Home తాజా వార్తలు రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు

రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు

RBI dismisses Reliance capital board

 

దివాలా ప్రక్రియ ప్రారంభించిన ఆర్‌బిఐ
అడ్మినిస్ట్రేటర్‌గా వై.నాగేశ్వర్ రావు

న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ బోర్డును ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రద్దు చేసింది. కంపెనీపై దివాలా అభియోగాలను ప్రారంభించింది. పాలనా పరమైన ఆందోళనల దృష్టా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సి) బోర్డును రద్దు చేసినట్టు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.నాగేశ్వర్ రావును నియమించింది. గణాంకాల్లో స్పష్టత లేదని వారు 2019 జూన్‌లో రిలయన్స్ క్యాపిటల్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆడిటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ ప్రకారం, రుణదాతలకు వివిధ చెల్లింపుల విషయంలో కంపెనీ విఫలం కావడంతో పాటు పాలనా పరమైన సమస్యలను బోర్డు సమర్థవంతంగా పరిష్కరించలేకపోయింది. ఈ కారణంగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డు డైరెక్టర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.

ఎన్‌సిఎల్‌టికి దాఖలు
దివాలా నిబంధనల కింద కంపెనీ పునరుద్ధరణ ప్రణాళిక ప్రక్రియ ప్రారంభించామని ఆర్‌బిఐ ప్రకటించింది. దివాలా ప్రక్రియ కోసం అడ్మినిస్ట్రేటర్‌ను నియమించేందుకు గాను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్‌కు దరఖాస్తు చేయనున్నామని రిజర్వు బ్యాంక్ తెలిపింది. దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంస్థల్లో ఇప్పటి వరకు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్), రెండు శ్రీ గ్రూప్ సంస్థలు ఉన్నాయి. దీని తర్వాత రిలయన్స్ క్యాపిటల్ మూడో ఎన్‌బిఎఫ్‌సి అవుతుంది. సోమవారం రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 5 శాతం పతనమై లోయర్ సర్కూట్ పరిమితిని తాకింది. ఆఖరికి రూ.19.05 వద్ద ముగిసింది. ఇక రిలయన్స్ పవర్ షేరు 5 శాతం పడిపోయి రూ.12.93కు చేరగా, రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు 5 శాతం డౌన్ అయి రూ.87.85కు చేరాయి.

RBI dismisses Reliance capital board