Friday, March 29, 2024

వచ్చేశా.. మార్పు తీసుకొస్తా

- Advertisement -
- Advertisement -

వస్తున్నా.. మార్పు తథ్యం
డిసెంబర్ 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో ప్రారంభం


ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం
కులం, మతం, అవినీతి రహిత రాజకీయాలే లక్షం
తమిళుల తలరాతలు మార్చే సమయం వచ్చింది,
ఇప్పుడు జరగకపోతే మరెప్పుడు జరగదు
ప్రజలు, అభిమానుల మద్దతుతో తమిళనాట గెలుపు పక్కా
తమిళ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల సంబరాలు

చెన్నై: తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ తన కోటానుకోట్ల అభిమానులకు నూతన ఏడాదికి తీపి కబురు అందించారు. రాజకీయ అరంగేట్రంపై కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరదించారు. 2021 జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల నుచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 31న పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలు వెల్లడిస్తానని గురువారంనాడు టిట్టర్‌లో తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలు కూడా పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రజినీ ఈ సందర్భంగా ప్రకటించారు. అవినీతి రహిత రాజకీయాలు చేయడమే తన ఉద్దేశమని, ప్రజల మద్దతుతో తన పార్టీ కచ్చితంగా గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. పొలిటికల్ ఎంట్రీపై సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేసిన తర్వాత ఇక్కడి పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. ‘తమిళనాడులో అద్భుతం జరగబోతోంది. తమిళుల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు జరగకపోతే మరెప్పుడూ జరగదు. రాజకీయ మార్పు తథ్యం, ఈ సమయంలో అది తప్పనిసరి. ఇచ్చిన హామీల్లో ఒక్కదాని నుంచి కూడా వెనక్కి వెళ్లను. ప్రతిదీ నేరవేర్చుతాం, మార్చుతాం.’ అని తనదైన శైలిలో తలైవా వ్యాఖ్యానించారు.

ఆరోగ్యం రీత్యా వైద్యుల వద్దంటున్నా ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజకీయ ఇన్నింగ్స్‌లో తాను గెలిస్తే అది ప్రజల విజయమేనని, నేను ఓటమిపాలైనా అది ప్రజలకే చెందుతుందని అన్నారు. మార్పుకు తనను ఒక పరికరంగా ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ట్విటర్‌లో నిజాయితీ, కుల, మతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకాలని నిశ్చయించా. అద్భుతాలు జరుగుతాయి. మార్పు వస్తుంది.. అన్నింటిని తప్పకుండా మారుస్తాం’ అని తలైవా పేర్కొన్నారు. ఏడాది ముందే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని భావించినా కరోనా కారణంగా తమిళనాడు వ్యాప్తంగా తిరగలేకపోయానని అన్నారు. 2016లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు సలహా ఇచ్చారని, ఆ తర్వాత కరోనా మహమ్మారి తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. చివరికి ప్రజల దగ్గరకు వెళ్లాలనే నిర్ణయించుకున్నానని రజినీ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్యం రీత్యా సింగపూర్ వెళ్లాల్సి వచ్చిందని, ప్రజలు, అభిమానుల ప్రేమ, ప్రార్థనలు ఫలించి తిరిగి క్షేమంగా బయటపడ్డానని, ఇప్పుడు తన రాజకీయ జీవితం వాళ్లకు ఉపయోగపడితే అత్యంత సంతోషిస్తానని అన్నారు. రజినీ ప్రకటన వెలువడిన వెంటనే తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందోత్సాహాలతో వీధుల్లోకి వచ్చారు. బాణసంచా కాల్చుతూ ఆయన ప్రకటనను స్వాగతించారు. దీంతో తమకు అదిరిపోయే నూతన సంవత్సర కానుక రజిన్టీ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో సోమవారం రజనీకాంత్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ప్రకటన వెలువడడం విశేషం. మరోవైపు రజినీ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన ప్రకటనను సినీ, రాజకీయరంగ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ఇందులో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
సినీరంగం నుంచే మరో నేత..
ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులుగా తమదైన ముద్రవేసిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమల్‌హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు మరింత ఉధృతమయ్యాయి. ఇక కమల్ ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యం’ పేరిట పార్టీ స్థాపించగా, తాజాగా 2021 జనవరిలో పార్టీ స్థాపించబోతున్నట్లు రజినీ ప్రకటించారు.

Rajinikanth Announces about political party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News