Friday, March 29, 2024

సచిన్ సంక్షోభం

- Advertisement -
- Advertisement -
8 నుంచి 20 మంది ఎంఎల్‌ఎలతో కొత్త కుంపటి
ఎస్‌ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్ అంతర్గతమని వాదన

జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున ఉంది. మధ్యప్రదేశ్‌లో మూడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు మరువకముందే ఇప్పుడు రాజస్థాన్‌లో ఆయన బాటలో మరో యువ నేత సచిన్ పైలట్ సాగుతున్నట్లు కనిపిస్తోంది. అంతకుముందు రాజస్థాన్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు సిఎం గెహ్లాట్, డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ సహా పలువురు కీలక నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరినీ పోలీసులు విచారించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ తనను ప్రశ్నించడంపై సచిన్ పైలట్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిత్వ శాఖ గెహ్లోత్ పర్యవేక్షిస్తున్నారని, ఆయన ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతున్నదని పైలట్ వర్గం ఆరోపిస్తోంది. ఆయనను ప్రశ్నించారని చెప్పుకోవడం బోగస్‌గా అభివర్ణిస్తున్నారు. పార్టీ రాష్ట్ర చీఫ్, ఉప ముఖ్యమంత్రిని విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం ఏమిటని పైలట్ వర్గీయులు మండిపడుతున్నారు.

మరోవైపు సచిన్ పైలట్‌కు నచ్చచెప్పేందుకు పార్టీ అధిష్టానం చివరినిమిషం వరకూ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా సచిన్ పైలట్ ప్రస్తుతం తనకు మద్దతిచ్చే 18 నుంచి 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ దగ్గర్లోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారని, ఈ వ్యవహారంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్‌తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలను బిజెపి తోసిపుచ్చింది. కాంగ్రెస్‌లో విభేదాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించింది. తాము గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని బిజెపి సవాల్ విసిరింది. 2018లో జరిగిన రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రి పదవికి సచిన్ పైలట్ పోటీపడగా పార్టీ అధిష్టానం సీనియర్ నేత అశోక్ గెహ్లోత్‌వైపు మొగ్గుచూపింది. సచిన్ పైలట్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. మరోవైపు సచిన్ పైలట్ బిజెపికి మద్దతిస్తారా.. లేదా తన మద్దతు దారులతో కలిసి కొత్తగా ప్రాంతీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ సిఎల్‌పి భేటీ ఏర్పాటు చేశారు. సోమవారంనాడు ఉదయం ఆయన నివాసంలో 10.30గ.లకు సమావేశానికి ఎంఎల్‌ఎలు అంతా రావాలని ఆహ్వానించారు. ఈ భేటీకి ఎవరు హాజరవుతారన్నదిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గెహ్లాట్ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేస్తుంది: కాంగ్రెస్

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేస్తుందని, ఎంఎల్‌ఎలు అందరూ తనతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ఇంచార్జి అవినాష్ పాండే ప్రకటించారు. ప్రతి ఒక్కరు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసుల విచారణకు సహకరించాలని ఆయన సూచించారు. రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికప్పుడు సమాచారం ఉందన్నారు. సచిన్ పైలట్‌తో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు పాండే వివరించారు. రాజస్థాన్‌లో అస్థితరతను సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, అయితే అందులో విజయవంతం కాదని అన్నారు.

Rajasthan Congress Govt in Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News