Home తాజా వార్తలు రూ.1000 మించి విత్‌డ్రా చేయొద్దు

రూ.1000 మించి విత్‌డ్రా చేయొద్దు

 PMC

 

పిఎంసి బ్యాంక్‌పై ఆర్‌బిఐ ఆంక్షలు

ముంబై : ముంబైకి చెందిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్(పిఎంసి బ్యాంక్)పై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇతర డిపాజిట్లలో ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువగా విత్‌డ్రా చేయకూడదని ఆదేశించింది. బ్యాంకు నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకోవడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, సెక్షన్ 35 ఎ కింద ఈ చర్య తీసుకున్నట్టు ఆర్‌బిఐ మంగళవారం జారీ చేసిన ఒక నోటీసులో పేర్కొంది. 2019 మార్చి నాటికి పిఎంసి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.11,600 కోట్లుగా ఉన్నాయి. దీనిలో డిమాండ్ డిపాజిట్లు రూ.2300 కోట్లు, మిగతా బ్యాలెన్స్ టర్మ్ డిపాజిట్లు ఉన్నాయి.

ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం డిపాజిటర్లు, ఖాతాదారులు వెయ్యి రూపాయలుమాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉందని బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రధానంగా ముంబై బ్రాంచ్ వద్ద కస్టమర్లు ఆందోళనకు దిగారు. పండుగ సీజన్ సమయంలో నగదు ఉపసహంరణపై ఆంక్షల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య జనులపై తీరని భారమని పేర్కొన్నారు.

తాను 3లక్షల ఆర్‌డి డిపాజిట్ చేశానని, ఇపుడు వెయ్యి రూపాయలకు మించి డ్రా చేయకూడదంటే తన కుమార్తె ఫీజు ఎలా కట్టాలని ఒక ఖాతాదారుడు వాపోయాడు. గడుపులోపే పరిస్థితిని చక్కదిద్దుతామని పిఎంసి బ్యాంకు ఎండి జాయ్ థామస్ వినియోగదారులకు రాసిన ఒక లేఖలో వివరణ ఇచ్చారు. ఇది డిపాజిటర్లకు, కస్టమర్లకు కష్టమైందంటూ క్షమాపణలు చెప్పారు. 1984లో ముంబైలో ప్రారంభమైన ఈ బ్యాంకు పలు రాష్ట్రాల్లో 137 బ్రాంచ్‌లతో తన సేవలను అందిస్తోంది.

RBI Restrictions on PMC bank