Saturday, April 20, 2024

ఆర్‌బిఐ ఔషధం!

- Advertisement -
- Advertisement -

RBI

 

మంచాన పడిన వృద్ధి రేటు పుంజుకునేలా చేయడానికి ఎందుకూ పనికిరాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై నిపుణులు పెదవి విరిచిన తర్వాత కేంద్రం ఆ బాధ్యతను రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) భుజస్కంధాల మీద పెట్టినట్టున్నది. గురువారం నాడు జరిగిన ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ తాజా సమావేశం ఈ దిశగా చాకచక్యంగా వ్యవహరించింది. అదే పనిగా రెపో (బ్యాంకులకు ఆర్‌బిఐ ఇచ్చే డబ్బుపై వడ్డీ రేటు) రేట్లు తగ్గిస్తూపోడం వల్ల ద్రవ్యోల్బణం రెచ్చిపోతున్నదనే విమర్శను దృష్టిలో ఉంచుకొని ఆ రేట్లను యథాతథంగానే ఉంచాలని వరుసగా రెండోసారి నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి వృద్ధి రేటు పుంజుకునేలా చేయడానికి అవసరమైతే రెపో రేటును ముందు ముందు తగ్గించే అవకాశం లేకపోలేదని చెప్పి ఒకింత ఆశను మిగిల్చింది. వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు రెపో రేటును పలుదఫాల్లో (ఐదు సార్లు) మొత్తం 135 పాయింట్లను తగ్గించింది.

అయినా ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు. వృద్ధి రేటు ఊర్ధ ముఖం పట్టలేదు. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు కూడా అంగీకరించింది. రెపో రేటు తగ్గించిన మేరకు తమకు లభించిన ప్రయోజనాన్ని బ్యాంకులు రుణ గ్రహీతలకు పూర్తిగా బదలాయించాయో లేదో గాని తయారీ రంగం మాత్రం కోలుకోలేదు. ఇంకొక వైపు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తూనే ఫిక్సిడ్ డిపాజిట్ల(ఎఫ్‌డి) పై ఇచ్చే వడ్డీని కూడా బ్యాంకులు కోసివేశాయి. దీని వల్ల సీనియర్ సిటిజన్లు తీవ్రంగా నష్టపోయారు. ఎఫ్‌డిల్లోకి డబ్బు రాకడ కూడా తగ్గిపోయింది. ఎన్ని చేసినా వృద్ధి రేటు పెరగలేదని ఒప్పుకున్న రిజర్వు బ్యాంకు వర్తమాన ఆర్థిక సంవత్సరం (2019 2020) చివరి మూడు మాసాల కాలపు చిల్లర ద్రవ్యోల్బణం 6.5 శాతం వద్ద ఉండగలదని ప్రకటించింది. గత డిసెంబర్‌తో ముగిసిన కిందటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరుకొని హడలెత్తించింది. ఇందులో పెద్ద మారు ఉండబోదని ఇప్పుడు ఆర్‌బిఐ చేసిన ప్రకటన స్పష్టం చేస్తున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5 శాతానికి మించదని ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ అన్ని కారణాల వల్ల బ్యాంకులకు ఇచ్చే డబ్బుపై వడ్డీ రేటును (రెపో) యథాతథంగా 5.15 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో బ్యాంకులకు రుణగ్రహీతలకు వెసులుబాటు కలిగించడానికి కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయల వరకు ప్రస్తుత రెపో రేటు మీదనే దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీని వల్ల బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత పెరిగి కుంగిపోయి ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అదనపు రుణ సదుపాయాలు కలిగించడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా గృహ నిర్మాణ రంగానికి, కార్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే వచ్చే జులై 31 వరకు రీటైల్ రుణాలు ఇవ్వడానికి ఉపయోగించే డిపాజిట్లకు సంబంధించి ఉంచవలసిన నగదు నిల్వ కిమ్మత్తు నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించింది.

ఇది కూడా మార్కెట్‌కు బ్యాంకు రుణాల అందుబాటును మెరుగుపరుస్తుంది. అయితే ఈ సదుపాయాలను బ్యాంకులుగాని, రుణగ్రహీతలు గాని వినియోగించుకోవాలంటే వివిధ ఉత్పత్తులకు ప్రజల నుంచి డిమాండ్ పెరగవలసి ఉంది. అది వారి కొనుగోలు శక్తిని బట్టి ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందనే విషయం తెలిసిందే. దానిని గణనీయంగా పెంచడానికి అవసరమైన చర్యలే ఇప్పుడు కనిపించడం లేదు. అందుకు ఏకైక మార్గం మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఇదే చేశాయి. నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీసిన ప్రముఖ కార్ల కంపెనీల వంటి వాటికి అదనపు నిధులు సమకూర్చాయి.

మౌలిక సదుపాయాలను పెంచడానికి, విస్తరింప చేయడానికి పెట్టే ఖర్చు సాధారణ ప్రజలకు, శ్రమజీవులకు నగదును అదనంగా సమకూరుస్తుంది. దానితో వారు పెట్టే ఖర్చు పెరుగుతుంది. అది తయారీ రంగాన్ని ఉత్తేజపరుస్తుంది. కొత్త బడ్జెట్‌లో కేంద్రం ద్రవ్యలోటును స్వల్పంగా తగ్గించినందుకే స్టాక్ మార్కెట్ అలిగింది. ద్రవ్యలోటు అదుపులో ఉంచుతున్నామని, అప్పులు తగ్గించుకుంటున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తన ఖర్చును తెగ కోస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు చౌకగా అప్పజెప్పి ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు పురిగొల్పి నిరుద్యోగాన్ని పెంచుతోంది. అయినా కూలబడిన ఏనుగును తలపిస్తున్న ఆర్థిక రంగాన్ని పైకి లేపడానికి ఆర్‌బిఐ తీసుకున్న వినూత్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

RBI steps to strengthen the financial sector
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News