Wednesday, April 24, 2024

సమన్లు అందాయి.. విచారణకు వస్తా

- Advertisement -
- Advertisement -

Rakul Preet Singh responds to NCB summons

ఎన్‌సిబికి రకుల్ ధ్రువీకరణ
డ్రగ్స్ కేసులో పలువురు తారలకు సమన్లు

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై విచారణకు హాజరు కావాలంటూ తాము జారీచేసిన సమన్లు అందినట్లు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ధ్రువీకరించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) గురువారం తెలిపింది. కాగా.. తనకు ముంబయి నుంచి కాని హైదరాబాద్ నుంచి కాని ఎటువంటి సమన్లు అందలేదని రకుల్ గురువారం ఉదయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటలకే ఎన్‌సిబి నుంచి ప్రకటన వెలువడడం గమనార్హం. తమ వద్ద ఉన్న ఫోన్ నంబర్‌తో సహా వివిధ మాధ్యమాల ద్వారా రకుల్‌ను సంప్రదించామని, సమన్లు అందినట్లు ఆమె ధ్రువీకరించారని ఎన్‌సిబి అధికారి ఒకరు తెలిపారు. ఆమె త్వరలోనే విచారణకు హాజరవుతారని ఆయన చెప్పారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతకి సంబంధించి డ్రగ్స్ కోణం వెలువుగోలకి రావడంతో దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌సిబి తన దర్యాప్తు పరిధిని ప్రస్తుతం విస్తరించింది. ముంబయి సినీ పరిశ్రమకు చెందిన కొందరు ఎ-జాబితా ప్రముఖులను దర్యాప్తులో చేరవలసిందిగా ఆదేశిస్తూ వారికి ఎన్‌సిబి సమన్లు జారీచేసింది. ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను ప్రశ్నించేందుకు బుధవారం వారికి ఎన్‌సిబి సమన్లు జారీచేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలంలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ ప్రస్తావన ఉన్నట్లు ఎన్‌సిబి వర్గాలు ఇదివరకు వెల్లడించాయి. ఎన్‌సిబి నుంచి సమన్లు అందుకున్న ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాటా విచారణ నిమిత్తం గురువారం ఉదయం 9.30 గంటలకు దక్షిణ ముంబయిలోని ఎన్‌సిబికి చెందిన అతిథి గృహానికి చేరుకున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొందరిని ప్రశ్నించినపుడు ఆమె పేరు బయటకు వచ్చిందని ఎన్‌సిబి అధికారి తెలిపారు. సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీ కూడా గురువారం ఉదయం ఎన్‌సిబి ఎదుట హాజరయ్యారు.ఎన్‌సిబి గతంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన వ్యక్తుల వాట్సాప్ చాట్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించి సంభాషణలు జరిగాయని ఎన్‌సిబి వర్గాలు ఇదివరకు చెప్పాయి.  సుశాంత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కోణంపై ఒక కేసు, బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై మరో కేసు..ఇప్పటివరకు మొత్తం రెండు కేసులు నమోదు చేశామని ఎన్‌సిబి సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ రెండు కేసులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ రెండు కేసులపై సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను ప్రశ్నిస్తామని ఆ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News