Friday, April 19, 2024

సంపాదకీయం: రజనీకాంత్ పార్టీ

- Advertisement -
- Advertisement -

Question is when will corona vaccine come

ఇదిగో అదిగో అంటూ తన రాజకీయ ఆరంగేట్రం గురించి చిరకాలంగా ఊరిస్తూ ఆశపెడుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు ఆ ముహూర్తాన్నిప్రకటించారు. వచ్చే నెల (2021 జనవరి) లో పార్టీని ప్రారంభించనున్నట్టు దాని వివరాలు ఈ నెలాఖరు రోజు (డిసెంబర్ 31)న వెల్లడించనున్నట్టు గురువారం నాడు ఆయన చేసిన ట్విట్టర్ ప్రకటనకు ప్రత్యేక ప్రాధాన్యమున్నది. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు 5 మాసాల సమీపంలోనే ఉన్నాయి. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో జరుగనున్నాయి. ఎన్నికలలో విజయాన్ని సాధించి తీరాలన్న లక్షంతోనే రజనీకాంత్ వస్తున్నాడనేది కాదనలేని, తిరుగులేని వాస్తవం. రాజకీయాల్లో అడుగుపెట్టే విషయంలో ఆయన మాటల వాడేకాని చేతలవాడు కాదని అందరూ ఒక స్థిరాభిప్రాయానికి వచ్చిన సమయంలో రజనీకాంత్ పార్టీ ప్రకటన తమిళనాడు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించక మానదు. ఆయన రాక ఎవరికి ప్రమాదాన్ని మరెవరికి ప్రమోదాన్ని కలిగిస్తుంది అనేది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న.

అన్ని రంగాల్లోనూ పెను మార్పు తీసుకు రావడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అది ఇప్పుడు జరుగకపోతే ఇంకెప్పుడూ జరగదని రజనీకాంత్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో అత్యధిక మద్దతు చూరగొని ప్రజలకు నిజాయితీతో కూడిన, పారదర్శక, అవినీతి రహిత, లౌకిక, ఆధ్యాత్మిక రాజకీయాలను అందిస్తానని ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాన్ని శ్రద్ధగా గమనించాలి. అద్భుతాలు జరిపిస్తా చూసుకోండి అని కూడా రజనీకాంత్ ప్రకటించారు. ప్రత్యర్థులకు ఆయన విసిరిన సవాలుగా కూడా దీనిని పరిగణించవలసి ఉంటుంది. 2021 ఎన్నికల్లో పోటీ చేస్తానని 2017 డిసెంబర్ 31న చేసిన ఒక ప్రకటనలో రజనీకాంత్ తెలియజేశారు. ఇప్పుడు ఆయన వయసు 70. తమిళంతో మొదలుకొని ఇతర దక్షిణాది భాషలు, హిందీ చలనచిత్ర రంగానికి ఆయన సుపరిచితుడైన సూపర్ స్టార్. వయసుతో నిమిత్తం లేకుండా అధునాతన నాయక పాత్రల్లో విలక్షణమైన శైలి, నటనతో యువతను ఉర్రూతలూగించిన తెర హీరో రజనీ. కబాలీ వంటి దళిత పక్షపాత చిత్రాలను, రోబో వంటి అధునాతన సాంకేతికత సైన్సు ఆధారిత సినిమాలను ఆయన రక్తికట్టించిన తీరు అమోఘం అనిపించుకున్నది. రజనీకాంత్ నటించిన ప్రతి చిత్రమూ

బాక్సాఫీసును బెంబేలెత్తించిందనడం అతిశయోక్తి కాదు. తమిళనాడును చిరకాలంగా శాసిస్తున్న ద్రవిడ రాజకీయాలకు సారథ్యం వహించిన అన్నాదురై, ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత తమిళ నాటక, సినిమా రంగాల నుంచి వచ్చిన వారే. వారి మాదిరిగానే తెలుగు చలన చిత్ర రంగ ఉద్దండుడు ఎన్‌టి రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పెను మలుపు తిప్పి శాసించిన సంగతి తెలిసిందే. అన్నాదురై, ఎంజిఆర్, కరుణానిధి తమిళనాడులో పెరియార్ రామస్వామి స్వహస్తాలతో నాటి పెంచిన బ్రాహ్మణీయ వ్యతిరేక ద్రవిడ రాజకీయాలను పెంపొందిస్తూ అక్కడి ప్రజల హృదయాలను చూరగొన్నారు. ఆ కారణంగా తమిళనాడు కాంగ్రెస్, హిందీ వ్యతిరేక రాజకీయాల కంచు కోట అయింది. హిందూ మతతత్వ శక్తుల ధోరణులకు వ్యతిరేకమైన, దృఢమైన నిరంతరాయమైన ప్రవాహంగా ఇప్పటికీ వర్ధిల్లుతూ వస్తున్నది. ఆ రాజకీయాలకు ఇప్పుడు డిఎంకె, దాని అనుబంధ శక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందులోని ఒక పాయ మాత్రమే అయిన తమిళనాడు ప్రస్తుత పాలక పార్టీ అఖిల భారత అన్నాడిఎంకె (ఎఐఎడిఎంకె) భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తును కొనసాగిస్తామని ఆ రెండు పార్టీలు ఇటీవలనే ప్రకటించాయి. తమిళనాడుకే చెందిన మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా మక్కల్ నీధి మైయం అనే పార్టీని పెట్టి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 8 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగారు. రజనీకాంత్ పార్టీ డిఎంకె వ్యతిరేక ఓట్లను, తటస్థులను ఆకట్టుకోగలదనే అంచనాలు వెలువడుతున్నాయి. అది పాలక ఎఐఎడిఎంకెని దెబ్బ తీస్తుంది. అయితే రజనీకాంత్ బిజెపితో అవగాహన కుదుర్చుకున్నారనే ప్రచారమున్నది. సూపర్ స్టార్ చెప్పిన సెక్యులర్, మత రాజకీయాలకు పొత్తు కుదరదు. ఆయన ఈ రెండింటినీ ఏ విధంగా సమన్వయపరుస్తారో, అంతిమంగా తన సమ్మోహన శక్తితో తమిళనాడులో ద్రావిడ, నిరీశ్వరవాద రాజకీయాలకు చరమగీతి పాడి బిజెపికే ఉపయోగపడతారో వేచి చూడాలి. దైవ భావనను కలలో కూడా అంగీకరించని డిఎంకె అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి ఇటీవల ఒక మఠాన్ని సందర్శించి తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడని వచ్చిన వార్తలు తమిళనాడులో కూడా గాలి మతశక్తుల వైపు మారుతున్నదా, బిజెపి ప్రాబల్యంలోని దేశంలో పూర్వపు ద్రావిడ రాజకీయాలను కొనసాగించి నెగ్గుకు రావడం కష్టమని డిఎంకె భావిస్తున్నదా అనే ప్రశ్నకు తావు కలిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News