ముందు ప్రకటనలో పేర్కొన్నారు. అంటే అప్పటికే ఔట్‌డోర్‌లో కష్టించి, చిత్రీకరించడం పట్ల ఆసక్తి చూపారన్నమాట. గోవందరావు తాంబే సంగీతం అందిచారు.
‘మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలిని నా కుమారుడిని ప్రాణంబుండు వందాక నెంలో యల్లాడిన ఈ శరీరమిపుడిందున్ గట్టెలన్‌గాలుచో
నా ఇల్లాలును రాదు, పుత్రుడును దోడై రాడు తప్పంపగన్’
వంటి పద్యాలు హరిశ్చంద్రుడు,
‘ఆటకు బోదమా సభలాలా
వాటముగా జేరి చెంద్లాడుదమా
గానమే మీరగ సభలాలా
వాటముగ జేరి చెండ్లాడుదమా’ వంటివి లోహితాస్యుడు
‘దండాలండి బాబు దండాలు, దండాలండి మీకు
దండాలు పెట్టేటి దాసుణ్ణి చూచి
దారి యియ్యర దొరబాబులాలా
కల్లు పుచ్చుకొని బాబయ్య కాటికెల్లతుండ
కంపు కంపని మీరు కరవ వత్తారేమొ
సొంపుగాను నేను సోలిపోత ఉండ’ వంటి పద్యాలు వీరబాహుడు
‘కరుణాకర కరుణింపవా
కాంచనాంబరా కాచి బ్రోవవా
మ్రొక్కు దాననేనో దేవదేవా
దిక్కు నీవేగా దీనరక్షకా
ఘోర దుఃఖములు కోరి చేరువయ్యే
వారిజేక్షణా వారింపవా వంటి పద్యాలు చంద్రమతి ఆలపించగా ఆరోజుల్లో ప్రేక్షకులను అవి మెప్పించాయి. ఈ చిత్రం విడుదలై ఈ నవంబరుతో 80 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’…
జంపన చంద్రశేఖరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ పతాకాన లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండవ చిత్రం ‘హరిశ్చంద్ర’. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన హరిశ్చంద్ర నాటకంలోని 14 పద్యాలతో పాటు గుర్రం జాషువా రాసిన పద్యాల్ని ఈ సినిమాలో ఉపయోగించారు. ఇవికాకుండా జంపనర, కొసరాజు రాసిన పాటలు ఉన్నాయి. ఎస్.వి.రంగారావు హరిశ్చంద్రుడు, గుమ్మడి విశ్వామిత్రుడు, లక్ష్మీరాజ్యం చంద్రమతి, మాస్టర్ గిరి లోహితాస్యుడు పాత్రలు పోషించారు. కాలకౌశికుడిగా గౌరీపతిశాస్త్రి, వివి సుబ్బారావు వీరబాహుడుగా, రేలంగి నక్షత్రకుడిగా, రాజుసులోచన, కుచల కుమారి మాతంగ కన్యలుగా నటించారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈ అందరికీ పేరుతెచ్చింది. చెప్పింది చేయబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా… హే చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయా, చిందేసే వీరాబాహు నేనేనయ్యా…, ఇది సమయురా శుభ సమయమురా, ఏమమంటావ్ ఏమంటావ్. ఔనంటావా కాదంటావా… పాటలను కొసరాజు, హే భవానీ కాత్యాయనీ జగజ్జననీ… ఓ రస పిపాసా వంటివి జంపన మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహమ్మున ఇచ్చట… వంటి పద్యాలను గుర్రం జాషువా రాయగా సుసర్ల దక్షిణామూర్తి అద్భుత సంగీతమందించారు ఈ చిత్రానికి. నిజానికి ఎన్.టి.రామారావుతో హరిశ్చంద్రుడు పాత్ర వేయించాలని లక్ష్మీరాజ్యం యత్నిస్తే ఎన్.టి.ఆర్ కాల్‌షీట్లు లభ్యం కాలేదు. సి.హెచ్.నారాయణరావుతో నటింపచేయాలని తలచి, ఆయనను సంప్రదించి అప్పటికే ఆయనకు హీరోగా డిమాండ్ తగ్గిందని తక్కువ పారితోషికం ఇస్తామనడంతో రీజనబుల్‌గా ఇస్తే చేస్తానని తనకున్న పేరుని, గత అనుభవాన్ని వినియోగించుకోవడానికి తక్కువ ఇస్తే అంగీకరించేది లేదని అన్నారట. దాంతో ఎస్.వి.ఆర్.ని హరిశ్చంద్రునిగా ఎంపికచేశారు. 1956 మే 31న విడుదలై ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సికింద్రాబాద్ ప్యారటైజ్ థియేటర్‌లో ఈ చిత్రం 50 రోజుల వేడుక నిర్వహించడాన్ని ఆ రోజుల్లో విశేషంగా చెప్పేవారు.

కె.వి.రెడ్డి ‘సత్యహరిశ్చంద్ర’…
విజయా ప్రొడక్షన్స్ పతాకాన కె.వి.రెడ్డి దర్శకనిర్మాతగా పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘సత్య హరిశ్చంద్ర’ రూపొందింది. ఎన్.టి.రామారావు హరిశ్చంద్రునిగా, ఎస్.వరలక్ష్మి చంద్రమతిగా, ముక్కామల విశ్వామిత్రునిగా, రమణారెడ్డి నక్షత్రకుడిగా, మాస్టర్‌బాబు లోహితాస్యుడిగా, రేలంగి కాలకౌశికుడిగా, రాజనాల వీర బాహుడిగా, రాజశ్రీ, మీనాకుమారి మాతంగ కన్యలుగా, ఎల్.విజయలక్ష్మి మేనకగా, వాణిశ్రీ నర్తకిగా నటించారు. కథ,మాటలు, పాటలు పింగళి, ఛాయాగ్రహణం కమల్‌ఘోష్ నిర్వహించారు.
1.నమో భూతనాథా నమో దేవదేవ
నమో భక్తపాల నమో దివ్య తేజ…
2.కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా
మట్టిలో కలిసేటి మడిసి మడిసికీ బేధం ఏముందిరా…
3.ఆడ నీవూ యీడ నేనూ
సూసుకుంటూ కూసుంటే
ఎన్నాళ్లు తాళగలను చందమామా…
4.విధి విపరీతం విధి విడ్డూరం
విధి విలాసమూ ఇంతేకదా…
5.తద్దినంపు భోజనం
తలుచుకుంటే చాలురా
నోరూరు చుండెరా
ఒళ్లు పులకరించురా… వంటి పాటలకు మంచి ఆదరణ లభించినా, ఎన్‌టిఆర్‌కు అప్పటికే హీరోగా మంచి పేరు వచ్చినా 1965 ఏప్రిల్ 22న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించలేదు.

ఎన్‌టిఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’…
తెలుగుదేశం పార్టీని నెలకొల్పి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. పాటలు సి.నారాయణరెడ్డి, సంగీతం రవీంద్రజైన్ సమకూర్చగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవంలో విపి సింగ్ వంటి ప్రముఖ నాయకులు అందరూ పాల్గొన్నారు. విశ్వామిత్రుడు, రావణాసురుడుగా ఎన్.టి.ఆర్, హరిశ్చంద్రుడు, దుష్యంతుడుగా బాలకృష్ణ, వశిష్టుడుగా గుమ్మడి, అమ్జాద్‌ఖాన్ వీరబాహుడులగా, మీనాక్షి శేషాద్రి మేనకగా, చంద్రమతిగా దీపిక నటించారు. పౌరాణిక చిత్రాల రూపకల్పనలో, ఆ పాత్రలకు పోషణలో మంచి పేరు ఎన్.టి.ఆర్. గడించినప్పటికీ 1991 ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించలేదు.

ఇతర భాషల్లో….
ఇతర భాషల విషయానికొస్తే తమిళం, కన్నడ, గుజరాతీ, ఒరియా, హిందీ, మలయాళ, నేపాలీ భాషల్లో కూడా ‘సత్య హరిశ్చంద్ర’ని నిర్మించి ప్రేక్షకుల మన్ననలను పొందడం విశేషం. నేపాలీ భాషలో తొలిసారి తీసిన సత్యహరిశ్చంద్రకి నిర్మాత, దర్శకుడు, రచయిత డి.బి.పరియార్. కలకత్తాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం 1951 సెప్టెంబర్ 14న నేపాల్‌లో విడుదలై విజయం సాధించింది. కన్నడంలో సత్యహరిశ్చంద్రను తొలిసారి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీబాయి, ఆర్.నాగేంద్రరావు ప్రభృతులతో ఆర్.నాగేంద్రరావు, కృష్ణస్వామిల దర్శకత్వంలో నిర్మించి 1943లో విడుదల చేస్తే విజయఢంకా మోగించింది. తమిళంలోకి డబ్ చేసి విడుదల చేస్తే తమిళనాట కూడా బాగా ఆడింది.
రాజ్‌కుమార్, పండరీబాయి, ఉదయకుమార్‌లతో దర్శకనిర్మాత కె.వి.రెడ్డి విజయా పతాకం కింద కన్నడంలో రూపొందించగా సూపర్‌హిట్ కావడమే కాకుండా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డుని గెలుచుకుంది. ఇదే చిత్రాన్ని 2008లో కలర్ చిత్రంగా మార్చి విడుదల చేస్తే మరోసారి విజయపతాకం ఎగరవేసింది. తమిళంలో డబ్ అయిన సత్యహరిశ్చంద్ర విజయం చూసి మరోసారి డైరెక్ట్‌గా నిర్మించి 1944లో విడుదల చేశారు. మలయాళంలో ఆంటోని మిత్రదాస్ దర్శకత్వంలో రూపొంది1955లో విడుదలై విజయం సాధించింది.
-వి.ఎస్.కేశవరావ్