Home ఖమ్మం రేషన్ డీలర్ ఘరానా మోసం

రేషన్ డీలర్ ఘరానా మోసం

Ration dealer selling thin rice

 

ఖమ్మం: కొణిజర్ల మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామంలోని రేషన్ డీలర్‌పై గ్రామస్థులు భగ్గుమన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు టిఆర్‌ఎస్‌కి చెందిన కొణిజర్ల మండల నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, స్థానిక న్యూడెమోక్రసీ నాయకులు మేడి కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన రేషన్ షాప్‌కు సుమారు 70 క్వింటాళ్ళ సన్నబియ్యం ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పంపిందని, ఆ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ క్వింటాకు రూ.2 వేల నుండి రూ.3 వేల వరకు అమ్ముకుంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్తులతో కలిసి రేషన్ షాపును గురువారం ముట్టడించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులకు రేషన్‌షాప్ వద్దకు దొడ్డు బియ్యం తీసుకొని తండోపతండాలుగా తరలివచ్చారు.

దీంతో రేషన్ డీలర్‌కు, నాయకులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సన్నబియ్యం పంపిణీ చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని ఆందోళన చేయటంతో చివరకు డీలర్ లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వక తప్పలేదు. లబ్ధిదారుల నుంచి సగం దొడ్డుబియ్యం తీసుకొని సగం మాత్రమే సన్నబియ్యం ఇచ్చారు. ప్రతి నెలా ప్రజలకు ఇవ్వవల్సిన బియ్యం ఇవ్వకుండా సర్వర్ ప్రాబ్లమ్ ఉందని రేపు రా మాపు రా అంటూ రేషన్ షాపు చుట్టూ తిప్పుకుంటున్నారని, చివరకు మరో రోజు బియ్యం తెచ్చేందుకు పోతే బియ్యం ఇచ్చే సమయం అయిపోయిందని వెళ్ళగొడుతున్నాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం ప్రతి నెలా ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని డీలర్ అమ్ముకోవటంపై ప్రజలు చీదరించుకుంటున్నారు. గతంలో కూడా ఈ డీలర్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండటంతో గ్రామస్తులు పట్టింంచారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డీలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Ration dealer selling thin rice