Thursday, April 25, 2024

గాలి కుటుంబంలో చిచ్చు: వదినపై మరిది పోటీ !

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని మైనింగ్ దిగ్గజం గాలి జవార్దన రెడ్డి సోదరుడు, బిజెపి శాసనసభ్యుడు గాలి సోమశేఖర రెడ్డి గురువారం స్పష్టం చేశారు. తాను కొత్తగా ఏర్పాటు చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కెఆర్‌పిపి) తరఫున తన భార్య అన్నలక్ష్మి బళ్లారి సిటీ నియోజ్క వర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ గాలి జనార్దన రెడ్డి ఇటీవల ప్రకటించిన దరిమిలా సోమశేఖర రెడ్డి కూడా తన అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చారు. తన వదినఅభ్యర్థిగా ఉన్నప్పటికీ తాను పోటీ నుంచి తప్పుకునేది లేదని సోమశేఖర రెడ్డి ప్రకటించారు.

గాలి జనార్దన రెడ్డి మద్దతు లేనప్పటికీ బళ్లారి స్థానంలో తాను గెలుపొందగలనని, 2018లో ఆయన మద్దతు లేకుండానే తాను గెలిచానని సోమశేఖర రెడ్డి తెలిపారు. తాను చేసిన పనులే తనను కాపడతాయని ఆయన అన్నారు. కొత్త పార్టీలో చేరవలసిందిగా తనకు ఆహ్వానం వచ్చిందని, కాని తాను నిరాకరించానని ఆయన చెప్పారు. దీంతో కోపం వచ్చిన జనార్దన రెడ్డి తన భార్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని, ఇది తాను ఊహించిందేనని ఆయన తెలిపారు.

ఇలా ఉండగా సొంత పార్టీ పెట్టాలని గాలి జనార్దన రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో కలతలు రేపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జనార్దన్ రెడ్డి సోదరులు సోమశేఖర రెడ్డి, కరుణాకర రెడ్డి బిజెపిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అన్న స్థాపించిన పార్టీలో చేరి కొత్త సమస్యలను కొనితెచ్చుకోవడం ఎందుకుని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా..జనార్దన రెడ్డి మిత్రుడు, ప్రస్తుతం బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న బి శ్రీరాములు మాత్రం బిజెపిలో కొనసాగాలా లేక తన మిత్రుడి పార్టీలో చేరాలా అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News