Tuesday, March 21, 2023

మారుమూల ప్రాంతాల్లో పోలీసుల రెడ్ అలర్ట్

- Advertisement -

check

* సరిహద్దులో మావోయిస్టుల భారీ విధ్వంసాలు
* మావోయిస్టుల బంద్ ప్రశాంతం * ప్రాణహిత అడవుల్లో పోలీసుల గాలింపు

* అటవీ గ్రామాల్లో పోలీసుల తనిఖీలు

* అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం

మావోయిస్టుల బంద్ నేపథ్యంలో సోమవారం పోలీసులు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం అయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు తెల్లవారు జామున భారీ విధ్వంసాలకు పాల్పడిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమై మారుమూల ప్రాంతాల పోలీసు స్టేషన్‌లకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రైలు పట్టాలను తొలగించి విధ్వంసానికి పాల్పడగా ఆరు గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి. అంతే కాకుండా కిరండోల్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం పనులు చేస్తున్న ఒక ప్రొక్లెయిన్ తోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. నేటి బంద్‌ను విజయవంతం చేయాలని  పోస్టర్లు అంటించారు. అదే విధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలంలోని ఎదిరా గ్రామంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను మావోయిస్టులు పేల్చివేసిన సంఘటనల వల్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై  ప్రాణహిత శివారులోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అంతే కాకుండా ఏసిపి సీతారాములు నాయకత్వంలో పలువురు సిఐలు, ఎస్‌ఐలు, ఎసిఎస్‌పి అదనపు బలగాలతో ప్రాణహిత నది తీరంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గల కోటపల్లి, నీల్వాయి, నెన్నెల, తిర్యాణి, కౌటాల, చింతలమానపల్లి, పెంచికల్‌పేట, బెజ్జూర్, దహెగాం పోలీస్ స్టేషన్లకు భారీ భద్రత ఏర్పాటు చేసి, పోలీసులను అప్రమత్తం చేశారు. కోటపల్లి, తాండూర్, తిర్యాణి మండలాల్లోని అటవీ గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక పోలీసు బలగాలతో సందర్శించే తనిఖీలు నిర్వహించి మావోయిస్టులకు సహకరించవద్దని గిరిజనులకు సూచించారు. కొత్త వ్యక్తులు గ్రామాలకు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తాండూర్ మండలంలోని అబ్బాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో తాండూర్ సిఐ పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంతే కాకుండా పలు చోట్ల మావోయిస్టుల ఆచూకి కోసం వాహనాలను తనిఖీ చేశారు. కాగా బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జిల్లాలో జరగకపోవడంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles