Friday, April 19, 2024

చైనాది ‘హద్దు’ల్లేని అగౌరవం

- Advertisement -
- Advertisement -

Rajnath Singh made statement on India-China border

న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్ వద్ద పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. లడఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందన్నారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. భారత్‌తో సరిహద్దులను చైనా గౌరవించడం లేదని స్పష్టంచేశారు.దాదాపు 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. గల్వాన్ ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ లడఖ్ వెళ్లి సైనికులను కలిశారని సభకు గుర్తు చేశారు. లడఖ్ వద్ద గల్వాన్ లోయ ప్రాంతంలో ఏకపక్షంగా సరిహద్దులను మార్చాలన్న చైనా కుతంత్రాలను మన సైన్యం తిప్పికొట్టిందన్నారు. తీవ్ర కఠిన పరిస్థితుల్లో మన సైన్యం చైనా కుతంత్రాలను తిప్పి కొట్టిందన్నారు.

ఈ ప్రయత్నంలో మన సైనికులు కొంతమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ చైనా వైపు భారీ ప్రాణనష్ట కలిగించడం ద్వారా తగు గుణపాఠం చెప్పారన్నారు. సరిహద్దు సమస్య తేలేవరకు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి)ను గౌరవించాలన్న ఒప్పందాన్ని చైనా పదేపదే ఉల్లంఘిస్తోందన్నారు. గత మేనుంచి చైనా సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ వస్తోందన్న ఆయన భారత్ కూడా తగురీతిలో బలగాలను తరలించిందన్నారు. చైనా ఏకపక్ష చర్యలను ఖండిస్తున్నామన్నారు. గత ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నించిదన్నారు. సరిహద్దుల్లో చైనా హింసాత్మక చర్యలకు పాల్పడిందని, దాని దుశ్చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందని చెప్పారు.

ఈ క్రమంలో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికులకు ఆయన నివాళి అర్పించారు. చైనా దూకుడుతో శాంతి ఒప్పందానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ఎల్‌ఎసిని రెండు దేశాలు గౌరవించాలన్నారు. చైనా కదలికలను నిరంతరం గమనిస్తున్నామన్నారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదన్న రాజ్‌నాథ్ .. ఎల్‌ఎసి విషయంలో రెండు దేశాల మధ్య వివాదాలున్నాయన్నారు. చైనాతో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించామన్నారు. చైనాతో స్నేహపూర్వక సంబంధాలను తమ ప్రభుత్వం కోరుకుంటోందని స్పష్టం చేశారు. సరిహద్దుల విషయంలో మంచి పరిష్కారాన్ని కోరుకుంటున్నామని రాజ్‌నాథ్ చెప్పారు.

దేశం మొత్తం సైన్యం వెంటే..

‘సరిహద్దుల్లో చైనా హింసాత్మక ఘటనలకు పాల్పడింది. మన సైన్యం చైనా దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది.1993,96 ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో బలగాలను మరింత పెంచాం. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌తో కలిసి నడవాలని చైనాను కోరుతున్నాం. దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. సరిహద్దుల్లో మౌలిక వసతులు కల్పించాం. దేశం మొత్తం సైన్యం వెంటే ఉంది. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే ఆగస్టు 2930అర్ధ రాత్రి చైనా చేసిన దుష ్టప్రయత్నాలను మన సైన్యం తిప్పికొట్టింది. సరిహద్దులో శాంతి నెలకొనాలనేదే భారత్ ఉద్దేశం, 1993,1996 ఒప్పందాల సారాంశం కూడా అదే.

భారత్ ఎప్పుడూ శాంతి సామరస్యాలనే కోరుకుంటుంది. సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలనే కోరుకుంటున్నాం. రష్యాలో జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రికి ఇదే విషయాన్ని స్పష్టం చేశాం. చర్చలు చాలా లోతుగా జరిగాయి. భారీ సంఖ్యలో దళాలను మోహరించడం, దురాక్రమణ బుద్ధితో వ్యవహరించడం, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించడం ఆందోళన కరమని స్పష్టంగా చెప్పాం’ అని రాజ్‌నాథ్ సభకు తెలిపారు. లడఖ్ ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తతలపై సభలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందుతాయా, లేక మరింత లోతైన చర్చకు పట్టుబడతాయో చూడాల్సి ఉంది.

Rajnath Singh made statement on India-China border

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News