Home జాతీయ వార్తలు శ్రీరామరాజ్యం

శ్రీరామరాజ్యం

అయోధ్యలో వైభవంగా రామమందిరానికి భూమి పూజ
ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
నక్షత్రం ఆకారంలో ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదీ జలాలు, దేశవ్యాప్తంగా సేకరించిన మృత్తికలతో అంకురార్పణ
హనుమాన్ గడీ, రామ్‌లల్లాలో ప్రధాని ప్రత్యేక పూజలు
జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిన యావత్ భారతావని

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామభక్తుల శతాబ్దాల కల సాకారం. జయజయధ్వానాలు.. జై శ్రీరాం నినాదాల నడుమ అపురూపఘట్టానికి అంకురార్పరణ జరిగిన క్షణం. అత్యంత వైభవోపేతంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు అయోధ్యలో శ్రీకోదండరాముడి భవ్యమందిర నిర్మాణానికి అభిజిత్ లగ్నంలో భూమిపూజ చేశారు. యావత్ భారతావని ఆధ్యాత్మిక భావనలో తేలియాడుతుండగా నక్షత్రాల ఆకారంలోని ఐదు వెండి ఇటుకలకు ప్రధానమంత్రి శాస్త్రోక్తంగా పూజలు చేసి పురుషోత్తముడి ఆలయ నిర్మాణానికి పురుడుపోశారు. బంగారు వర్ణంలోని సిల్క్ కుర్తా, తెల్లని ధోవతి ధరించి వచ్చిన ఆయన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ సందర్భంగా ప్రధాని వెంట యుపి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సిఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ తదితరులు ఉన్నారు. 170మందికిపైగా ప్రత్యేక అతిథుల ప్రత్యక్షంలో, కోటాను కోట్ల భక్తులు టీవీలకు అతుక్కుపోయిన పరోక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా మందిరాల వద్ద భక్తుల కోలాహలం, పూజలు, మిఠాయిల పంపిణీతో సంబరాలు జరుపుకున్నారు.

‘జై శ్రీరాం.. జైశ్రీరాం. ఈ నినాదాలు శ్రీరాము డికి వినిపించకపోవచ్చు. కానీ ప్రపంచంలోని ఉన్న రామభక్తు లందరికీ వినిపిస్తాయి. మందిరం నిర్మాణానికి నన్ను ఆహ్వానించడం మహద్భాగ్యం. ఇందుకు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు రుణ పడి ఉంటా. ఈ మహత్కార్యం సందర్భంగా ప్రపం చవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికి నా శుభాకాంక్షలు. అయోధ్యలో నిర్మించబోయే మందిరం శ్రీరాముని పేరు వలే భారతీయ సంస్కృ తిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నమ్ముతు న్నాను. రాముడు అందరి వాడు. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు ఇవ్వాళ ప్రతి ఒక్కరి హృదయం ఆనం దంతో ఉప్పొంగిపోతుంది. ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.ఇన్నేళ్లు గుడి, గుడారం కింద నివసించిన రాముడు ఇక భవ్య మందిరంలో కొలువుదీరబోతున్నాడు.- నరేంద్ర మోడీ, ప్రధాన మంత్రి

అయోధ్యలో భూమిపూజ జరుగుతుండగానే ఒకరకంగా దేశమంతా రామమయమైంది. ఆలయాలన్నీ ప్రత్యేక పూజలతో భక్తులను పులకింపజేశాయి. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. భూమిపూజకు ముందు ప్రధాని మోడీ అయోధ్యలో 10వ శతాబ్దం నాటి హనుమాన్‌గడీని సందర్శించి పూజలు చేసి తన పర్యటనను ప్రారంభించారు. ఆలయంలో కలియతిరిగి పూజారుల సత్కారాన్ని అందుకున్నారు. అనంతరం రామజన్మభూమికి చేరుకున్నారు. అక్కడి రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం చేసి హారతులిచ్చారు. భూమి పూజ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశ వేదిక నుంచే అతిథుల సమక్షంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చీఫ్ మహంత్ నృత్య గోపాల్‌దాస్‌తో కలిసి రామమందిరం నిర్మాణం శిలాఫలకాన్ని మోడీ ఆవిష్కరించారు. గుడి నిర్మాణ చిహ్నంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. అనంతరం యావత్ దేశానికి వేదిక నుంచి ప్రధాని సందేశాన్నిచ్చారు. కార్యక్రమం ఆసాంతం కరోనా నిబంధనలు పాటించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రసంగించినప్పుడు మినహా నిత్యం మాస్కుతోనే కనిపించారు. సామాజిక దూరం పాటించి ఆదర్శంగా నిలిచారు.

Ram Mandir bhumi Puja in Ayodhya