Home తాజా వార్తలు అశ్విన్ ‘మన్కడింగ్’ కిరికిరి! అసలు కథ ఇదే!!

అశ్విన్ ‘మన్కడింగ్’ కిరికిరి! అసలు కథ ఇదే!!

Ravi Ashwin and Jos Buttlerజైపూర్‌: టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్ కు చెందిన జాస్‌ బట్లర్‌ మధ్య నెలకొన్న ‘మన్కడింగ్’ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వివాదంపై క్రీడా అభిమానులు, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అశ్విన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందటే… కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 13 ఓవర్లలో 108/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. 13వ ఓవర్‌ బౌలింగ్ చేసిన పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఆఖరి బంతి వేయకముందు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బట్లర్‌ క్రీజు వదిలిపెట్టి ముందుకు వెళ్లాడు. దీంతో చాకచక్యంగా వ్యవహారించిన అశ్విన్ బౌలింగ్‌ చేస్తున్నట్లు అనుకరించి బంతితో వికెట్లను గిరాటేసి బట్లర్‌ను రనౌట్‌ చేశాడు. అంపైర్‌ను అప్పీల్‌ చేయగా ఔట్‌గా ప్రకటించారు. దాంతో బట్లర్ తీవ్ర నిరాశతో క్రీజు వదిలాడు. ఈ వ్యవహారంలో కొందరు అశ్విన్ ను కరెక్ట్ అంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. అశ్విన్ గెలుపు కోసం తొండి ఆట ఆడాడని కన్నెర్ర చేస్తున్నారు.

అసలు ఈ ‘మన్కడింగ్’ ఔట్ అంటే ఏంటి?, దాని  వెనకున్న ఆసక్తికర కథ గురించి తెలుసుకుందాం. వాస్తవానికి క్రికెట్ నిబంధనల ప్రకారం నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్‌ రనౌట్‌ చేసే విధానాన్ని ‘మన్కడింగ్’ అంటారు. ఈ విధానాన్ని తొలిసారిగా 1947-48 సీజన్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టులోని బౌలర్ వినూ మన్కడ్ వాడారు. ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజ్ వదిలి ముందుకు వెళ్తుండడంతో పలుమార్లు వినూ మన్కడ్ అతడ్ని హెచ్చరించాడు. అయినా బిల్ బ్రౌన్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో మన్కడ్ అతన్ని రనౌట్ గా పెవిలియన్ పంపాడు. దీంతో ఈ రనౌట్ కు ‘మన్కడింగ్’ అంటూ ఆస్ట్రేలియా మీడియా పేరు పెట్టింది. ఈ విధానాన్ని అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది కూడా. అయితే అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ఈ విధానాన్ని అంగీకరించడం కొసమెరుపు. ఈ తరహాలో అవుట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు అంటున్నా, అప్పుడప్పుడూ క్రికెట్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ అవుట్ కు మన్కడింగ్ అన్న పేరును తీసేయాలని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ వంటి వారు చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇలా అవుట్ అయిన తొలి ఆటగాడు బిల్ బౌన్ పేరు మీద ‘బౌన్డ్’ అని పెట్టాలని లిటిల్ మాస్టర్ సూచించారు.