Home తాజా వార్తలు రాజస్థాన్‌కు పరీక్ష.. నేడు బెంగళూరుతో పోరు

రాజస్థాన్‌కు పరీక్ష.. నేడు బెంగళూరుతో పోరు

RCB vs Rajasthan Royals Match Today

 

దుబాయి: నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రాజస్థాన్ రాయల్స్‌కు నెలకొంది. ఢిల్లీపై సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను రాజస్థాన్ చేజార్చుకుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిన పరిస్థితి రాజస్థాన్‌కు ఏర్పడింది. కాగా నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో జట్టు తడబడుతోంది. సంజు శాంసన్, జోస్‌బట్లర్, బెన్‌స్టోక్స్, స్మిత్ వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు.

అయినా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడంలో జట్టు విఫలమవుతోంది. కిందటి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా రాజస్థాన్ విఫలమైంది. ఇక బెంగళూరు వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం అనుకున్నంత తేలికకాదు. మరోవైపు కిందటి మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సేనకు పరాజయం ఎదురైంది. అయితే ఇప్పటికే ఐదు విజయాలు సాధించిన బెంగళూరు నాకౌట్ అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి దీన్ని మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. డివిలియర్స్, పడిక్కల్, కోహ్లి, ఫించ్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. దీంతో బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

RCB vs Rajasthan Royals Match Today