Friday, March 29, 2024

అమ్మో.. అనుమతులు తీసుకుందాం!

- Advertisement -
- Advertisement -

Building permits

 

తెలంగాణ రియల్టర్లలో మార్పు
అందిన భవన నిర్మాణ దరఖాస్తులు 1,09,684
వరంగల్ అర్బన్ నుంచి అధికంగా 17,210
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు 398, లేఅవుట్లకు 69
కఠినంగా కొత్త మున్సిపల్ చట్టం 2019

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భవన నిర్మాణం, లేఅవుట్లు, భూవినియోగ మార్పిడికి దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఇటీవల కొత్త మున్సిపల్ చట్టం 2019 అమలులోకి రావడం అనుమతి లేని నిర్మాణాలు, లేఅవుట్లను నోటీసులు లేకుండానే కూల్చివేస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేయడంతో రియల్టర్లు అనుమతులు తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఇటు ప్రజల్లోనూ అనుమతులున్న వాటిని కొనుగోలు చేయడానికి మొగ్గుచూపడంతోనూ బిల్డర్లు, డెవలపర్లు, రియల్ వ్యాపారులు అధికంగా అనుమతులు పొందేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,09,684 భవన నిర్మాణ అనుమతులకు, 69 లేఅవుట్ల మంజూరుకు, 75 భూవినియోగ మార్పిడికి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్‌కు 398 దరఖాస్తులు వచ్చాయి. దీనికి తోడు పురపాలక వాఖ పరిధిలోని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రి ప్లానింగ్(డిటిసిపి) అధికారులు ప్రత్యేకంగా జిల్లాల వారిగా పర్యవేక్షణ చేపడుతున్నారు. త్వరలోనే జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని కెటిఆర్ ఈపాటికే కలెక్టర్లకు సూచనప్రాయంగా సంకేతాలు వెలువరించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో అక్రమంగా, అనుమతులు లేకుండా లే అవుట్లను, భవన నిర్మాణాలను చేపట్టేందుకు జిల్లాల పరిధిలోనూ రియల్ వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు.

1,09,684 దరఖాస్తులు..
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో మొత్తం 1,09,684 భవన నిర్మాణ అనుమతి మంజూరుకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 87,458 దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయి. షార్ట్‌ఫాల్స్ అంటే దరఖాస్తుకు మరికొన్ని దృవీకరణ పత్రాలను జతపరచాలని సమాచారాన్ని చేరవేసినవి 11,331 దరఖాస్తులుండగా, తిరస్కరించినవి 5,330 దరఖాస్తులున్నాయి. ఇందులో అత్యధికంగా వరంగల్ అర్బన్ ప్రాంతం నుంచి 17,210 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 13,013, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 10,499 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడిస్తున్నారు. లేఅవుట్లకు 69 దరఖాస్తులు అందగా అందులో 4 లేఅవుట్లకు అనుమతులు మంజూరయ్యాయి. 36 దరఖాస్తులకు షార్ట్‌ఫాల్స్ పంపగా, మరో 29 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అందిన 398 దరఖాస్తుల్లో 237 దరఖాస్తులు పరిష్కరింగా, 63 దరఖాస్తులకు షార్ట్‌ఫాల్స్ పంపించడం, 51 దరఖాస్తులను తిరస్కరించారు.

కొత్త చట్టంతో..
కొత్తగా మున్సిపల్ చట్టం 2019 అమలులోకి వచ్చిన తర్వాత అనుమతులు లేకుంటే రిజిస్ట్రేషన్ చేయరాదని, ఏదేని నీటి, విద్యుత్ కనెక్షన్‌లు మంజూరు చేయరాదని ఉండటంతో రియల్టర్లు అనుమతులకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి తోడు ఈజి ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఇఓడిబి) విధానంలో డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డిపిఎంఎస్) పద్దతి అమలులోకి వచ్చిన తర్వాత కేవలం 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తుండటంతో రియల్ వ్యాపారులు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకుని లేఅవుట్లు, భవన నిర్మాణాలను చేపడుతున్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ము న్సిపాలిటీల చైర్మన్‌లు, కార్పోరేషన్‌ల మేయర్‌లు, వార్డు సభ్యులు తమతమ బాధ్యతలను నిర్వర్తించని పక్షంలో వారిపై చర్యలు తప్పవని కొత్త మున్సిపల్ చట్టం పేర్కొనడంతో అక్రమంగా, అనుమతి లేకుండా వెలిసే నిర్మాణాలు, లేఅవట్లపై చర్యలు తప్పవనే సంకేతాలు రియల్టర్లకు చేరాయని, తద్వారా వారు అనుమతులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు.

Realtors taking Building permits
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News