Home జాతీయ వార్తలు అయోధ్యలో రామరాజ్యం

అయోధ్యలో రామరాజ్యం

Ayodhya

 

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాద అంశం. దీన్ని ముస్లింలు కూడా విశ్వసిస్తారు. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అంతకుపూర్వం అక్కడ హిందూ నిర్మాణం మాత్రం ఉందని భారత పురావస్తు శాఖ(ఎఎస్‌ఐ) నివేదిక చెబుతోంది. దాని ఆధారంగానే ఈ తీర్పు చెబుతున్నాం. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో నిర్మించలేదని, అదే సమయంలో మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారనడానికి తగ్గ ఆధారాలూ లేవని ఎఎస్‌ఐ నివేదికలో చెప్పింది. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు.
                                                                                                                       – ధర్మాసనం
మొత్తం వివాద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి అప్పగించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అంతిమ తీర్పు
అయోధ్యలోనే ముస్లింలకు ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం
శతాబ్దం పైగా సాగిన వివాదానికి తెర
మసీదు విధ్వంసం తప్పే
అలహాబాద్ కోర్టు తీర్పు కొట్టివేత
తమ వాదన నిరూపణలో సున్నీవక్ఫ్ బోర్డు విఫలమైందని స్పష్టీకరణ
వివాదాస్పద స్థలానికి రాముడే ప్రతీకాత్మక యజమాని

న్యూఢిల్లీ : భారతదేశంలో శతాబ్దానికిపైగా నలుగుతూ… దశాబ్దాలుగా అత్యంత చర్చనీయాంశం, వివాదాస్పదమైన రామజన్మభూమి బాబ్రీమసీదు భూయాజమాన్య హక్కుల కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని కుండబద్ధలు కొట్టింది. తద్వారా ఈ కేసులో ఆది నుంచి కక్షిదారుగా ఉన్న రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తూ ఆ వివాదాస్పద స్థలాన్ని వారికే అప్పజెప్పాలని ఆదేశించింది. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్య పట్టణంలోనే విలువైన చోట 5ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మాణంకోసం సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని సూచించింది.

ఇందుకోసం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది. అదేసమయంలో షియా వక్ఫ్‌బోర్డు, నిర్మొహి అఖాడా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టిపారేస్తున్నట్లు స్పష్టం చేసింది. యాజమాన్య హక్కులు కల్పించాలంటూ షియా బోర్డు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని, ప్రతిపాదిత రామమందిరం స్థలంపై పూర్తి హక్కుల తమకే కల్పించాలన్న నిర్మొహి అఖాడా పిటిషన్‌లను న్యాయస్థానం తిరస్కరించింది. 40రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం అనూహ్యంగా శనివారంనాడు తీర్పు ప్రకటించింది.

యావద్దేశం అత్యంత ఉద్విగ్న, ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఎదురుచూస్తుండగా జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఎ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సరిగ్గా 10.30గంటలకు బెంచ్‌పైకి చేరుకుంది. ఏకగ్రీవ తీర్పు పాఠంపై తొలుత న్యాయమూర్తులు సంతకాలు చేశారు. అనంతరం ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి తీర్పు సారాంశాన్ని 45నిమిషాల పాటు చదివి వినిపించారు. మొత్తం తీర్పు 1,045పేజీలు కావడం విశేషం.

అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేత…
అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 2.77ఎకరాల స్థలాన్ని హిందువులకే అప్పగిస్తున్నట్లు, ఇందుకోసం మూడు మాసాల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తద్వారా స్థలం సంబంధిత సంస్థకు అప్పగించే ప్రక్రియకు పూనుకోవాలని సూచించింది ఇక రామమందిరం నిర్మాణానికి ఏదైనా ట్రస్టు లేదా నూతన సంస్థను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. అందులో నిర్మొహి అఖారాకు స్థానం కల్పించాలని సూచించింది.

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాద అంశమని, దీన్ని ముస్లింలు కూడా విశ్వసిస్తున్నారని పేర్కొంది. వివాదాస్పద స్థలానికి ఇక రాముడే ప్రతీకాత్మక యజమాని అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అంతకుపూర్వం అక్కడ హిందూ నిర్మాణం మాత్రం ఉందని భారత పురవాస్తు శాఖ(ఎఎస్‌ఐ) నివేదిక చెబుతోందని, దాని ఆధారంగా ఈ తీర్పు చెబుతున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో నిర్మించలేదని, అదే సమయంలో మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారనడానికి తగ్గ ఆధారాల్లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిం దువులు విశ్వసిస్తున్నారని పేర్కొంది.

వివాదాస్పద స్థలం లో రెండు వర్గాల ప్రజలు ప్రార్థనలు చేసేవారని కోర్టు తెలిపింది. లోపల హిందువులు, బయట ముస్లింలు ప్రార్థనలు చేసేవారని వివరించింది. ‘మూడు డోమ్‌లతో 16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరాన్ని నిర్మించతలపెట్టే ఉద్దేశంతో కరసేవకులు ధ్వంసం చేశారు. ఇది ముమ్మాటికీ తప్పు, చట్ట ఉల్లంఘన. ఎందుకంటే ఇది పరిష్కరించుకోదగ్గ విష యం’ అని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

సున్నీ బోర్డు వాళ్లు నిరూపించలేకపోయారు
మొఘలుల కాలం నుంచి తమకు వివాదాస్పద స్థలంపై హక్కు ఉన్నట్టు సున్నీ వక్ఫ్‌బోర్డు నిరూపణ చేయలేకపోయిందని, శుక్రవారంనాడు మాత్రం ప్రార్థనలు జరిపినట్లు ఆధారాలు ఇవ్వగలిందని న్యాయస్థానం తెలిపిం ది. ‘1857కు ముందు హిందువులు లోపలికి వెళ్లేవారు కాదు, ఆ హక్కు కూడా వారికి ఉండేది కాదు. 1949లో ఆ స్థలం హిందువుల ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత స్థలం తమ ఆధీనంలోకి వచ్చినట్లు, ప్రార్థనలు జరిగినట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేదు. 1886లోనే వివాదాస్పద స్థలం చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేశారు.

తద్వారా హిందువులు అక్కడ ప్రార్థనలు చేశారనేదాన్ని ఇది నిరూపించింది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. అయోధ్య కేసు కు ఆర్టికల్ 47 వర్తించదని జస్టిస్ రంజన్ గొగోయి అ న్నారు. న్యాయమూర్తి ఆదేశాలున్నప్పుడే ఆ అధికరణం వర్తిస్తుందన్నారు. తాజా తీర్పుతో హిందువులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టేనని భావించవచ్చు.

విశ్వాసాలనూ పరిగణనలోకి తీసుకున్నాం
“చరిత్రకు, రాజకీయాలకు అతీతంగా న్యాయం ఉండాలి. ఒక లౌకిక సంస్థగా న్యాయస్థానం భక్తుల విశ్వాసాలను కూడా లెక్కలోకి తీసుకోవాలనుకుంటుంది. అన్ని వర్గాల నడుమ సమతుల్యత కీలకం. అందరి విశ్వాసాలు పరిరక్షించబడాలి. మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు దాఖలు చేసిన పిటిషన్ కాదు. మసీదు ఎవరు కట్టారో.. ఎప్పుడు నిర్మించారో అన్నది ఇతమిద్ధంగా చెప్పలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం గా చెప్పింది.

రెవెన్యూ రికార్డులు మాత్రం వివాదాస్పద స్థలం ప్రభుత్వానిదేనని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పురావస్తు విభాగం నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత కట్టడం ఇస్లామిక్ శైలిలో జరగలేదని పురావస్తు శాఖ చెప్పింది. ఇది భారీ సంఖ్యలో ఉన్న హిందువులకు సంబంధించినది. ఇక యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం. దీనికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నాం” అని తీర్పు ప్రారంభంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Rama Rajya in Ayodhya