Home తాజా వార్తలు నేడు రైతుల ధర్నా

నేడు రైతుల ధర్నా

Rakesh tikait to attend maha dharna in hyderabad

 

ఇందిరాపార్కు వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న ఎస్‌కెఎం నేత రాజేశ్ తికాయత్

మన తెలంగాణ/ హైదరాబాద్ : అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు గురువారం హదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాలో ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్ పాల్గొంటారు. ఈ ధర్ణాలో ఎస్‌కెఎం, బికెయూఎస్, ఎకెఎంఎస్ నేతలు పాల్గొంటారు. మూడు సాగు చట్టాలకు సంబంధించి చట్ట సవరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతు ఉద్యమ అమరవీరులకు న్యాయం తదితర కీలక డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే ప్రధాని తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా రైతు సంఘాల నేతలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని రాకేష్ తికాయత్ ఇటీవలనే వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు మంచివి కావని ప్రభుత్వానికి తెలియజేప్పేందుకు తమకు ఏడాది సమయం పట్టిందని రాకేష్ తికాయత్ చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతోంది. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఇదే విషయమై తాడో పేడో తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో రాకేష్ తికాయత్ హైదరాబాద్ కేంద్రంగా ధర్నాలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి ఏటా రాష్ట్రం నుండి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా చెప్పాలని సిఎం కెసిఆర్ ప్రధాని మోడికి లేఖ రాసిన సంగతి విదితమే. వరి ధాన్యం కొనుగోలు విషయమై బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యాసంగింలో వరిధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన చేయించాలని టిఆర్‌ఎస్ నాయకత్వం బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే వర్షాకాలంలో పండించిన వరిధాన్యం కొనుగోలులో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని బిజెపి నేతలు విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బిజెపి నేతలు పరిశీలించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్గొండ జిల్లాలో పర్యటించిన సమయంలో రాళ్లదాడి చోటు చేసుకుంది. తన పర్యటనను అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ రాళ్లదాడికి దిగిందని బండి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని బిజెపి ఆరోపించింది.

Rakesh tikait to attend maha dharna in hyderabad