Home తాజా వార్తలు ప్రపంచకప్ గెలిచే అన్ని అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి

ప్రపంచకప్ గెలిచే అన్ని అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి

 

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు కావాల్సిన అన్ని అస్త్రాలు భారత్ వద్ద సిద్ధంగా ఉన్నాయని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అక్కడి పరిస్థితులను అనుసరించి జట్టు కూర్పు నిర్ణయిస్తామని వెల్లడించాడు. మెగా టోర్నీకి ఎంపికైన విజయ్ శంకర్ కీలకమైన నాలుగో స్థానంలో ఆడతాడా అన్న ప్రశ్నకు శాస్త్రి పరోక్షంగా జవాబు చెప్పాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రవిశాస్త్రి పలు విషయాలు వెల్లడించాడు. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల క్రికెటర్లకు మనకు ఉన్నారు. నాలుగో స్థానంలో ఆడగల ఆటగాళ్ల్లు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం దాని గురించే ఆలోచించడం లేదు. ఇలాంటి అంశాలను ఎప్పుడో పరిశీలించాం. ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్లు కావాలి. వారిని ఎంపిక చేశారు. వారిలో ఎవరైనా గాయపడితే ఇతరుల గురించి ఆలోచిస్తాం. కాగా, ఐపిఎల్‌లో కేదార్ జాదవ్ గాయానికి గురయ్యాడు. అయితే ఫ్రాక్చర్ కాలేదు. అతడిని కొన్ని రోజుల పాటు పరిశీలనలో ఉంచుతున్నాం. ఇంగ్ల్లండ్ వెళ్లేందుకు ఇంకా సమయముంది. మరొకరి ఎంపికపై ఇప్పుడే ఆలోచించడం లేదు’ అని రవిశాస్త్రి అన్నాడు. ‘ఇలాంటి మెగాటోర్నీలో ఏ జట్టూ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో ఇలాంటి పరిస్థితులెన్నో చూశాం. ఒత్తిడిని అనుభవించాం. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఏమైనా చేయగలవు. భారత్‌లో ఆడినప్పుడు విండీస్ చాలా కఠిన పోటీనిచ్చింది. ఇప్పుడా జట్టులో గేల్, రసెల్ ఉన్నారు. కరీబియన్ల పవర్ హిట్టింగ్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆసీస్‌ను ఎన్నడూ తక్కువ అంచనా వేయొద్దు. 25 ఏళ్లలో వారు ఐదుసార్లు ట్రోఫీ ముద్దాడారు. మళ్లీ నాణ్యమైన సీనియర్ ఆటగాళ్లు రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా, ఈ ప్రపంచకప్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమని శాస్త్రి జోస్యం చెప్పాడు.
వారి మధ్య విభేదాలు లేవు
ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లడం కోసమే పని చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.“ ధోనీ, కోహ్లీ ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు.
వారిద్దరూ జట్టు గెలుపు కోసమే ఆలోచిస్తారు. వారిద్దరిలా పరస్పరం గౌరవించుకునే వాళ్లను నేను ఇప్పటి వరకు చూడలేదు. వారిద్దరూ అవతలివారి మంచినే కోరుకుంటారు. నేను తొలుత ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోచ్‌గా పని చేశాను. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోనూ జట్టు కోచ్‌గా ఉన్నాను. వారి నిబద్ధత, జట్టును విజయతీరాలకు చేర్చాలన్నబలమైన ఆకాంక్ష నాకు బాగా తెలుసు” అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. మైదానం బయట, డ్రెస్సింగ్ రూంలో సహచర ఆటగాళ్లు ధోనీని పరిశీలిస్తూ కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటారో వివరించారు. “ధోనీ తన కెరీర్‌లో ఏం సాధించాడో అందరికీ తెలుసు. మైదానంలో అతడి నడవడిక, బ్యాటింగ్, కీపింగ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రవర్తన నుంచి సహచర ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చని తెలిపారు. డ్రెస్సింగ్ రూంలో వివిధ సంఘటనలను ప్రస్తావిస్తూ.. సహచరులంతా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. “జట్టులో అందరూ ఒకేలా ఆలోచిస్తారని చెప్పలేం. అయితే అలా ఉండటం అవసరం. ఇతరుల ప్రవర్తన జట్టుపై ప్రభావం చూపకుండా ఉండే వరకు ఎలాంటి నష్టముండదన్నాడు.