Home తాజా వార్తలు ‘రెడ్’కి రియల్ హీరో రవికిషోర్

‘రెడ్’కి రియల్ హీరో రవికిషోర్

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రెడ్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. “సిల్వర్‌స్క్రీన్ మీద రామ్ చలాకీతనాన్ని చూసిన తరువాత అతన్ని ఎనర్జిటిక్ స్టార్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో రామ్ చేసిన పాత్రలో నటించడం అంత సులభం కాదు. ఇక ‘రెడ్’లో రామ్ ద్విపాత్రాభినయం చేసి అద్భుతంగా నటించాడు.

రవికిశోర్‌కి నేను చాలా రుణపడి ఉన్నాను. ఖాళీగా ఉన్న నాతో స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలు రాయించి నా కేరీర్ మార్చేసిన నిర్మాత ఆయన. రవికిశోర్ లాంటి మంచి సంస్కారం ఉన్నవాళ్లు సినిమాలు తీయడం ఆపకూడదు”అని అన్నారు. అనంతరం త్రివిక్రమ్… రవికిశోర్ కాళ్ళకి నమస్కరించారు. హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ.. “రెడ్ చిత్రానికి రియల్ హీరో మా పెద్దనాన్న రవికిషోర్. కరోనా సమయంలో వచ్చిన ఇబ్బందులన్నింటినీ తట్టుకొని ఈ చిత్రాన్ని ఈ రోజు థియేటర్ల వరకు తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అందుకే ఈ చిత్రానికి ఆయనే హీరో”అని చెప్పారు. దర్శకుడు తిరుమల కిషోర్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. గురువారం ‘రెడ్’ను థియేటర్లలో చూడండి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, సమీర్ రెడ్డి, ఎ.ఎస్.ప్రకాష్, జునైద్, కృష్ణ పోతినేని తదితరులు పాల్గొన్నారు.

RED Movie Pre Release Event