Home కెరీర్ రీజినల్ వైపు రియల్టర్ల చూపు

రీజినల్ వైపు రియల్టర్ల చూపు

 Real estate business towards jobs, employment and transportation facilities

ఉద్యోగం, ఉపాధి, రవాణా సదుపాయాలున్న ప్రాంతాల వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా విస్తరిస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు రియల్టర్ల దృష్టి రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) వైపు మళ్ళింది. ఆ ప్రాంతీయ రహదారి వెంట ఉన్న పట్టణాల చుట్టూర రియల్ వ్యాపారం మెల్లమెల్లగా వేళ్ళూనుకుంటోంది. ఈ రహదారి ప్రధానంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులను కలుపుకుంటూ వెళ్ళడంతో మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానున్నది. దీనికి తోడు ప్రాంతీయ రహదారిని ఆనుకుని ఉన్న పట్టణాలు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతివైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా పట్టణాల చుట్టూరా వెంచర్లు, లేఅవుట్లను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు.

రీజినల్ రింగ్ రోడ్ పొడవు 335 కి.మీ.లు, వెడల్పు ఇప్పటి వరకు 300 అడుగులుగా ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ రోడ్డు వెడల్పు 500 అడుగులుగా ఉండాలని ప్రకటించారు. ప్రధానంగా బెంగళూరు, ముంబై, విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులు వెళ్ళడం, ఆ పట్టణాలను ఆనుకుని మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమలు నెలకొని ఉండటం రియల్ వ్యాపారానికి బాగా కలిసొచ్చే వాతావరణం. ఈ పట్టణాల్లో రియల్ వ్యాపారానికి అవసరమయ్యే  వాతావరణంగా చెప్పుకునే ఉద్యోగం, ఉపాధి, రవాణా సదుపాయాలు అధికంగా ఉన్నాయి. దీంతో రియల్టర్లు నగర శివారులోని పట్టణాల వైపు దృష్టిని కేంద్రీకరించారు.

రహదారి పొడవు

రహదారి పొడవు 335 కి.మీ.లు. 125 గ్రామాలున్నాయి. తూఫ్రాన్  మల్కాపూర్  93.65 కి.మీ.లు. మల్కాపూర్  షాద్‌నగర్  78.15 కి.మీ.లు. షాద్‌నగర్  కౌలంపేట్  68.15 కి.మీ.లు. కౌలంపేట్  తూఫ్రాన్  50 కి.మీ.లు. అనే నాలుగు విభాగాలుగా రీజినల్ రింగ్ రోడ్‌ను విభజించారు. ఈ రహదారి వెంట ప్రధానంగా ఇబ్రహీంపట్నం, బీబీనగర్, బొమ్మల రామారాం, ములుగు, కొత్తూరు, షాద్‌నగర్, మల్కాపూర్, తూఫ్రాన్, శివంపేట్, నర్సాపూర్, శంకర్‌పల్లి, చేవెళ్ళ, షాబాద్, ఫరూఖ్‌నగర్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా 25 స్సైనల్ రోడ్లున్నాయి. ఈ గ్రామాలకు చెందిన వారు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు, పట్టణ ప్రాంతవాసులు నగర శివారులో ప్లాట్లను ఖరీదు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో వ్యక్తిగత ఇళ్ళను తీసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వారి గ్రామాల్లోని ఎకరాలుగా ఉన్న భూములను రియల్టర్లకు విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో ఇండ్లను కొనుగోలు చేయడంపై దృష్టిసారించారు.

పట్టణాల దిశగా : ఈ ప్రాంతీయ వలయ రహదారి వెంట పట్టణాలతో పాటు మొత్తం 125 గ్రామాలున్నాయి. అందులో పురపాలక సంఘాలు, మేజర్ గ్రామపంచాయితీలు ఉన్నాయి. ముఖ్యంగా షాద్‌నగర్, కొత్తూరులు ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతివైపు అడుగులు వేస్తున్నాయి. షాద్‌నగర్, కొత్తూరు చుట్టూర 40 వరకు పరిశ్రమలు ఉండటంతో పాటు బెంగళూరు జాతీయ రహదారి, ఇప్పుడు ప్రాంతీయ రహదారి ఉండటంతో రియల్ వ్యాపారం ఇక్కడ మూడుపువ్వులు ఆరు కాయలుగా శరవేగంగా విస్తరిస్తుంది. షాద్‌నగర్ , కొత్తూరు పరిధిలో సుమారు 5 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారని, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నవి. జాన్సన్ అండ్ జాన్సన్ 47 ఎకరాల్లో సుమారు రూ. 400 కోట్ల వ్యయంతో పరిశ్రమను నెలకొల్పింది.

ప్రొక్టర్ అండ్ గ్రాంబుల్ సబ్బులు, టైడ్, ఏరియల్ తయారీలో 2 వేలమంది వరకు పనిచేస్తున్నారు. అమేజాన్ వంటి సంస్థలతో పాటు మరిన్ని కూడా ఉన్నాయి. ఇవి త్వరలో మరింత విస్తరించే యోచన చేస్తున్నాయి. తద్వారా ఉద్యోగాలు మరిన్ని పెరిగి ఇక్కడ పనిచేసే వారి సంఖ్య అధికంగా ఉండటంతో ఇక్కడ రియల్ వ్యాపారానికి మంచి డిమాండ్ చేకూరనున్నది. షాద్‌నగర్, కొత్తూరు హైదరాబాద్ మహానగరానికి సుమారు 48 కి.మీ.లు, శంషాబాద్ నుండి 38 కి.మీ.లుగా ఉన్నది. దీంతో చాలా మంది ఉద్యోగులు షాద్‌నగర్, కొత్తూరు వైపు దృష్టిసారించారు. నగరంలో ట్రాఫిక్, కాలుష్యం సమస్యల నేపథ్యంలో శివారుగానే భావించే షాద్‌నగర్ పరిసరాల వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక్కడ భూగర్భజలాలు అధికంగా ఉండటం, పచ్చదనం, కాలుష్య రహిత వాతావరణం ఉండటంతో ఉద్యోగులు చాలా వరకు అటుగా యోచిస్తున్నారు. త్వరలోనే జూపార్కు, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ అమ్యూజ్‌మెంట్ పార్కును కూడా ఈ ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి.

పరిశ్రమల చెంతనే
రీజినల్ రింగ్ రోడ్‌కు ఆనుకుని ఉన్న చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, కంది, సంగారెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, భువనగిరి బీబీనగర్, చౌటుప్పల్ వైపు రియల్ వెంచర్లు విరివిగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా భువనగిరి బీబీనగర్ ఘట్‌కేసర్ ప్రాంతాలవైపు రియల్టర్లు ఆసక్తిని చూపుతున్నారు. ప్రధానంగా వరంగల్ జాతీయ రోడ్డు రవాణా సదుపాయంతో పాటు రైల్వే రవాణా సౌలభ్యం ఈ మార్గంలో ఉన్నది. దీనికి తోడు భువనగిరి, బీబీనగర్ పరిధిలో బాంబినో, ఏచర్ వంటి పరిశ్రమలతోపాటు ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు15 వరకున్నాయి. ఇక్కడ సుమారు 2500 మంది పలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలు నగరానికి ఆనుకుని ఉన్నట్టుగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా కంది, సంగారెడ్డి వైపు కూడా రియల్ వ్యాపారులు దృష్టిసారించారు. ప్రధానంగా ముంబై రహదారి ద్వారా రవాణా సదుపాయాలున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఐఐఐటి క్యాంపస్ ఉండటంతో అధికంగా వెంచర్లు వెలిశాయి.

పెరుగుతున్న ధరలు
రీజినల్ రింగ్ రోడ్ ప్రకటన వెలువడక ముందుగా ఈ ప్రాంతాల్లో రూ. 10 లక్షలకు ఎకరంగా ఉన్న భూములు ఇప్పుడు కనీసంగా రూ. 25 లక్షలకు ఎకరంగా పెరిగిపోయాయి. వందల ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కంది వైపు అధికంగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, గ్రూప్‌హౌసింగ్‌లు వెలుస్తున్నాయి. షాద్‌నగర్ ప్రాంతంలో కనీసం ఎకరం ధర రూ. 25 లక్షలుగా పెరిగాయి. భువనగిరి ప్రాంతంలో రూ. 50 లక్షలుగా ఉన్నది. రెండుమూడు కి.మీ.లు లోపలకు వెళ్ళితే రూ, 25 లక్షలు పలుకుతున్నవి. గత రెండేళ్ళ క్రితం రూ. 10 లక్షలుగా ఉండేది. అనుమతులు ఉన్న లేఅవుట్లలో చ.గ.లు రూ. 4 వేలు నుండి మొదలవుతోంది. అయితే, చాలా మంది హెచ్‌ఎండిఎ నుండి అనుమతులు తీసుకుని లేఅవుట్లను ఏర్పాటు చేయడం విశేషం. కొందరు అనుమతి లేకుండా లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గమనించాల్సిన పరిస్థితి ఉన్నది. చౌకగా వస్తున్నవని ప్లాట్లను అక్రమలేఅవుట్లలో కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో పలురకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాస్తంత ధర ఎక్కువైనా అనుమతులున్న లేఅవుట్లలోనే ప్లాట్లను ఖరీదుచేయడం శ్రేయస్కరం. భవిష్యత్తులో రుణాలు, అనుమతులు తేలికగా రావాలంటే అధికారిక అనుమతులు తీసుకున్న వాటికి ప్రాధాన్యతనివ్వాల్సి ఉన్నది.

అమలులోకి వచ్చిన రెరా
ప్రస్తుతం తెలంగాణ పరిధిలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్(రెరా) అమలులోకి వచ్చింది. ప్రతి లేఅవుట్, భవన నిర్మాణాలు రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. రెరా నియమనిబంధనల ప్రకారమే వెంచర్లున్నాయా..? లేవా..? అనేది అడిగి తెలుసుకోవాలి. ఒప్పందమైనా ఖరీదు చేయడమైనా రెరాలో నమోదై ఉన్నదా లేదా అనేది తెలుసుకుని తమతమ నిర్ణయాలు తీసుకోవాలి. రెరాలో నమోదై ఉన్న ప్రాజెక్టుల్లోనే ప్లాట్లు, నిర్మాణాలు కొనుగోలుచేస్తే ఖరీదుచేసుకునేవారికి భద్రత ఉంటుంది. లేదంటే పలు విషయాలపై స్పష్టత లేకుండా పోతుంది. రియల్టర్లు మాత్రం రెరాలో నమోదు చేస్తే ధరలు పెరుగుతాయని, పన్నులు అధికంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, ఎవరైనా రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లోనే తీసుకోవడం అన్ని రకాల లాభదాయకమని అధికారులు స్పష్టంగా తెలుపుతున్నారు.