Wednesday, April 24, 2024

రెపో రేటు 0.35% పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి స్వల్పంగా 0.35 శాతం రెపో రేటును పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. ఇది గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకునేవారు, తీసుకున్న వారిపై ప్రభావం చూపనుంది. ఇఎంఐలు పెరగడం వల్ల వినియోగదారులపై భారం పెరుగుతుంది. బుధవారం ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) సమావేశం నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న రెపో రేటును 0.35 శాతం పెంచినట్టు గవర్నర్ చెప్పారు. గత సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో వడ్డీరేట్లను 5.40 శాతం నుంచి 5.90 శాతానికి పెంచారు. 6 ఎంపిసి సభ్యులలో ఐదుగురు రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేయగా, 6 మంది సభ్యులలో నలుగురు అనుకూల వైఖరి ఉపసంహరణకు ఓటు వేశారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య విధాన సమావేశం జరుగుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి సమావేశం ఏప్రిల్‌లో రెపో రేటు 4 శాతం వద్ద ఉంది. అయితే మే 2, 3 తేదీల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఆర్‌బిఐ రెపో రేటును 0.40 శాతం నుంచి 4.40 శాతానికి పెంచింది. దీని తరువాత జూన్‌లో రెపో రేటును 0.50 శాతం పెంచడంతో 4.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ఆగస్టులో 0.50 శాతం పెరగ్గా, సెప్టెంబర్‌లో మరో పెంపుతో వడ్డీ రేట్లు 5.90 శాతానికి పెరిగాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు 6.25 శాతానికి చేరాయి. ఇటీవల ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అక్టోబర్ నెలలో 6.77 శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌లో ఇది 7.41 శాతంగా ఉంది. ఇక అక్టోబర్ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత (డబ్లుపిఐ) ద్రవ్యోల్బణం 8.39 శాతానికి తగ్గింది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 10.70 శాతంగా నమోదైంది. గత నెలల్లో ఆర్‌బిఐ తీసుకున్న చర్యలే ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని పేర్కొంది.

ఆర్‌బిఐ అదనపు సమావేశం

గత రోజుల్లో అంటే నవంబర్‌లో ఆర్‌బిఐ అదనపు ద్రవ్య విధాన సమావేశాన్ని కూడా నిర్వహించింది. వాస్తవానికి 9 నెలల పాటు ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బిఐ 2 శాథం పరిధికి వెలుపల ఉంది. ఈ కారణంగా ఆర్‌బిఐ తీసుకున్న చర్యలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి వచ్చింది. ఈ నెల 5 నుంచి 7 తేదీల్లో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎంపిసి సభ్యులు డాక్టర్ మైఖేల్ దేవవ్రత్ పాత్ర, రాజీవ్ రంజన్, శశాంక్ బిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ హాజరయ్యారు.

ఆర్‌బిఐ రెపో రేటును ఎందుకు పెంచుతోంది?

ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు ఆర్‌బిఐకి శక్తివంతమైన సాధనం రెపో రేటు పెంచడమే. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, రెపో రేటును పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించడానికి ఆర్‌బిఐ ప్రయత్నిస్తుంది. రెపో రేటు ఎక్కువగా ఉంటే ఆర్‌బిఐ నుంచి బ్యాంకులు పొందే రుణం ఖరీదు అవుతుంది. దీంతో బ్యాంకులు తమ ఖాతాదారులకు రుణాలను ఖరీదైనవిగా చేస్తాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం తగ్గుతుంది. ద్రవ్య ప్రవాహం తక్కువగా ఉంటే డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ ప్రతికూల దశలో ఉన్నప్పుడు ఆర్‌బిఐ రెపో రేటును తగ్గిస్తుంది.

ప్రస్తుత రుణంపై ఇఎంఐ పెరుగుతుందా?

రుణాలకు ఫిక్స్‌డ్, ఫ్లోటర్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉన్నాయి. ఫిక్స్‌డ్‌లో లోన్ వడ్డీ రేటు ప్రారంభం నుండి ముగింపు వరకు అలాగే ఉంటుంది. రెపో రేటులో మార్పులు చేసినా స్థిరంగా కొనసాగిస్తారు. అదే సమయంలో ఫ్లోటర్‌లో రెపో రేటులో మార్పు చేస్తే మీ లోన్ వడ్డీ రేటు ప్రభావితం అవుతుంది. అందువల్ల ఫ్లోటర్ వడ్డీ రేటుపై రుణం తీసుకున్నట్లయితే ఇఎంఐ కూడా పెరుగుతుంది.

మరోసారి పెంపు ఉండొచ్చు: మోతీలాల్ ఓస్వాల్

వ్యూ, చీఫ్ ఎకనామిస్ట్, మోతీలాల్ ఓస్వాల్, నిఖిల్ గుప్తా మాట్లాడుతూ, ’అంచనా ప్రకారం పాలసీ వడ్డీ రేట్లు 35 బేసిస్ పాయింట్లు పెరిగాయి, రెపో రేటును 6.25%, ఎస్‌డిఎఫ్ 6%కి తీసుకుంది. దీంతో పాటు ధరల పెరుగుదలపై పోరాటం కొనసాగిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ విధంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో 25బిపి పెంపుదల ఉంటుందని స్పష్టమైంది.

ముఖ్యాంశాలు..

ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది.

వచ్చే 12 నెలల పాటు ద్రవ్యోల్బణం 4 శాతానికి పైనే ఉండే అవకాశం ఉంది.

2022-23 ద్రవ్యోల్బణం అంచనా 6.7 శాతం వద్ద ఉంది.

2022-23 జిడిపి వృద్ధి అంచనా 7% నుండి 6.8%కి తగ్గింది.

గ్రామీణ డిమాండ్ మెరుగుపడుతోంది.

లిక్విడిటీకి సంబంధించి ఎలాంటి సమస్యను ఆర్‌బిఐ అనుమతించదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News