Home రాష్ట్ర వార్తలు రేషన్ పనివేళలు నెలలో సగమే?

రేషన్ పనివేళలు నెలలో సగమే?

15వ తేదీ వరకే సరుకుల పంపిణీ
ఇప్పటికీ పలు జిల్లాల్లో ఈ విధానమే
పలు నగరాలకు మినహాయింపు
ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం

 

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని చౌక దుకాణాల పనిదినాలను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటికే రా ష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలలో సగం రోజులు మాత్రమే పని చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలు, నగరాలకు కొంత వరకు మినహాయింపునిచ్చారు. చౌకధరల దుకాణాల పని దినాలను రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. దీంతో ఇక నుంచి అన్ని జిల్లాల్లో ఒకే రకమైన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అవసరమైన కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమైనట్లు సమాచారం.

నెలలో 15 రోజులే రేషన్ దుకాణాలు

రాష్ట్రంలో రేషన్‌దుకాణాలను నెలలో 15 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల అధికారులకు సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విధానం ప్రస్తుతం పలు జిల్లాల్లో కొనసాగుతుండగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని కొనసాగించాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ నగరంలోనూ ఇక నుంచి ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ కార్డు లబ్ధిదారులు తమ సరుకులను తీసుకోవాల్సి ఉంటుంది. గతంలోనే పౌరసరఫరాలశాఖ ఈ నిర్ణయం తీసుకొని పలు జిల్లాల్లో అమలు చేస్తుంది. కానీ హైదరాబాద్‌తో పాటు మరిన్ని నగరాలు, పట్టణాల్లో 15వ తేదీలోగా రేషన్ పంపిణీ చేయలేమని డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరో ఐదు రోజుల పాటు పెంచాలని కోరడంతో రేషన్ డీలర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఐదు రోజుల పాటు పొడిగించింది. దీంతో ప్రస్తుతం 20వ తేదీ వరకు పలు నగరాలు, పట్టణాల్లో రేషన్ సరుకుల పంపిణీ సాగుతుంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ దుకాణాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌లోనే అధికం

వినియోగదారుల సౌకర్యార్థం పౌరసరఫరాలశాఖ పలు రకాల ఆధునిక పద్దతులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధానంగా రేషన్ పోర్టబులిటీ విధా నం. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఏ మూలన రేషన్‌కార్డు కలిగిన ఎక్కడ నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రజలు ఈ విధానం పట్ల అ త్యంత ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. పలువురు గ్రామాల ప్రజలు బతుకుదెరువు కోసం తమ స్వగ్రామాలను వదిలి నగరాలు, పట్టణాలకు చేసుకొని పనులు చే సుకుంటున్నారు. ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వసల వచ్చిన వారికి ఈ విధానం చాలా ప్రయోజకరంగా ఉం ది. దీంతో అనేక మంది లబ్ధిదారులు వారు ఉన్న ప్రాం తంలో సరుకులు తీసుకుంటున్నారు. ప్రతి నెల సరుకుల కోసం స్వగ్రామాలకు వెళ్ళకుండా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంతో వలసజీవులు చాలా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్, మేడ్చ ల్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్‌లాంటి నగరాలకు ప్రజలు అత్యధికంగా వలసలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ యా జిల్లాల్లోనే ప్రజలు ఎక్కువగా సరుకు లను తీసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ విధానం ద్వారా భారీ సంఖ్యలో లబ్ధిదారులకు మేలు జరుగు తుంది.

రాష్ట్రంలో 90 లక్షల మంది లబ్ధిదారులు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వీరంతా ప్రతి నెల రేషన్‌దుకాణాల నుంచి సరుకులను తీసుకుంటున్నారు. ప్రతి నెల దాదాపు నాలుగు వేల క్వింటాళ్లను లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికి అందజేస్తుంది. అంతేకాకుండా కిలో బియ్యం రూపాయకే అందజేస్తుంది. రూ.25 కిలోగా ఉన్న బియ్యాన్ని సబ్సిడి రూపంలో రూపాయికే అందజేస్తుంది. రాష్ట్ర ప్రజలంతా కడుపునిండా అన్నం తిన్నాలనే లక్షంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్‌దుకాణాల నుంచి లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని ఖచ్చితంగా తీసుకుం టున్నారు. రేషన్‌దుకాణాదారులు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పలు రకాల సంస్కరణలను తీసుకువచ్చిన పౌరసరఫరాలశాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది. దీంతో రేషన్‌దుకాణాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు.