Home లైఫ్ స్టైల్ రీసేల్ ప్లాట్లకు రియల్ డిమాండ్

రీసేల్ ప్లాట్లకు రియల్ డిమాండ్

real-estate

శరవేగంగా విస్తరిస్తున్న విశ్వనగరం
శివారుప్రాంతాలవైపు నగరవాసుల పయనం
నిర్మాణ అనుమతులకు 33 శాతం
అపరాధ రుసుం

బహుళ అంతస్తుల సంస్కృతి కనుమరుగవుతోంది. వ్యక్తిగత ఇళ్ళకు ప్రాధాన్యత పెరుగుతోంది. నగరంలో నివసించాలనే ఆసక్తి తగ్గుతోంది. శివారులో స్థిరపడేందుకు మొగ్గుచూపుతోంది. ఇదీ నగర వాసుల్లో బలంగా కనిపిస్తున్న మార్పు. ఫలితంగా శివారు ప్రాంతాల పాతలేఅవుట్లలోని ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ వస్తున్నది. దీంతో రీసేల్ ప్లాట్లకు భలే గిరాకీ ఏర్పడుతున్నది. వెంటనే ఇళ్ళు నిర్మించుకోవాలనే ఉద్దేశ్యం లేకున్నా… వచ్చే రెండు మూడేళ్ళలో ఇంటిని నిర్మించుకోవాలనే యోచన చేస్తున్నవారు వీటికి ప్రాధాన్యతనిస్తున్నారు. రీసేల్ చేస్తున్న ప్లాట్లతో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అధికలాభాన్ని ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా శంకర్‌పల్లి-, మేడ్చెల్,- ఘట్‌కేసర్,- శంషాబాద్, ఆదిభట్ల – మేడిపల్లి-, అమీన్‌పూర్-, నార్సింగి ప్రాంతాలవైపు నగర వాసులు దృష్టిసారించారు. ఇదే అదనుగా భావించిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, మధ్యవర్తులు పాత ప్లాట్లకు వాస్తవ ధరలను రెండింతలుగా పెంచేశారు. అయినా, కొనుగోలుదారులు ఆగడంలేదు. పాతలేఅవుట్లకు అనుమతులున్నాయా..? లేవా..? ఎల్‌ఆర్‌ఎస్ తీసుకున్నారా..? లేదా..? అనే విషయాలను కూడా పక్కనబెట్టి మరీ ఖరీదు చేసుకుంటున్నారు.

ఎందుకు డిమాండ్..?ఔటర్ రింగ్‌రోడ్(ఓఆర్‌ఆర్) లోపల హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నది. పట్టణీకరణ పెరుగుతోంది. అందుబాటులోకి మెరుగైన రవాణా సదుపాయాలు, ఓఆర్‌ఆర్ లోపల ఉన్న గ్రామాలు, పట్టణాలకు జలమండలి తాగునీరందించే పథకం, కాలుష్య రహిత వాతావరణం, బోర్లకు అందుబాటులో భూగర్భ జలాలు ఫలితంగా శివారు ప్రాంతం శరవేగంగా విస్తరిస్తున్నది. దీనికి తోడు శివారులోని మేజర్ గ్రామపంచాయితీలను పురపాలక సంఘాలుగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పిల్లల చదువులకు అందుబాటులో ప్రైవేట్ పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ఉండటం ఓ కారణం. వీటన్నింటినీ గమనిస్తున్న నగరానికి సమీసంలో 50 నుండి 65 కి.మీ.ల పరిధిలోని పల్లె, పట్టణవాసులు శివారుపై దృష్టిసారించారు. చిరు ఉద్యోగులు, వ్యవసాయదారులు, సాధారణ వ్యాపారులు, పిల్లల కోసం వ్యవసాయంతో కూడబెట్టిన వారు, వ్యవసాయ భూములు విక్రయించిన వారు తమతమ నిధులతో ఓ ప్లాటును తీసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఫలితంగా రీసేల్ ప్లాట్లు హాట్‌కేక్‌ల్లాగా అమ్ముడుపోతున్నాయి. శివారుకు చేరువగా దేవాలయాలైన చిలుకూరు, కీసర, యాదగిరిగుట్ట, సంఘి దేవాలయం వంటివి ఉండటంతోపాటు జలాశయాలైన గండిపేట్, హిమాయత్‌సాగర్, అమీన్‌పూర్, శామీర్‌పేట్ లేక్‌లు ఉన్నాయి. దీంతో రీసేల్ ప్లాట్లను ఖరీదు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఇళ్ళు పెరుగుతూనే ఉన్నాయి. రెండు మూడేళ్ళలో సొంతిల్లును నిర్మించుకుని ఉండే పరిస్థితులు ఏర్పడుతుండటంతో నగరవాసులే కాకుండా పల్లెలు, పట్టణ వాసులు శివారులోని రీసేల్ ప్లాట్లను తీసుకుంటున్నారు. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది.
మంజూరవుతున్న అనుమతులు:శివారులోని రీసేల్ ప్లాట్లకు అంటే 28.10.2015కు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు లేదా లింకుడాక్యుమెంట్‌లు అయినా ఈ గడువుకు ముందుగా రిజిస్ట్రేషన్ జరిగిన ప్లాట్లకు హెచ్‌ఎండిఎ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్నది. ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా ఈ గడువుకు ముందుగా కొనుగోలు చేసిన వారికి భవన నిర్మాణ అనుమతులను 33 శాతం అదనపు రుసుంలను వసూలు చేస్తూ మంజూరు చేస్తున్నది. దీంతో రీసేల్ ప్లాట్లను అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసినా, ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా ఖరీదు చేసినా ఇబ్బందులు లేకపోవడంతో చాలా మంది శివారులోని రీసేల్ ప్లాట్లను ఖరీదు చేస్తున్నారు. దీనికి తోడు హెచ్‌ఎండిఎ శివారులోని గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నది. నూతనంగా రహదారులను ఏర్పాటు చేస్తున్నది. కిస్మత్‌పూర్‌లో ఫ్లైఓవర్ బ్రిడ్జి, మైలార్‌దేవ్‌పల్లి నుండి మామిడిపల్లి వరకు విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ రోడ్డు, నాగోల్ నుండి కొర్రెంల మీదుగా ఘట్‌కేసర్ వరకు రహదారిని నిర్మిస్తున్నది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌లో రహదారుల అభివృద్ధిని చేపట్టింది
మధ్యవర్తులకు మంచిరోజులు:శివారు ప్రాంతాలవైపు ఇటు నగరవాసులు, అటు పల్లె-పట్టణ ప్రాంతాలవారు దృష్టిసారించడంతో రియల్‌ఎస్టేట్ రంగంలో మధ్యవర్తులకు మంచి రోజులు వచ్చాయి. ఫలితంగా రీసేల్ ప్లాట్లకు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ లోపల చదరపు గజం కనీసంగా రూ. 7 -నుండి 25 వేలు పలుకుతుంది. గత 5 -నుండి 10 ఏండ్ల క్రితం రూ. 500 -నుండి రూ.1500గా కొనుగోలు చేసిన ప్లాట్లకు కొన్నిచోట్లలో కనీసం హద్దురాళ్లు కూడా లేకుండా, పిచ్చిమొక్కలు, పొదలు వెలసిన వాటిని గుర్తించిన మధ్యవర్తులు వాటి యజమానుల చిరునామా తెలుసుకుని ఒప్పందం చేసుకుంటున్నారు. వాటికి తిరిగి హద్దురాళ్లు పాతడం, సాఫ్‌గా చేసి విక్రయిస్తున్నారు. వాస్తవంగా మార్కెట్‌లో ప్లాట్ల ధరలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోకుండానే ప్లాట్ల యజమానులు మధ్యవర్తులకు ఏదో ఒక ధరకు ఒప్పందం చేస్తున్నట్టు ప్రచారంలో ఉన్నది. వాటికి ధరలను మూడింతలు చేస్తూ రియల్ మధ్యవర్తులు అమ్మకాలు జరుపుతున్నారు. ఫలితంగా ప్లాట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. యజమానులకు సాధారణ లాభాలున్నాయి.
ఆసక్తితో మేస్త్రీలు:ఇటీవల చాలామంది శివారు ప్రాంతపు మేస్త్రీలు బిల్డర్లుగా అవతారమెత్తుతున్నారు. వ్యక్తిగత ఇండ్లను నిర్మించి విక్రయాలు చేపడుతున్నారు. దీంతో వీరు రీసేల్ ప్లాట్లను సేకరిస్తున్నారు. ఒకేమారు 5 ప్లాట్లుగా తీసుకోవడం, వాటిల్లో వ్యక్తిగత ఇళ్లను కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఏర్పాటుచేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఫలితంగా కూడా రీసేల్ వాటికి విపరీతంగా గిరాకీ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఘట్‌కేసర్, నారపల్లి, మేడిపల్లి, బోడుప్పల్, పర్వతాపూర్, ఆధిభట్ల, నాథర్‌గూల్, నార్సింగి, హైదర్షాకోట్ల, మొయినాబాద్, అమీన్‌పూర్, పటాన్‌చెరు, దుండిగల్, డి.పోచంపల్లి, శామీర్‌పేట, కీసర, రాంపల్లి, కొండాపూర్, దమ్మెరపోచంపల్లి, నిజాంపేట్, బౌరంపేట, శంషాబాద్, హయత్‌నగర్‌ల పరిధిలోని ఇతర ప్రాంతాల్లో రీసేల్ ప్లాట్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
ధరలు ఇలా:నగర శివారులో ముఖ్యంగా శంకర్‌పల్లి, శంషాబాద్, మేడ్చెల్, ఘట్‌కేసర్, హయత్‌నగర్ పరిధిలో కనీసంగా రూ.8 వేలు నుండి రూ. 25 వేలుగా ఉన్నది. వీటిల్లో రోడ్డుముఖం ప్లాట్లను, ప్రధాన రహదారిని, వీధి రోడ్లను పరిగణనలోకి తీసుకుని ధరలు హెచ్చుతగ్గులున్నాయి. అధిక శాతం మంది ఉత్తరం ముఖమున్న ప్లాట్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. అనంతరం తూర్పు, పడమర ప్లాట్లకు ఆసక్తిని కనబరుస్తున్నారు. చివరగా దక్షిణ ప్రాంత రోడ్డు ప్లాట్లకు చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది.
తస్మాత్ జాగ్రత్త…!:నగర శివారు ముఖ్యంగా ప్రధానంగా శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, షాబాద్, కొత్తూరు, గండిపేట్ మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో 111 జీఓ అమలులో ఉన్నది. ఈ జీఓ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో భవన నిర్మాణ అనుమతులు మంజూరు ఉండదు. లేఅవుట్లకు కూడా అనుమతులు ఇవ్వరు. ఎల్‌ఆర్‌ఎస్ చేయరు. ఈ మండలాల పరిధిలో ప్లాట్లను కొనుగోలు చేసేవారు ఈ జిఓ వర్తిస్తుందా లేదా విచారణ చేసి తీసుకోవాలి. లేనిపక్షంలో పలు రకాల సమస్యలు ఎదురయ్యే అవాకాశాలు అధికంగా ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతు లు వస్తాయా… ? రావా..? అనే విషయాలను హెచ్‌ఎండిఎ అధికారుల ద్వారా తెలుసుకుని ప్లాట్లను ఖరీదు చేయడం శ్రేయస్కరం. మధ్యవర్తుల మాటలు విని, తొందరపడి, ధరలు తక్కువగా ఉన్నాయని ప్లాట్లను తీసుకోవడం వల్ల సమస్యలు తప్పవని అధికారులు వెల్లడిస్తున్నారు. 111జిఓ పరిధిలో లేని గ్రామాల్లో ప్లాట్లను, 28.10.2015కు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను కొనుగోలు చేయడం వల్ల సమస్యలు రావు.

మంచె మహేశ్వర్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో